మంత్రి చెబితేనే చేస్తా..! | Corruption in Chandrababu government: Andhra Pradesh | Sakshi
Sakshi News home page

మంత్రి చెబితేనే చేస్తా..!

May 15 2026 5:20 AM | Updated on May 15 2026 5:20 AM

Corruption in Chandrababu government: Andhra Pradesh

గృహనిర్మాణ సంస్థలో అమాత్యుడి అండతో రెచ్చిపోతున్న ఓ అధికారిణి   

రూ.180 కోట్ల కేంద్ర నిధులున్నా పేదల ఇంటి బిల్లులు ప్రాసెస్‌ చేయని దుస్థితి  

ఆప్షన్‌–3 ఏజెన్సీలతో కమీషన్ల కోసం అమాత్యుడే బిల్లులు ఆపిస్తున్నారన్న ఆరోపణలు

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో పేదల ఇంటి నిర్మాణ బిల్లులు మంజూరులోనూ కమీషన్ల కోసం పాకులాడుతున్నారు. ఇందుకు గృహ నిర్మాణ శాఖలో జరుగుతున్న పరిణామాలే నిదర్శనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.180 కోట్లు రాష్ట్ర గృహనిర్మాణ సంస్థలో ఉన్నా.. కమీషన్ల కోసం ఒక అమాత్యుడు బిల్లులు ప్రాసెస్‌ చేయకుండా అడ్డుపడుతున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సంస్థ ఫైనాన్స్‌ విభాగంలోని ఒక కీలక అధికారిణి.. మంత్రి చెబితేనే బిల్లులు ప్రాసెస్‌ చేస్తానని భీష్మించుకుని కూర్చోవడం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.

ప్రస్తుతం క్షేత్ర స్థాయి నుంచి గృహనిర్మాణ సంస్థ వరకు వివిధ దశల్లో రూ.30 కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు సమాచారం. వీటిలో రూ.20 కోట్లకుపైనే ఆప్షన్‌–3 ఇళ్ల బిల్లులున్నట్లు తెలుస్తోంది. రూ.180 కోట్లు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయడం లేదు. దీనికి ప్రధాన కారణం అమాత్యుడి ఆదేశాలేనన్న విమర్శలున్నాయి. కమీషన్ల కోసం ఆప్షన్‌–3 ఇళ్ల నిర్మాణ ఏజెన్సీల నిర్వాహకులను తన దగ్గరకు వచ్చేలా చేసుకోవడం కోసం బిల్లులు చెల్లించవద్దని అమాత్యుడు హుకుం జారీ చేసినట్టు విశ్వసనీయ సమాచారం. ‘రూ.180 కోట్ల నిధులు అమాత్యుడు కేంద్రానికి తిరిగి ఇచ్చేయమన్నారు.

ఎవరు చెప్పినా నేను బిల్లులు ప్రాసెస్‌ చేయను. పెండింగ్‌ బిల్లులు ప్రాసెస్‌ చేయాలంటే నాకు అమాత్యుడి నుంచి ఆదేశాలు రావాలి’ అని సదరు అధికారిణి తేల్చి చెబుతున్నారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. సిఫార్సులు లేకుండా పారదర్శకంగా సాగాల్సిన బిల్లుల చెల్లింపులను చంద్రబాబు సర్కార్‌ ఏర్పాటయ్యాక గందరగోళం చేసేశారు. తనను కలిసిన ఆప్షన్‌–3 ఏజెన్సీలకు ప్రాధాన్యత క్రమంలో బిల్లులు ఇవ్వాలంటూ అధికారులను ఆదేశిస్తూ అమాత్యుడు ఆదేశాలు ఇచ్చిన లేఖలు గతంలో వెలుగుచూశాయి.  

ఉన్నతాధికారులు పూచికపుల్లతో సమానం
కేంద్రం గృహనిర్మాణ పథకాన్ని సింగిల్‌ నోడల్‌ ఏజెన్సీ (ఎస్‌ఎన్‌ఏ) విధానం నుంచి స్పర్‌‡్షలోకి మారుస్తోంది. ఈ క్రమంలో ప్రస్తుతం రాష్ట్రం దగ్గర ఉన్న రూ.180 కోట్ల నిధులు కేంద్రానికి ఇచ్చేస్తే పేదల ఇళ్ల నిర్మాణాలపై ప్రభావం పడుతుంది. వాస్తవానికి రూ.180 కోట్లను లబ్ధిదారుల ఖాతాల్లో రిజర్వ్‌ చేసి ఇళ్ల నిర్మాణ దశల ఆధారంగా బిల్లులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఇలా చేస్తే పేదలకు మేలు జరుగుతుంది. ఈ అవకాశాన్ని కాదని చంద్రబాబు సర్కార్‌ రూ.180 కోట్లు కేంద్రానికి తిరిగి ఇచ్చేయడానికి ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది. దీంతో నిధులు వెనక్కిచ్చే వరకు పెండింగ్‌లో ఉన్న బిల్లులన్నీ చెల్లిద్దామని ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని సైతం ఫైనాన్స్‌ విభాగం అధికారిణి బేఖాతరు చేస్తున్నారు. అమాత్యుడి అండతో ఉన్నతాధికారులను సైతం పూచికపుల్లతో సమానంగా తీసి పారేస్తుండటం ఇప్పుడు గృహనిర్మాణ శాఖ వర్గాల్లో కలకలం రేపుతోంది. 

Advertisement
 
Advertisement
Advertisement