
పెద్ద పులులను సైతం ఎదిరించే ధైర్యం ఈ కుక్కల సొంతం
ఆహారం కోసం నిరంతరం సంచారం
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో క్రూర జంతువులైన అడవి కుక్కలు (వైల్డ్ డాగ్స్) గుంపులుగా సంచరిస్తున్నాయి. ఇవి అటవీ ప్రాంతంలోని అనేక జంతువులను వేటాడుతుంటాయి. పులిని సైతం అడవి కుక్కలు భయపెట్టగలవని చెబుతుంటారు. అడవి కుక్కలు సంచరించే ప్రదేశాల్లో పులులు కూడా సంచరించవని.. వాటి ఉనికిని కనిపెట్టి తప్పించుకుని తిరుగుతాయని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. పరిమాణంలో ఊరకుక్కల కంటే కొంచెం పెద్దవిగా ఉండే వైల్డ్‌డాగ్స్ వాటి కంటే బరువు, శక్తి కలిగిన పెద్ద పులులను సైతం సమూహ శక్తితో తరిమికొట్టగలవు.
అడవిలో సంచరించే అడవి పందిని ఈ వైల్డ్‌డాగ్స్ చిటికెలో వేటాడి ఆహారంగా మార్చుకుంటాయి. వాటి బరువుతో పోల్చుకుంటే ఎన్నో రెట్లు పెద్దవైన కణితి(సాంబార్ డీర్), మనిమేగం లాంటి పెద్ద జింక జాతి జంతువులను కూడా ఈ అడవి కుక్కల సమూహం వెంటాడి వేటాడతాయి. ఈ వైల్డ్‌డాగ్ గుంపులు ఒకే ప్రదేశంలో స్థిరంగా ఉండకుండా నిరంతరం వేర్వేరు ప్రాంతాలకు తిరుగుతూనే ఉంటాయి. ఇవి ఊర కుక్కల కంటే కాస్త పెద్దవిగా ఉంటాయి. వీటి తోకకు వెంట్రుకలు కుచ్చుగా ఉంటాయి. ఇవి యూరప్ దేశాల్లో నల్ల మచ్చలతో కనిపిస్తాయి.
అభయారణ్యాల్లో అధికంగా సంచారం
అభయారణ్యాలుగా ఉన్న పాపికొండలు, నాగార్జున సాగర్, శ్రీశైలం అభయారణ్యం, గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో అడవి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని వైల్డ్‌లైఫ్ అధికారులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని కవ్వాల్ టైగర్ జోన్ పరిధిలో కూడా అడవి కుక్కల సంచారం అధికంగా ఉన్నట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు.
పాపికొండల అభయారణ్యంలో సుమారు 200 కుక్కలకు పైగా గుంపులుగా సంచరిస్తున్నట్లు గుర్తించామని ప్రస్తుతం వాటి జాడ అల్లూరి సీతారామరాజు అటవీ ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించినట్లు అటవీశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో గోదావరి పరీవాహక ప్రాంతాల్లో గ్రామాలు ఖాళీ అవుతున్న నేపద్యంలో ఇవి స్వేచ్ఛగా సంచరించడానికి మరింత అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
సమతుల్యతకు ప్రధాన భూమిక
వైల్డ్ డాగ్స్ జీవావరణ సమతుల్యతలో ప్రధాన భూమిక పోషిస్తుంటాయి. మాంసాహార జంతువులైన చిరుత పులి, పెద్దపులి, అడవి కుక్కల సంఖ్య తగ్గిపోతే వాటి ఆహార జంతువులైన వివిధ జంతువులు, జింకల సంఖ్య అమాంతంగా పెరిగి అడవిలోని వృక్షాలు తగ్గిపోతాయి. రైతులకు ఇబ్బంది కలిగించే అడవి పందులు, జింకల సంఖ్య పెరుగుదల ప్రమాదకరంగా మారకుండా నియంత్రణలో ఈ అడవి కుక్కలు ప్రధాన భూమిక పోషిస్తాయని అధికారులు అంటున్నారు.