పేదల తరుపున ప్రభుత్వం పోరాడింది.. ఇక అమరావతి అందరిది: వెంకటపాలెం సభలో సీఎం జగన్‌

AP CM YS JAGAN TORU IN AMARAIVTI - Sakshi

సాక్షి, గుంటూరు: ‘‘దేశ చరిత్రలోనే ఈ కార్యక్రమానికి ఓ ప్రత్యేకత ఉంది. పేదలకు ఇళ్ల పట్టాలు వద్దని కోర్టులకెక్కి అడ్డుకున్నారు. పేదల కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వమే న్యాయపోరాటం చేసింది.  ఇది పేదల విజయం’’ అని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. 

శుక్రవారం అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా..  వెంకటపాలెం బహిరంగ సభ నుంచి సీఎం జగన్‌ ప్రసంగించారు. పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా కుట్రలు చేసి అడ్డుకునే ప్రయత్నం చేశారు. పేదల కోసం న్యాయ పోరాటం చేశాం. విజయం సాధించాం. ఇప్పుడు రూ. ఏడు లక్షల నుంచి 10 లక్షల విలువ చేసే ఇంటి స్థలం.. అక్కచెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేస్తున్నాం. అమరావతి ఇక మీద సామాజిక అమరావతి అవుతుంది. మన అందరి అమరావతి అవుతుందని గర్వంగా చెప్పగలుగుతున్నా అని ప్రసంగించారాయన. 

👉 ఇవి ఇళ్ల పట్టాలే కాదు.. సామాజిక, న్యాయ పత్రాలు కూడా. సామాజిక అమరావతే.. మనందరి అమరావతి. 50, 793 మంది పేదలకు ఇళ్ల స్థలాలు అందజేస్తున్నాం. సీఆర్డీఏ పరిధిలో 1,402.58 ఎకరాల్లో మొత్తం 25 లేఅవుట్లలో ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. వారం పాటు ఇళ్ల పట్టాల పండు కార్యక్రమం ఉంటుందని, ఇళ్లు కట్టడానికి బీజం కూడా ఈ వారంలోనే పడుతుందని అని సీఎం జగన్‌ ప్రకటించారు. 

👉 దివంగత మహానేత వైఎస్సార్‌ జయంతి సందర్భంగా.. జులై 8వ తేదీన ఇళ్లు కట్టించే కార్యక్రమం చేపడతామని సీఎం జగన్‌ ప్రకటించారు. ఇప్పటికే లే అవుట్లలో మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయని,  జులై 8వ తేదీ లోగా జియో ట్యాగింగ్‌ పూర్తి చేస్తామని తెలిపారాయన. 

👉 ఇళ్ల నిర్మాణాలకు మూడు ఆప్షన్లు ఉంటాయని సీఎం జగన్‌ వెల్లడించారు. సొంతంగా ఇళ్లు కట్టుకుంటే.. రూ. లక్షా 80 వేలు బ్యాంకు ఖాతాల్లో వేస్తాం. రెండో ఆప్షన్‌లో నిర్మాణ కూలీ మొత్తాన్ని జమ చేస్తాం. ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా ప్రభుత్వమే అందిస్తుంది. స్టీల్‌, సిమెంట్‌, డోర్‌ ఫ్రేమ్‌లు సబ్సిడీపై అందిస్తాం. మెటీరియల్‌ నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు అని సీఎం జగన్‌ ప్రకటించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top