రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వం ఇది..

CM YS Jagan Released YSR Sunna Vaddi Scheme Funds - Sakshi

వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్ము రైతుల ఖాతాల్లో జమ

సకాలంలో బాకీ తీర్చేస్తే సర్కారే వడ్డీ చెల్లిస్తుందనే నమ్మకం కలిగించాం: సీఎం వైఎస్‌ జగన్‌

14.58 లక్షల మంది రైతులకు రూ.510.32 కోట్లు చెల్లింపు

అక్టోబర్‌లో పంట నష్టపోయిన 1.97 లక్షల మందికి రూ.132 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లింపు

గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ రూ.1,180 కోట్లు చెల్లించాం

రైతులు, అక్కచెల్లెమ్మలకు మరింత ఆదాయం వచ్చేలా అమూల్‌ ద్వారా పాలసేకరణ

దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా

ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. సీఎం స్థానంలో మీ బిడ్డ కూర్చున్నారు. విత్తనం నుంచి పంట అమ్మకాల వరకు సహాయపడే విధంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశాం. రైతులకు ఎంత చేసినా తక్కువే. దేశంలో గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా రైతులకు మన ప్రభుత్వం భరోసా ఇచ్చింది. రైతుల పట్ల మమకారం, బాధ్యతతో గత సర్కారు బకాయి పెట్టిన సున్నా వడ్డీ సొమ్ము రూ.1,180 కోట్లు చెల్లించాం.

ఈ నెలాఖరుకు ఏడాదిన్నర పాలన పూర్తవుతుంది. ఈలోగానే మేనిఫెస్టోను ఒక భగవద్గీత, బైబిల్, ఖురాన్‌లా భావించి 90 శాతం హామీలు అమలు చేశామని సగర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం కాబట్టే, ప్రజా ప్రతినిధులు ధైర్యంగా తలెత్తుకుని గ్రామాల్లోకి, ప్రజల్లోకి వెళ్తున్నారు.  
– సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

గతంలో ధర్నాలు చేసినా పరిహారం వచ్చేది కాదు
గతంలో పంట నష్టపోతే రోడ్డెక్కి ధర్నాలు చేసినా పరిహారం డబ్బులు వచ్చేవి కావు. ఇప్పుడు పంట నష్టపోయిన నెల రోజుల్లోనే పంట నష్టపరిహారం ఇవ్వడం రికార్డు. రైతుల పాలిట మీరు దేవుడు. నేను ఐదు ఎకరాల పొలంలో వేరుశనగ వేశాను. వర్షాలు సకాలంలో పడ్డాయి. అయితే అధిక వర్షాల వల్ల పంట కొంత లాస్‌ అయ్యాం. వ్యవసాయ శాఖ అధికారులు వచ్చి నష్టం అంచనా వేశారు. నెల తిరక్కుండానే పరిహారం అందింది.  
– శ్రీధర్, ఆత్మకూరు, అనంతపురం జిల్లా

సాక్షి, అమరావతి : ఇది రైతుల పక్షపాత ప్రభుత్వమని, రైతుల శ్రమ తెలిసిన ప్రభుత్వమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. సకాలంలో పంట రుణాలు చెల్లిస్తే ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తుందనే ఆత్మవిశ్వాసాన్ని, నమ్మకాన్ని రైతుల్లో కలిగించామన్నారు. 2019 ఖరీఫ్‌కు సంబంధించి 14.58 లక్షల మంది రైతులకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.510.32 కోట్లను మంగళవారం ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి చెల్లించారు. అలాగే రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నెల అక్టోబర్‌లో వరదల కారణంగా పంటలు నష్టపోయిన 1.97 లక్షల మంది రైతులకు నెల తిరగకుండానే ఇన్‌పుట్‌ సబ్సిడీ కింద రూ.132 కోట్లు చెల్లించారు. ఈ రెండు కార్యక్రమాలకు సంబంధించి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి ఆన్‌లైన్‌ ద్వారా రైతుల ఖాతాల్లో నగదు జమ చేశారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ జిల్లాల్లో సున్నా వడ్డీ, ఇన్‌పుట్‌ సబ్సిడీ లబ్ధిదారులైన రైతులనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. రైతులను ఆదుకోవడంలో ఈ రోజు నిజంగా మరో ఘట్టం అన్నారు. ఈ కార్యక్రమం వల్ల రైతులకు సకాలంలో పంట రుణాలు చెల్లించడం ఒక అలవాటు అవుతుందని చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా భరోసా ఇవ్వలేదని, మొదటిసారిగా ఆ నమ్మకం కలిగిస్తున్నామన్నారు. రాష్ట్రంలోని ప్రతి మూడు కుటుంబాలలో ఒక కుటుంబానికి అంటే దాదాపు 50 లక్షల రైతుల కుటుంబాలకు ఏటా రూ.13,500 చొప్పున రైతు భరోసా అందుతోందని వివరించారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే..
వైఎస్సార్‌ సున్నా వడ్డీ సొమ్మును రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌. చిత్రంలో మంత్రులు వేణుగోపాలకృష్ణ, కన్నబాబు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు తదితరులు 

గతంలో ఏం జరిగింది? 
► గతంలో రైతులను ఎలా మోసం చేశారో చూశాం. రుణ మాఫీ చేస్తామని చెప్పి చేయలేదు. 2015–16లో రైతులు రుణమాఫీ అవుతుందని ఆశించారు. వారు బ్యాంకులకు రుణాలు చెల్లించలేదు. కానీ వారికి నిరాశే మిగిలింది. 
► 2015–18 వరకు సున్నా వడ్డీ బకాయిలు కట్టకపోవడంతో దాదాపు రూ.1,180 కోట్లు బకాయి పడితే రైతుల మీద బాధ్యత, మమకారంతో మన ప్రభుత్వమే చెల్లించిందని గర్వంగా చెబుతున్నాను. 

మనం ఏం చేస్తున్నాం? 
► ఏ సీజన్‌లో పంట నష్టాన్ని అదే సీజన్‌లో ఇస్తామని చెప్పాము. ఆ మేరకు ఈ ఏడాది ఖరీఫ్‌లో జూన్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు జరిగిన పంట నష్టానికి సంబంధించి పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ)గా గత నెలలో 1.66 లక్షల రైతు కుటుంబాలకు దాదాపు రూ.136 కోట్లు వారి వారి ఖాతాల్లో జమ చేశాం.
► అక్టోబర్‌లో జరిగిన నష్టానికి సంబంధించి ఇవాళ 1,97,525 రైతు కుటుంబాలకు రూ.132 కోట్లు ఇన్‌పుట్‌ సబ్సిడీ చెల్లిస్తున్నాం. లక్ష లోపు రుణాలు తీసుకుని సకాలంలో తిరిగి చెల్లిస్తే, వారి వడ్డీ ప్రభుత్వమే కడుతోంది. ఎవరికైనా ఈ పథకాలు మిస్‌ అయితే గ్రామ సచివాలయాల్లో సంప్రదించాలి. లేదా వలంటీర్‌ను కలిసి చెప్పాలి.
► వైఎస్సార్‌ జలకళ ద్వారా ఉచితంగా బోర్ల తవ్వకం మొదలైంది. పేద రైతులకు మోటార్లు కూడా ఉచితంగా అందించబోతున్న ప్రభుత్వం మనది మాత్రమే. 

రైతుల కోసం బకాయిలు చెల్లించాం
► గత ప్రభుత్వం ఎగనామం పెట్టిన రూ.8,655 కోట్లు ఉచిత విద్యుత్‌ బకాయిలు, రూ.960 కోట్లు ధాన్యం కొనుగోళ్ల బకాయిలు, రూ.384 కోట్లు విత్తనాల సబ్సిడీ బకాయిలు, సున్నా వడ్డీ రాయితీకి సంబంధించి రూ.1,180 కోట్లు ఇస్తున్నాం.
► రైతులకు పగలే నాణ్యమైన విద్యుత్‌ ఇవ్వాలంటే ఆ స్థాయిలో ఫీడర్లు లేవు. కేవలం 58 శాతం ఫీడర్లు మాత్రమే ఆ కెపాసిటీతో ఉన్నాయి. దాంతో దాదాపు రూ.1,700 కోట్లు ఖర్చు చేసి వాటి సామర్థ్యం పెంచి, దాదాపు 90 శాతం ఫీడర్లు రెడీ చేసి నాణ్యమైన విద్యుత్‌ పగటి పూటే ఇవ్వగలుగుతున్నాం. మిగిలిన 10 శాతం ఫీడర్లు కూడా ఈ నెలాఖరులోగా సిద్ధమవుతాయని అధికారులు చెబుతున్నారు.

వచ్చే నెలలోనే బీమా క్లెయిమ్స్‌
► పంటల బీమా కింద రైతులు తమ వాటాగా కేవలం రూ.1 చెల్లిస్తే, ప్రభుత్వం పూర్తి ప్రీమియమ్‌ (రైతుల వాటా రూ.506 కోట్లు సహా) దాదాపు రూ.1,031 కోట్లు చెల్లిస్తోంది. ఆ బీమాకు సంబంధించి సుమారు రూ.1,800 కోట్ల బీమా క్లెయిమ్‌ డిసెంబర్‌లో చెల్లించే కార్యక్రమం జరుగుతుంది.

అన్నదాతల కోసం ఎన్నెన్నో చేస్తున్నాం 
► 13 జిల్లాలలో అగ్రి ల్యాబ్‌లు, 147 ఇంటిగ్రేటెడ్‌ ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తున్నాం. రైతులు, అక్క చెల్లెమ్మలకు ఇంకా ఆదాయం వచ్చేలా, ఈ నెల 26 నుంచి అమూల్‌ ద్వారా తొలి దశగా పాల సేకరణ ప్రారంభిస్తున్నాం. ప్రకాశం, చిత్తూరు, వైఎస్సార్‌ కడప జిల్లాలలో తొలి దశ పాల సేకరణ మొదలవుతుంది. 
► పాల సేకరణ కోసం మొత్తం 9,800 బల్క్‌ మిల్క్‌ చిల్లింగ్‌ యూనిట్లు (బీఎంసీయూ) ఆర్‌బీకేల పక్కనే ఏర్పాటు చేస్తున్నాం. 
► 2019–20లో దాదాపు రూ.15 వేల కోట్లతో ధాన్యం కొనుగోలు చేశాం. కోవిడ్‌ సమయంలోనూ రూ.3,200 కోట్లతో పంటలు కొనుగోలు చేశాం. రూ.666 కోట్లు పత్తి కొనుగోలు కోసం ఖర్చు చేశాం.  

ఎంతో ఆశ్చర్యపోతున్నాం
సీఎంగా జగన్‌మోహన్‌రెడ్డి ఏది చెప్పినా సాధ్యం అవుతోంది. ఇది రైతులతో సహా మమ్మల్ని ఆశ్చర్య పరుస్తోంది. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన ప్రచారానికి, ఆచరణలో చేసిన దానికి ఎక్కడా పొంతన లేదు. కానీ మీరు (వైఎస్‌ జగన్‌) వచ్చాక చెప్పింది చెప్పినట్లు జరుగుతోంది. 
    – కె.కన్నబాబు, వ్యవసాయ శాఖ మంత్రి 

మీ హయాంలో సాగు సులభమైంది
మేం వ్యవసాయం వదిలేద్దామనుకున్నాం. మీరు వచ్చాక తిరిగి సాగు సులభమైంది. నేను లక్ష రూపాయలు రుణం తీసుకున్నాను. నాకు రూ.3,218 వడ్డీ మాఫీ వచ్చింది. మా ఉమ్మడి కుటుంబంలో 8 మందికి రూ.3 వేలు చొప్పున రూ.24 వేలు వడ్డీ మాఫీ వచ్చింది. ఇప్పుడు క్రాప్‌ ఇన్సూరెన్స్‌ కూడా మీరే కడుతున్నారు. వివిధ పథకాల ద్వారా మా కుటుంబానికి రూ.2 లక్షల వరకు లబ్ధి కలిగింది.  
– ఎర్రినాయుడు, పెంట శ్రీరాంపురం, గంట్యాడ మండలం, విజయనగరం జిల్లా
సీఎం జగన్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేస్తున్న గుంటూరు జిల్లా నంబూరు రైతులు 

మీ పట్ల నమ్మకం పెరిగింది
మనసుంటే మార్గం ఉంటుందని మీరు నిరూపించారు. నా ఖాతాలో వడ్డీ రాయితీ రూ.3,876 జమ అయింది.  మీ పనితీరు పట్ల ప్రజల్లో పూర్తిగా నమ్మకం కలిగింది. సెప్టెంబర్‌లో నా పంట దెబ్బతింది. రైతు భరోసా కేంద్రానికి వెళ్లి నమోదు చేసుకుంటే.. డబ్బులు వస్తాయంటే మా నాన్న అవేమీ రావన్నాడు. కానీ మీరు నెల రోజుల్లోనే పంట నష్టానికి డబ్బులు వేశారు. కౌలు రైతులను గుర్తించింది మీరే.    
– విజయభాస్కర్‌రెడ్డి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top