మంచి మార్పుతో చరిత్ర లిఖిద్దాం.. మీతోడు అవసరం: రాజాం కార్యకర్తలతో సీఎం జగన్‌

CM YS Jagan Interaction With Rajam Party Workers Full Speech - Sakshi

సాక్షి, తాడేపల్లి: ఎన్నికల టైంలో చేసిన వాగ్దానాల్లో 95 శాతం పూర్తి చేశామని, ఆ ధైర్యంతోనే ఆశీర్వదించమని రాష్ట్రంలోని గడప గడపకూ వెళ్లగలుగుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తలతో ముఖాముఖిలో భాగంగా.. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గ కార్యకర్తలతో క్యాంపు కార్యాలయంలో ఆయన భేటీ నిర్వహించారు.  

‘‘మనం తెచ్చిన మార్పులు అన్నీకూడా మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ఇవన్నీ చూశాక మరో ముప్ఫై ఏళ్లపాటు మన ప్రభుత్వమే ఉండాలని ప్రజలు ఆశీర్వదిస్తారు. మీ నియోజకవర్గంలో డీబీటీ కింద రూ.775 కోట్లు ఇచ్చాం. మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇలాగే మంచి చేశాం. ఈసారి మన లక్ష్యం 151 కాదు..  175కి 175 అని ఉద్ఘాటించారు సీఎం జగన్‌. గతంలో ఉన్న ప్రభుత్వ పాలనకు, ఈ ప్రభుత్వ పాలనకూ ఉన్న తేడాను గమనించి.. వివిధ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేసిన ఈ ప్రభుత్వం చేసిన మంచిని మరింత విపులంగా చెప్పాలని ఆయన కార్యకర్తలతో చెప్పారు. 

మనం చేసిన మంచిని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లాలి. గత ఎన్నికల్లో వచ్చిన మెజార్టీకన్నా.. ఈసారి మరింత పెరగాలి. మేనిఫెస్టో ద్వారా చేసిన వాగ్దానాల్లో దాదాపు వాగ్దానాలను నిలబెట్టుకున్నాం. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ గడపగడపకూ కార్యక్రమంలో ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ చెప్పగలుగుతున్నాం. ఇవన్నీ వాస్తవాలు అయితేనే మళ్లీ మా ప్రభుత్వాన్ని, జగనన్నను ఆశీర్వదించండి అని ధైర్యంగా అడగగలుగుతున్నాం. 

మిగిలింది మీ కృషినే..
రాజాం నియోజకవర్గంలో 12,403 ఇంటి స్థలాలు ఇచ్చాం. దాదాపు రూ.240 కోట్లు విలువైన ఇంటి పట్టాలు ఇచ్చాం. వీటిలో 9,509 ఇళ్లను ఇప్పుడు కడుతున్నారు. వాటి విలువ కనీసంగా మరో రూ.171 కోట్లు ఉంటుంది. గతంలో..  నాన్నగారి హయాంలో ప్రతి ఎమ్మెల్యే, కార్యకర్త ధైర్యంగా గ్రామాలకు వెళ్లేవాళ్లు. ఇల్లు, రేషన్‌కార్డు, పెన్షన్‌.. ఇలా అన్నీ సమకూర్చారు. ఈరోజు అదే నిజాయితీతో, అదే అంకిత భావంతో మనం అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి గ్రామానికీ, ప్రతి ఇంటికీ ధైర్యంగా వెళ్లగలుగుతున్నాం. చేయాల్సిన మంచి అంతా చేశాం. ఇప్పుడు మనం చేయాల్సింది.. చేసిన మంచిని ఓట్ల రూపంలో మార్చుకోవడం. దీనికి కార్యకర్తలుగా మీ కృషి ఎంతో అవసరం. పార్టీపరంగా జిల్లా, మండలస్థాయి, గ్రామ స్థాయి వరకూ కమిటీలు ఏర్పాటు కావాలి. దాదాపు 24 అనుబంధ విభాగాలు పార్టీకి ఉన్నాయి. ఈ విభాగాలన్నింటికీ కమిటీలు ఏర్పాటు కావాలి. ఎక్కువ మందిని భాగస్వామ్యం చేయాలి అని సీఎం జగన్‌.. కార్యకర్తలను ఉద్దేశించి దిశానిర్దేశం చేశారు. 

అన్నీ అందుతున్నాయ్‌
బూత్‌ కమిటీలు కూడా ఏర్పాటు కావాలి. వీలైనంత వరకూ ప్రతి కమిటీలో కూడా కచ్చితంగా యాభైశాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉండేలా చూసుకోవాలి. మొత్తం కమిటీలో యాభైశాతం మహిళలు ఉండేలా చూడండి. ప్రతి అక్కా, ప్రతి చెల్లెమ్మను బాగా చూసుకుంటే కుటుంబాలు బాగుపడతాయని మనస్ఫూర్తిగా నమ్మి ప్రతి పథకం కూడా వాళ్లకు తగ్గట్లుగానే పేర్లతో పెట్టాం. అందుకే వాళ్లనూ భాగస్వామ్యం చేయాలి.  సచివాలయానికి రూ.20 లక్షల చొప్పున ప్రాధాన్యతా క్రమంలో  పనులకు మంజూరు కూడా చేస్తున్నాం. మళ్లీ మనం(కార్యకర్తలను కలిపి) అఖండ మెజార్టీతో గెలవాలి.  ఈసారి టార్గెట్‌ 151 కాదు, 175. ఈ టార్గెట్‌ కష్టంకాదు. మీ నియోజకవర్గంలో ఏమేర లబ్ధి జరిగిందో, ప్రతి నియోజకవర్గంలోనూ జరిగింది. దాదాపు 87శాతం కుటుంబాలకు పథకాలు అందాయి. ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టే.. ప్రతిపక్ష నేత చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ఘనవిజయాలు సాధించగలిగాం. మున్సిపాల్టీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపాల్టీ ఎన్నికల్లో ఘన విజయాలు అందుకున్నాం. 

ప్రజల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది
అంతకుముందు ప్రజలకు ఏదైనా అందాలంటే.. పది మంది చుట్టూ తిరగాలి. లంచాలు ఇచ్చుకోవాలి. ఇంతచేసినా వెయ్యి మందిలో నలుగురికో, పదిమందికో పథకాల లబ్ధి అందేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా వివక్ష లేకుండా, పక్షపాతం లేకుండా ప్రజలకు అన్నీ సంక్షేమాలు అందుతున్నాయి. గతంలో సచివాలయ వ్యవస్థ అనేదే లేదు. ఇప్పుడు ఉన్నాయి. నాలుగు అడుగులు వేస్తే ఆర్బీకేలు కనిపిస్తున్నాయి. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్‌క్లినిక్స్‌ కనిపిస్తున్నాయి. ఇంకొంచెం ముందుకెళ్తే.. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు కనిపిస్తున్నాయి. నేడు గ్రామాల్లో ఇలాంటి వ్యవస్థ కనిపిస్తోంది. ప్రజల్లోనూ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. వాళ్లు అని గ్రహిస్తున్నారు.

 విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చాం. ఆరోగ్యశ్రీ కింద 3వేలకుపైగా చికిత్సలకు వర్తింపు చేస్తున్నాం. మన గ్రామంలోనే మన కళ్లముందే మార్పులు కనిపిస్తున్నాయి. వీటి గురించే ప్రజలకు చెప్పండి. వారి మద్దతును కూడగట్టండి. మీతోడు జగన్‌కు కావాలి. మనం అంతా ఇంకా కలిసికట్టుగా ముందుకెళ్లాలి. జీవితంకాలం మిగిలిపోయే విధంగా మనం అంతా చరిత్రను లిఖించాలి. మన తీసుకొచ్చిన మార్పులు అన్నీకూడా మన కళ్లముందే ఫలితాలను ఇస్తాయి. ఇవన్నీ చూశాక 30ఏళ్లపాటు మనమే ఉండాలని ప్రజలే ఆశీర్వదిస్తారు అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి: కుప్పం నుంచే తొలి అడుగు!

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top