సకాలంలో ప్రాజెక్టుల ఫలాలు

CM Jagan direction to officers in review of Department of Water Resources - Sakshi

ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా అవాంతరాలు రాకుండా చూడండి

జల వనరుల శాఖ సమీక్షలో అధికారులకు సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం

కేంద్రం పోలవరం నిధులను సకాలంలో ఇవ్వకపోయినా పనులు ఆపలేదు

ఆర్థిక ఇబ్బందులున్నప్పటికీ ప్రాజెక్టుల పనులు కొనసాగిస్తున్నాం

పోలవరం ప్రాజెక్టు పనుల్లో రానున్న 45 రోజులు అత్యంత కీలకం

నిర్వాసితులకు పునరావాసం కల్పించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి

ప్రాధాన్యత ప్రాజెక్టులు పూర్తయ్యాక మిగిలిన వాటిని శరవేగంగా పూర్తి చేయాలి

సాక్షి, అమరావతి: సాగునీటి ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా సకాలంలో పూర్తి చేసి, వాటి ఫలాలను రైతులకు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ప్రణాళికాయుతంగా ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టులను పూర్తి చేయడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.  ప్రాధాన్యత ప్రాజెక్టుల పనుల్లో ఎక్కడా అవాంతరాలు లేకుండా చూడటం ద్వారా గడువులోగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై బుధవారం ఆయన తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రాధాన్యత ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తామన్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కేంద్రం సకాలంలో నిధులు విడుదల చేయకపోయినా పనులు నిర్విఘ్నంగా కొనసాగిస్తున్నామని చెప్పారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ పోలవరంతో సహా ఇతర ప్రాజెక్టులను నిర్దేశించుకున్న గడువులోగా పూర్తి చేయాలనే ఉద్దేశంతోనే నిధులు విడుదల చేస్తున్నామన్నారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోల్చితే.. ఈ 18 నెలల కాలంలో పనులు వేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాధాన్యతా ప్రాజెక్టుల పనులు పూర్తయ్యాక, మిగిలిన ప్రాజెక్టులను శరవేగంగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంకా ఈ సమీక్ష వివరాలు ఇలా ఉన్నాయి.

45 రోజులు అత్యంత కీలకం 
► వర్షాలు వచ్చేలోగా పోలవరం ప్రాజెక్టులో పూర్తి చేయాల్సిన పనులపై మరింతగా దృష్టి సారించడంలో భాగంగా కాఫర్‌ డ్యాంలో ఖాళీలు పూర్తి చేయడం, అప్రోచ్‌ చానల్, స్పిల్‌ చానల్, స్పిల్‌ గేట్ల బిగింపు, ప్రధాన డ్యాం (ఈసీఆర్‌ఎఫ్‌ – ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డ్యామ్‌) తదితర కీలక పనుల పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. 
► మే నెలాఖరుకు కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు. గోదావరి వరదను స్పిల్‌ వే మీదుగా మళ్లించడానికి సంబంధించిన అప్రోచ్‌ చానల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, వాటిని కూడా మే నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. 
► దీనిపై సీఎం వైఎస్‌ జగన్‌ స్పందిస్తూ.. కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తి చేయడం, అప్రోచ్‌ చానల్‌ను పూర్తి చేయడం అన్నది అత్యంత ఆవశ్యకమన్నారు. ఆ పనులను శరవేగంగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. స్పిల్‌ చానల్‌లో మట్టి తవ్వకం, కాంక్రీట్‌ పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు. 
► రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా ఈ పనులను వేగంగా పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు. వర్షాలు వచ్చేలోగా నిర్వాసితులకు పునరావాసం కల్పించాలని ఆదేశించారు. గోదావరికి వరద వచ్చినా స్పిల్‌ వే మీదుగా మళ్లించి.. కాఫర్‌ డ్యాంల మధ్య ఈసీఆర్‌ఎఫ్‌ పనులను చేపట్టి గడువులోగా పూర్తి చేయవచ్చని చెప్పారు.
జలవనరుల శాఖపై సమీక్షలో అధికారులతో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ 

ప్రాధాన్యత ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి 
► ప్రభుత్వం ప్రాధాన్యత ప్రాజెక్టులుగా చేపట్టిన నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకు టన్నెల్‌–2, వెలిగొండ ప్రాజెక్టు, వంశధార – నాగావళి అనుసంధానం, వంశధార ఫేజ్‌–2 స్టేజ్‌ –2 పనులపై సీఎం వైఎస్‌ జగన్‌ లోతుగా సమీక్షించారు. 
► నెల్లూరు, సంగం బ్యారేజీలు మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. అవుకు టన్నెల్‌–2లో కెమికల్‌ పోరింగ్‌ పనులు వేగంగా సాగుతున్నాయని, ఆగస్టు నాటికి పూర్తి చేస్తామని చెప్పారు. తద్వారా ఆగస్టు నాటికి గాలేరు–నగరి సుజల స్రవంతి పథకానికి ప్రస్తుత డిజైన్‌ మేరకు 20 వేల క్యూసెక్కులను తరలించేలా అవుకు టన్నెళ్లను సిద్ధం చేస్తామన్నారు.
► వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌–1 ఇప్పటికే పూర్తయిందని, డిసెంబర్‌ నాటికి రెండో టన్నెల్‌ను పూర్తి చేస్తామని వివరించారు. వెలిగొండ టన్నెల్‌–1 ద్వారా సెప్టెంబర్‌ నాటికి నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. 
► దీనిపై సీఎం స్పందిస్తూ.. నిర్దేశించుకున్న గడువులోగా ప్రాజెక్టులను పూర్తి చేయడానికి పనులను మరింత వేగవంతం చేయాలని ఆదేశించారు.

నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టండి 
► వంశధార–నాగావళి అనుసంధానం, వంశధార ప్రాజెక్టు ఫేజ్‌–2, స్టేజ్‌–2 పనులను జూలై నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు వివరించారు. వంశధార ప్రాజెక్టు ఫేజ్‌–2, స్టేజ్‌–2లో అంతర్భాగమైన నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. 
► నేరడి బ్యారేజీ నిర్మాణంలో ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు. మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్‌–2, తారక రామ తీర్థసాగరం తదితర ప్రాజెక్టులను ప్రాధాన్యతగా చేపట్టి శరవేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 
► రాయలసీమ కరువు నివారణ పథకం, పల్నాడు కరువు నివారణ పథకం కింద చేపట్టనున్న ప్రాజెక్టులను ప్రణాళికాయుతంగా పూర్తి చేయడానికి కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.
► ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.ఎస్‌.రావత్, జల వనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావు, ఈఎన్‌సీ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top