సీతా ఫలంతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

Custard Apple Health Benefits - Sakshi

రాయదుర్గం(అనంతపురం జిల్లా): ఎరువులు వేయాల్సిన పనిలేదు. సాధారణ పంటల్లా నీరు కట్టాల్సిన అవసరం లేదు. రేయింబవళ్లూ కాపలా ఉండాల్సిన అవసరం అంత కంటే ఉండదు. కేవలం సహజసిద్ధంగా, కొంత వర్షం వచ్చిందంటే వాటంతట అవే కాసేస్తాయి. పేదోళ్లకు ఉన్నంతలో పోషకాలందించడమే కాకుండా జీవనోపాధిని కూడా కల్పిస్తున్నాయా పండ్లు. ఇంతటి ప్రఖ్యాతి గాంచిన ఫలరాజసాలు సీతాఫలాలు.
చదవండి: ఏపీలో మరో భారీ సంక్షేమ పథకం.. అక్టోబర్‌ 1 నుంచి అమలు

అదనులో వర్షాలు కురవడం.. కొండ ప్రాంతాలన్నీ నందనవనాలను తలపించడం వెరసి సీతాఫలాలు విరగ్గాశాయి. కాయలు పక్వానికి రావడంతో కోతలు మొదలు పెట్టిన వ్యాపారులు మార్కెట్లో గంపలను నింపేశారు. అనంతపురం జిల్లా గుమ్మఘట్ట మండలం నల్లకొండ, బోడిగుట్ట, అడిగుప్ప కొండలతో పాటు పైతోట, చెరువుదొడ్డి, సిరిగేదొడ్డి, రాయదుర్గం తదితర ప్రాంతాల్లో ఈ కాయలు ఎక్కువగా లభిస్తాయి.

మాంసకృతులు, ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభిస్తుండడంతో సీతాఫలాలకు గిరాకీ తగ్గడం లేదు. గంపలో 200 కాయలు చిన్నవిగా ఉంటే రూ.200– 250, కాస్త సైజు ఉంటే రూ.300లు, 30 కేజీలు పట్టే బాక్సయితే రూ.600–700 వరకు విక్రయిస్తున్నారు. యాపిల్‌లో ఉండే పోషకాలకు దీటుగా లభ్యం కావడంతో ఈ పేదోడి యాపిల్‌ సీజన్‌ నవంబర్‌ చివరి కంతా పూర్తి కానుంది.

సీతాఫలం ప్రాముఖ్యతే వేరు.. 
అరటి, బొప్పాయి, ద్రాక్ష, అంజూర, జామ, దానిమ్మ, యాపిల్, సపోట, మామిడి లాంటి పండ్ల ఉత్పత్తికి ఎన్నో రకాల క్రిమి సంహారక మందులు వాడుతుంటారు. రసాయనిక ఎరువులు కూడా వినియోగిస్తారు. పండ్లు కోతకొచ్చాక మాగేందుకు సైతం రసాయనాలు చల్లుతారు. ఇలాంటివి తింటే ఆరోగ్యానికి హానికరం. అయితే ప్రకృతిసిద్ధంగా పండిన సీతాఫలాలు రసాయన రహితంగా ఉండి చక్కటి ఆరోగ్యాన్నిస్తాయి.

పది వేల ఎకరాల్లో విస్తరించిన చెట్లు.. 
రాయదుర్గం పరిసరాల్లో కొండలు, గుట్టలు అధికంగా ఉండడంతో సీతాఫలం చెట్లు పది వేల ఎకరాలకు పైగా విస్తరించాయి. గుమ్మఘట్ట మండలంలో అత్యధికంగా ఈ చెట్లు ఉన్నాయి. ఈ ప్రాంతంలో సీతాఫలాల అమ్మకాలపై ఆధారపడి సుమారు 650 కుటుంబాల వారు జీవనోపాధి పొందుతున్నారు. వర్షాకాలం మొదలైందంటేæ చాలు ఇంటిల్లిపాదీ ఈ పనిలోనే నిమగ్నమైపోతారు. చెట్లలో కాయలు పక్వానికి వచ్చాయని తెలియగానే వేకువ జామునే కొండ ఎక్కడం.. కాయలు కోయడం.. వెంటనే మార్కెట్‌కు తరలించడం చేస్తారు. 

100 గ్రాముల సీతాఫలంలో లభ్యమయ్యే పోషకాలు..
చక్కెర శాతం 19 నుంచి 29 గ్రాముల వరకు  
23.05 గ్రాముల కార్బోహైడ్రేట్లు 
104 కిలోల కేలరీల శక్తి 
3.1 గ్రాముల ఫైబర్‌ 
1.6 గ్రాముల ప్రొటీన్లు 
17 మిల్లీ గ్రాముల క్యాల్షియం. 
0.4 గ్రాముల కొవ్వుపదార్ధాలు 
4.37 గ్రాముల ఫాస్పర్‌ 
 4.37 మిల్లీ గ్రాముల ఐరన్‌ 
37 మిల్లీ గ్రాముల సీ–విటమిన్‌ 

పండ్లే జీవనాధానం 
20 ఏళ్లుగా సీతాఫలాల వ్యాపారం చేస్తున్నా. సీజన్‌లో ఈ పండ్లే మాకు జీవనాధారం. సాయంత్రమే కొండమీద నుంచి కాయలు ఇంటికి తెచ్చుకుంటాం. ఉదయమే మార్కెట్‌కు తీసుకొస్తాం. కాయల సైజు బాగుండడంతో మధ్యాహ్నానికంతా అమ్ముకుని రూ.వెయ్యి సంపాదనతో ఇంటికి చేరుకుంటున్నా. 
–ముద్దమ్మ, సీతాఫలం వ్యాపారి,చెరువుదొడ్డి

కర్ణాటక నుంచీ వస్తున్నారు 
రాయదుర్గం సీతాఫలాలు ఎంతో ప్రఖ్యాతిగాంచాయి. బళ్లారి, బెంగళూరు, చెళ్లకెర, చిత్రదుర్గం నుంచి చాలా మంది వ్యాపారులు కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. నల్లకొండ నుంచి ఎక్కువగా కాయలు తీసుకొచ్చి అమ్మకం చేపడతా. వర్షం సక్రమంగా కురిస్తే చాలు పంట చేతికందుతుంది. పైసా పెట్టుబడి కూడా అవసరం లేదు. ఈ పండ్లను షుగర్‌ ఉన్న వారు కూడా తింటే ఏమీ కాదని వైద్యులే చెబుతున్నారు. 
– బంజోబయ్య, సీతాఫలం వ్యాపారి, బంజయ్యనగర్‌ 

వర్షాలకు చెట్లు ఏపుగా పెరిగాయి 
సీతాఫలాల చెట్లు వందల కుటుంబాలకు జీవనాధారమయ్యాయి. ఇవి మూడేళ్లుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఏపుగా పెరిగాయి. అంతకు ముందు సరైన వానలు లేక దిగుబడుల మాట అటుంచితే చెట్లన్నీ ఎండిపోయి కొండలు కళావిహీనంగా కనిపించేవి. ఇప్పుడు మాత్రం కళకళలాడుతున్నాయి. ఈసారి మంచి దిగుబడినిచ్చాయి.  
– కుళ్లాయిస్వామి, కామయ్యతొట, రాయదుర్గం  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top