మీడియాతో మాట్లాడుతూ కంటతడి పెట్టుకున్న పెద్ద దస్తగిరి భార్య రమణమ్మ
పెద్ద దస్తగిరి భార్య కల్లమల్ల రమణమ్మ స్పష్టీకరణ
నిత్యానందరెడ్డికి, నా భర్తకు ఎలాంటి గొడవలు లేవు
రియల్ ఎస్టేట్ వ్యాపారంలో నా భర్తకు వివాదాలూ లేవు
గొడవ జరిగిన గంట తర్వాత 108, ఆ తర్వాత పోలీసులు వచ్చారు
పోలీసులు రిమ్స్‌కు వెళ్లి కేసు పెట్టమన్నందుకే అప్పటికప్పుడు వెళ్లాం
లేకపోతే తెల్లారిన తర్వాత వెళ్లేవాళ్లం..
ప్రాణాలు పోసే చోట నా భర్త ప్రాణం తీశారు
ప్రభుత్వం నాకు, నా బిడ్డలకు న్యాయం చేయాలి
కడప కార్పొరేషన్: నా భర్త 30 ఏళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారని, ఆయన చేసే వ్యాపారంలో ఎవరితోనూ ఎలాంటి వివాదాలూ లేవని ఇటీవల కడప రిమ్స్ ఆవరణలో హత్యకు గురైన ఆలంఖాన్‌పల్లెకు చెందిన పెద్ద దస్తగిరి భార్య కల్లమల్ల రమణమ్మ స్పష్టం చేశారు. గురువారం వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యాలయంలో కుమారుడు వెంకట దస్తగిరి, మరిది చిన్న దస్తగిరితో కలిసి ఆమె విలేకరుల సమావేశం నిర్వహించారు. తన భర్త పెద్ద దస్తగిరి ప్లాట్లు అమ్మడం, కొనడం చేసేవారని.. అన్ని పార్టీల నాయకులతోనూ ఆయనకు సత్సంబంధాలే ఉన్నాయన్నారు. తాము ఎవరికీ బినావీులం కాదని స్పష్టం చేశారు.
ఈనెల 5న ఆదివారం ఆలంఖాన్‌పల్లెలో జాతర సందర్భంగా తన కుమారుడు వెంకట దస్తగిరి డ్యాన్స్ చేస్తుండగా నిందితులతో గొడవ జరిగిందని చెప్పాడని, ఆ సమయంలో తన కుమార్తెను బెంగళూరుకు పంపేందుకు తాము ఏడు రోడ్ల వద్ద ఉన్నామని తెలిపారు. ఆమెను బస్సు ఎక్కించిన తర్వాత జాతర వద్దకు వెళ్లి గొడవకు దిగిన రాజా, రవి అనే వారిని మందలించామని చెప్పారు. ఈలోపే వారు ఎవరెవరికో ఫోన్లు చేసి మందిని పిలిపించి కత్తులు, రాడ్లు, బండలతో తమపై దాడికి పాల్పడ్డారని కన్నీరుమున్నీరయ్యారు.
ఈ క్రమంలో ఓ ముసలావిడను తోసేయడంతో ఆమె నడుము విరిగిందని తెలిపారు. గొడవ సర్దుబాటు చేసేందుకు వచ్చిన వారినీ నిందితులు కత్తులతో పొడిచారని రమణమ్మ వివరించారు. తాము ఫోన్ చేసిన గంట తర్వాత 108 వాహనం వచ్చిందని, ఆ తర్వాతే పోలీసులు వచ్చారని చెప్పారు. తమ ఇంటి వద్ద ఇద్దరు పోలీసులను కాపలా ఉంచి, దాడిలో గాయపడిన కఠారి దస్తగిరి, మౌలాలి, సంటెక్కలను 108 వాహనంలో రిమ్స్‌కు పంపామన్నారు.
చెట్లపొదల్లో మాటువేసి ఒక్కసారిగా దాడి
పోలీసులు తమను ఆస్పత్రికి వెళ్లాలని, అక్కడే కేసు పెట్టాలని చెప్పడంతో తాము రిమ్స్ ఆసుపత్రికి అర్ధరాత్రి వెళ్లామని రమణమ్మ తెలిపారు. లేదంటే ఉదయం వెళ్లే వాళ్లమన్నారు. తమపై దాడికి పాల్పడిన వారు అప్పటికే అక్కడ చేరుకుని పొదల మాటున దాక్కున్నారని.. తన భర్త, మరిది, తాను ఎక్స్‌రేలు తీయించుకొని రిమ్స్ ఓపీ నుంచి బయటికి రాగానే వారు తన భర్తతో పాటు మరిది చిన్న దస్తగిరిని విచక్షణారహితంగా కత్తులతో పొడిచారని రమణమ్మ విలపించారు. ఈ దాడిలో తన భర్త చనిపోగా, తన మరిదికి 12 కత్తి పోట్లు పడ్డాయని వివరించారు.
గతంలో ఆలంఖాన్‌పల్లెలో రాజా, రవి, వెంకటేష్, ఆనంద్, మనోహర్ తదితరులు చాలా గొడవలు చేశారని, ఈ దాడి నాలుగవదని వివరించారు. గొడవ సమయంలో వారంతా మద్యం, గంజాయి తాగి ఉన్నారని, వారిని ఎదుర్కోవడం, ఆపడం ఎవరి వల్ల కాలేదని చెప్పారు. తన భర్త ఒకరి సొమ్ము తినలేదని, ఎవరి ఆస్తులూ ఆక్రమించుకోలేదని చెప్పారు. జాతరలో జరిగిన చిన్న గొడవకు ఇంత దారుణంగా పొడిచి ఎందుకు చంపారో అర్థం కాలేదన్నారు.
నిత్యానందరెడ్డికి,నా భర్తకు మధ్య ఎలాంటి గొడవలూ లేవు
మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డికి, తన భర్త పెద్ద దస్తగిరికి మధ్య ఎలాంటి గొడవలు లేవని రమణమ్మ స్పష్టం చేశారు. వైఎస్సార్‌సీపీ నాయకులతోపాటు ఇతర పార్టీల నాయకులతో కలిసి తన భర్త వ్యాపారం చేసేవాడన్నారు. ఈనెల 10న రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి తమను బయట కూర్చొబెట్టి, సుమారు 3 గంటల పాటు సోదాలు చేసి ఇంట్లో ఉన్న డాక్యుమెంట్లు, బాండ్లు, పాస్‌పుస్తకాలు, అగ్రిమెంట్లు, ఎల్‌ఐసీ డాక్యుమెంట్లు అన్నీ తీసుకుపోయారని చెప్పారు. అవన్నీ వ్యాపారానికి సంబంధించినవన్నారు. వాటిని పోలీసులు తిరిగి ఇచ్చేస్తామని చెప్పారని, ఇంతవరకూ ఇవ్వలేదన్నారు.
ఇప్పటికైనా వాటిని తిరిగి ఇవ్వాలని కోరారు. తన భర్త కష్టపడి కొన్ని ఆస్తులు సంపాదించారని, ఎవరికీ ద్రోహం చేయలేదని, ఒకరి సొమ్ము తినలేదని స్పష్టం చేశారు. ప్రాణాలు పోసే రిమ్స్‌లో తన భర్త ప్రాణాలు తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తనకు, తన బిడ్డలకు న్యాయం చేయాలని కోరారు.


