
పెట్టుబడులు తీసుకొచ్చినట్లు తాజాగా ఎస్‌ఐపీబీలో ఆమోదం
గత ప్రభుత్వ హయాంలోనే ఏటీసీ టైర్స్‌కు శంకుస్థాపన.. ఉత్పత్తి కూడా ప్రారంభం
పాలసముద్రం వద్ద బీఈఎల్–డీఆర్‌డీవో రక్షణ ఉత్పత్తుల యూనిట్ కూడా..
రూ.33 వేల కోట్ల పెట్టుబడులతో 19 ప్రాజెక్టులకు ఆమోదం అంటూ కూటమి ప్రభుత్వం ప్రచారం
సాక్షి, అమరావతి: కొత్త ప్రాజెక్టులను ఆకర్షించలేక గత ప్రభుత్వ హయాంలో వచ్చిన పెట్టుబడులను తాము సాధించినట్లు చెప్పుకోవడానికి కూటమి సర్కారు విఫలయత్నం చేస్తోంది. పాత ఒప్పందాలు, ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టి విస్తరణ చేపట్టిన వాటిని కొత్త ప్రాజెక్టులుగా పేర్కొంటూ గురువారం సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 6వ పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) ఆమోదం తెలిపింది.
వివిధ రంగాలకు చెందిన మొత్తం రూ.33,720 కోట్ల విలువైన 19 ప్రాజెక్టుల ద్వారా 34,621 మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కనున్నట్లు పేర్కొంది. అయితే, ఈ ప్రాజెక్టుల్లో అత్యధికం వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో వచి్చనవే కావడం గమనార్హం. ఆ వివరాలు ఒకసారి పరిశీలిస్తే..
» జపాన్‌కు చెందిన ఏటీసీ టైర్స్ (యకహోమా) రూ.3,079 కోట్ల పెట్టుబడికి ఒప్పందం కుదుర్చుకుంది. వాస్తవానికి ఈ ప్రతిపాదనకు 2020 నవంబరులో అప్పటి సీఎం వైఎస్ జగన్ అధ్యక్షతన జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో ఆమోద ముద్ర పడింది. 2021 ఫిబ్రవరిలో పనులు ప్రారంభమవగా 2022 ఆగస్టులో వైఎస్ జగన్ ఈ పరిశ్రమను ప్రారంభించారు. తొలి దశలో రూ.1,750 కోట్లు పెట్టిన ఏటీసీ టైర్స్ ఉత్పత్తిని కూడా ప్రారంభించింది. అప్పుడే రెండో దశను కూడా ప్రకటించింది. కానీ, ఈ విస్తరణ ప్రతిపాదనను కూటమి సర్కారు నిస్సిగ్గుగా ఇప్పుడు తన ఖాతాలో వేసుకుంది.
» పీఎల్‌ఐ కింద డైకిన్ సంస్థ శ్రీ సిటీలో దక్షిణాదిలోనే అతిపెద్ద ఎయిర్ కండిషన్ తయారీ యూనిట్ నిర్మాణాన్ని 2022లో మొదలుపెట్టింది. 2023 నవంబరులో ఉత్పత్తి కూడా ప్రారంభించింది. రూ.1,000 కోట్లతో 75 ఎకరాల్లో యూనిట్ ఏర్పాటు చేసిన డైకిన్ విస్తరణ కోసం 2024లో మరో 33 ఎకరాలను కొనుగోలు చేసింది. దీన్ని కూడా కూటమి సర్కారు తన ఖాతాలో వేసుకుంది.
»డీఆర్‌డీవోతో కలిసి శ్రీ సత్యసాయి జిల్లా పాలసముద్రంలో భారత్ ఎల్రక్టానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) రక్షణ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఒప్పందం కుదుర్చుకుంది. 2022 నవంబరులో రక్షణ శాఖ అప్పటి కార్యదర్శి గిరిధర్ నాటి సీఎం వైఎస్ జగన్‌ను కలిసి ఈ ప్రతిపాదన చేశారు. అదే రోజు మచిలీపట్నంలో జరిగిన బీఈఎల్ బోర్డు డైరెక్టర్ల సమావేశంలో యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. ఇదేదో కొత్తగా వచ్చినట్లు ఇప్పుడు ఎస్‌ఐపీబీ ఆమోదం తెలిపింది.
» దక్కన్ ఫైన్ కెమికల్స్‌కు తూర్పుగోదావరి జిల్లా కేశవరం వద్ద ఎప్పటినుంచో ప్రత్యేక రసాయనాల తయారీ యూనిట్ ఉంది. ఏలూరు జిల్లా వట్టిగుడిపాడులో మోహన్ స్పిన్‌టెక్ 2007లో అప్పటి సీఎం వైఎస్సార్ హయాంలోనే యూనిట్ నెలకొల్పింది. రామభద్ర ఇండస్ట్రీస్ 2006లో తణుకు కేంద్రంగా ఏర్పాటైంది. ఈ కంపెనీల విస్తరణ ప్రాజెక్టులకు తాజాగా ఎస్‌ఐపీబీ ఓకే చెప్పింది.
ప్రాజెక్టుల పురోగతిపై నిరంతర పర్యవేక్షణ: చంద్రబాబు
ఎస్‌ఐపీబీ సమావేశంలో సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ‘రాష్ట్రంలో పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకున్న ప్రాజెక్టుల శంకుస్థాపన నుంచి ప్రారంభం వరకు అధికారులు నిరంతర పర్యవేక్షణ జరపాలి. ప్రతి ప్రాజెక్టు పురోగతి పరిశీలనకు డాష్ బోర్డ్ తీసుకురావాలి. టూరిజంలో హోటళ్లు, రూముల కొరత ఉంది. కొత్తగా 50 వేల రూమ్‌లు అందుబాటులోకి తీసుకురావాలి.
కారవాన్స్‌కు సంబంధించిన పాలసీని కూడా సిద్ధం చేసి అమల్లోకి తేవడం ద్వారా పర్యాటకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. రద్దీగా ఉండే 21 దేవాలయాల్లో వసతి సౌకర్యం పెంచాలి. టెంట్లు (గుడారాలు) ఏర్పాటు ప్రారంభించాలి. వ్యవసాయ వ్యర్థాలను తగులబెట్టకుండా చిన్నచిన్న ప్లాంట్ల ద్వారా సర్క్యులర్ ఎకానమీగా మార్చాలి’ అని సూచించారు.