Andhra Pradesh చక్కని చదువు.. సొంతిల్లు

CM YS Jagan Comments in state level bankers committee meeting - Sakshi

విద్య, గృహ నిర్మాణాల పట్ల సానుకూలంగా అడుగు వేయండి

రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో సీఎం వైఎస్‌ జగన్‌

30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం.. 

వచ్చే నెలలో 3 లక్షల ఇళ్లతో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం 

ఉచితంగా ఇసుక, సబ్సిడీతో సిమెంట్, స్టీలు సరఫరా.. లబ్ధిదారులకు 3 శాతం వడ్డీతో రూ.35 వేల రుణం.. ఈ వడ్డీని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది 

రూ.35 వేల రుణం తీసుకోని వారికి త్వరగా మంజూరు చేయాలి

ఇళ్ల నిర్మాణాలు ఊపందుకుంటే గ్రామీణ ఆర్థిక రంగం త్వరితగతిన అభివృద్ధి  

రైతులతో పాటు కౌలు రైతులకూ మరింత బాసటగా నిలవాలి

స్వయం సహాయక సంఘాల రుణాలపై వడ్డీ తగ్గించే విషయం పరిశీలించాలి 

వారు దాచుకున్న డబ్బుపై ఇస్తోంది 4 శాతం వడ్డీ మాత్రమే

డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణంపై క్రియాశీలకంగా స్పందించాలి

సాక్షి, అమరావతి: విద్య, గృహ నిర్మాణ రంగాలు సామాజిక ఆర్థిక ప్రగతిలో కీలకమని, ఈ రెండు రంగాల పట్ల బ్యాంకింగ్‌ రంగం మరింత సానుకూల దృక్పథంతో.. అనుకూల కార్యాచరణతో ముందడుగు వేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కోరారు. శుక్రవారం తన అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో జరిగిన 222వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఏడాది ఎంత మేర రుణ ప్రణాళిక లక్ష్యాలను చేరుకున్నారు.. ఏ రంగాల్లో వెనుకబడి ఉన్నారో వివరిస్తూ మార్గ నిర్దేశం చేశారు.

రాష్ట్రంలో బ్యాంకింగ్‌ వ్యవస్థ 2022–23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొదటి 9 నెలల్లోనే వార్షిక రుణ ప్రణాళిక లక్ష్యాలకు మించి సాధించిందని, ఇది 124.69%గా ఉందని చెప్పడానికి సంతోషకరంగా ఉందని ప్రశంసించారు. అయితే విద్య, గృహ నిర్మాణ రంగాలకు సంబంధించి నిర్దేశించుకున్న లక్ష్యాల స్థాయి కన్నా రుణాలు తక్కువగా ఉన్నాయని అన్నారు.

విద్యా రంగానికి కేవలం 42.91 శాతం, గృహ నిర్మాణ రంగానికి 33.58 శాతం మాత్రమే రుణాలు ఇచ్చారని.. సామాజిక–ఆర్థిక ప్రగతిలో ఈ రెండు కీలక రంగాలు అయినందున బ్యాంకింగ్‌ రంగం వీటి పట్ల మరింత సానుకూల దృక్పథంతో ముందడుగు వేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఎం జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 
బ్యాంకర్ల సమావేశంలో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌ 
 
గృహ నిర్మాణాలకు ఊతమివ్వాలి 

► 30.75 లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం. ప్రభుత్వమే ఈ ఇళ్ల స్థలాలు సేకరించి, లబ్ధిదారులకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ ఏప్రిల్‌లో మరో 3 లక్షల ఇళ్ల నిర్మాణం ప్రారంభించబోతున్నాం. వీటితో కలిపి దాదాపు 25 లక్షల ఇళ్లు నిర్మించబోతున్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక సరఫరా చేస్తోంది. సిమెంట్, స్టీలు సబ్సిడీ ధరలకు అందిస్తోంది. వీటికి అదనంగా ఇళ్ల నిర్మాణ లబ్ధిదారులకు రూ.35 వేలు రుణం 3 శాతం వడ్డీతో అందించాలని బ్యాంకులతో చర్చించాం. ఈ వడ్డీని ప్రభుత్వమే భరిస్తుంది.  

► ఈ ఇళ్ల లబ్ధిదారులందరూ మహిళలే. వారి పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చాం. రూ.35 వేల రుణం తీసుకోని వారికి త్వరగా మంజూరు చేయాలని కోరుతున్నాం. ఇళ్ల నిర్మాణం ఊపందుకుంటే.. స్టీల్, సిమెంట్‌ వినియోగం వల్ల గ్రామీణ ఆర్థిక రంగ అభివృద్ధికి గణనీయమైన ఊతమొస్తుంది. మొత్తం 30.75 లక్షల ఇళ్ల నిర్మాణం జరగబోతుంది. ఇలా కడుతున్న ఒక్కో ఇంటి మార్కెట్‌ విలువ రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు ఉండబోతుంది. ఈ నేపథ్యంలో గృహ నిర్మాణ రంగానికి బ్యాంకులు మరింతగా సహకరించాల్సిన అవసరం ఉంది.  
 
కౌలు రైతులకు మరింత బాసట  
► వ్యవసాయ రంగంలో స్వల్ప కాలిక పంట రుణాల విషయంలో నిర్దేశించుకున్న లక్ష్యంలో 83.36 శాతానికి చేరుకున్నాం. వంద శాతానికి చేరుకోక పోవడంపై దృష్టి పెట్టి ఎస్‌ఎల్బీసీ సరైన చర్యలు తీసుకోవాలి. 

► కౌలు రైతుల రుణాలకు సంబంధించి 2022 డిసెంబర్‌ వరకు కేవలం 49.37% మాత్రమే వార్షిక లక్ష్యాన్ని సాధించాం. 1,63,811 మంది కౌలు రైతు ఖాతాలకు మాత్రమే క్రెడిట్‌ను పొడిగించారు. కౌలు రైతుల రుణాల లక్ష్యం రూ.4,000 కోట్లు కాగా, మొదటి 9 నెలల్లో కేవలం రూ.1,126 కోట్లు మాత్రమే మంజూరు చేశారు. ఈ దృష్ట్యా వీరికి బ్యాంకులు మరింత బాసటగా నిలవాలి.  

► రాష్ట్రంలో సాగయ్యే ప్రతి ఎకరా భూమికి ఇ–క్రాపింగ్‌ చేస్తున్నాం. డిజిటల్, ఫిజికల్‌ రశీదులు కూడా ఇస్తున్నాం. సాగు చేసే రైతు పేరు, విస్తీర్ణం, సాగు చేసిన పంట వివరాలన్నీ డిజిటలైజేషన్‌ చేస్తున్నాం. విత్తనం నుంచి పంట విక్రయం దాకా తోడుగా నిలిచే ఆర్బీకే వ్యవస్థ రాష్ట్రంలో సమర్థవంతంగా పని చేస్తోంది.  

► కౌలు రైతులకు దేశంలో ఎక్కడా లేని విధంగా వైఎస్సార్‌ రైతు భరోసా అందిస్తున్నాం. భూ యజమానుల హక్కులకు భంగం లేకుండా కౌలు చేసుకునేందుకు ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు అవసరమైన పత్రాలను గ్రామ సచివాలయాల్లో అందుబాటులో ఉంచాం. అందువల్ల కౌలు రైతులకు రుణాల విషయంలో బ్యాంకులు ఎలాంటి సందేహాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు.  
 
తక్కువ వడ్డీతో మహిళలకు రుణాలు 
► మహిళా స్వయం సహాయక సంఘాలకు ఇచ్చే రుణాలపై వడ్డీ విషయంలో బ్యాంకులు పునః పరిశీలన చేయాలి. మహిళలు దాచుకున్న డబ్బుపై కేవలం 4 శాతం వడ్డీ ఇస్తున్నారు. కానీ వారికిచ్చే రుణాలపై అధిక వడ్డీ వేస్తున్నారు. ఈ విషయాన్ని పరిశీలించి, తక్కువ వడ్డీకే రుణాలు ఇచ్చేలా చూడాలి.  

► ఈ వడ్డీ రేట్లను పర్యవేక్షించడానికి.. అధికారులు, బ్యాంకర్లు కలిసి సమావేశం కావాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం. దాదాపు కోటి మందికి పైగా మహిళలు ఉన్న ఈ రంగంలో ఉన్నారు. ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా ఈ రంగంలో ఇప్పుడు ఎన్‌పీఏలు లేరు. వీరిపట్ల బ్యాంకులు ఉదారతతో ఉండాలి. సున్నా వడ్డీ, చేయూత, ఆసరా వంటి పథకాల వల్ల నేడు ఆంధ్రప్రదేశ్‌లో స్వయం సహాయక సంఘాల మహిళలు దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచారు.  
 
జూలైలో జగనన్న తోడు  
► చిరు వ్యాపారులు, సంప్రదాయ చేతి వృత్తుల వారి అవసరాలు తీర్చడానికి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం జగనన్న తోడు పథకాన్ని ప్రవేశపెట్టింది. రూ.10,000 చొప్పున రుణాలు అందిస్తూ.. వీటిపై వడ్డీ భారాన్ని పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. ఇప్పటి వరకూ 25 లక్షల మంది రుణాలు పొందారు.  

► వీరికి రుణాలు ఇవ్వడానికి బ్యాంకింగ్‌ రంగం కూడా ఉత్సాహాన్ని ప్రదర్శించింది. ఈ ఏడాది కూడా అదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కోరుతున్నాను. జగనన్న తోడు తదుపరి దశను 2023 జూలైలో ప్రారంభించేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతోంది.  

► ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ కె ఎస్‌ జవహర్‌రెడ్డి, గ్రామ, వార్డు సచివాలయాల శాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ స్పెషల్‌ సీఎస్‌ వై శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ,  మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ.ఎండి. ఇంతియాజ్, ఏపీ టిడ్కో ఎండీ సీహెచ్‌ శ్రీధర్, వ్యవసాయ శాఖ కమిషనర్‌ సీహెచ్‌ హరికిరణ్, ఏపీఐఐసీ వీసీ అండ్‌ ఎండీ జి సృజన, ఇతర ఉన్నతాధికారులు, ఎస్‌ఎల్‌బీసీ ప్రెసిడెంట్, యూనియన్‌ బ్యాంకు ఎండీ అండ్‌ సీఈఓ ఏ.మణిమేకలై, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ నవనీత్‌ కుమార్, నాబార్డు సీజీఎం ఎం ఆర్‌ గోపాల్, ఆర్‌బీఐ డీజీఎం వికాస్‌ జైస్వాల్, పలువురు బ్యాంకర్లు పాల్గొన్నారు.  
 
డిజిటల్‌ లైబ్రరీలకు సహకరించాలి 
► సుమారు 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలు నిర్మించాం. ప్రతి ఊళ్లో ఇంగ్లిష్‌ మీడియం స్కూలు, రైతు భరోసా కేంద్రం, విలేజ్‌ క్లినిక్‌లు కనిపిస్తాయి. అక్కడే డిజిటల్‌ లైబ్రరీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. అన్‌ లిమిటెడ్‌ బ్యాండ్‌విడ్త్‌తో వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యాన్ని కల్పించనున్నాం. కంప్యూటర్లు, వర్క్‌ ఫ్రం హోం సౌలభ్యంతో డిజిటల్‌ లైబ్రరీలు గ్రామాల స్వరూపాన్ని మార్చబోతున్నాయి. వీటి నిర్మాణానికి నాబార్డు, బ్యాంకులు సహకరించాల్సిన అవసరం ఉంది.  

► యువతీ యువకులను సుశిక్షితంగా తయారు చేసేందుకు, వారికి ఉపాధి కల్పనను మెరుగు పరిచేందుకు ప్రతి నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పాఠ్య ప్రణాళిక, కోర్సుల బోధన, శిక్షణ కార్యక్రమాలను నిర్దేశించేందుకు ఒక యూనివర్సిటీ ఏర్పాటు కానుంది. ఈ కార్యక్రమాలకు బ్యాంకులు బాసటగా నిలవాలి.   
  
గత ఏడాది లక్ష్యం మేరకు రుణాలు : ఎస్‌ఎల్‌బీసీ వెల్లడి 
► ప్రాథమిక రంగానికి ఇవ్వాల్సిన రుణాలన్నీ దాదాపు ఇచ్చాం. మిగిలిన రంగాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల కంటే ఎక్కువ రుణాలు ఇచ్చాం. ప్రాథమిక రంగానికి 2022–23 రుణ ప్రణాళిక లక్ష్యం రూ.2,35,680 కోట్లు కాగా, రూ.2,34,442 కోట్ల రుణాలు ఇచ్చాం. 99.47 శాతం లక్ష్యాన్ని చేరుకున్నాం. 

► వ్యవసాయ రంగానికి రుణాల లక్ష్యం రూ.1,64,740 కోట్లు కాగా 1,72,225 కోట్లతో 104.54 శాతం మేర ఇచ్చాం. ఎంఎస్‌ఎంఈ రంగానికి రుణాల లక్ష్యం రూ.50,100 కోట్లు కాగా, రూ.53,149 కోట్లతో 106.09 శాతం ఇచ్చాం. 

► ప్రాథమికేతర రంగానికి రూ.83,800 కోట్లు రుణాలు ఇవ్వాలని లక్ష్యం కాగా, రూ.1,63,903 కోట్లు ఇచ్చాం. దాదాపుగా రెట్టింపు స్థాయిలో 195.59 శాతం మేర ఇచ్చాం.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top