
మద్యం తయారీకి తప్ప వరి ఎందుకూ ఉపయోగపడదు
అసెంబ్లీలో వ్యవసాయ రంగంపై చర్చలో సీఎం చంద్రబాబు వ్యాఖ్య
ఇలాంటి ధాన్యాన్ని కొనడం పెద్ద సమస్యగా మారింది
రెండు పంటలు వేసి కొనమంటే ఏంచేయాలో తెలియడం లేదు
అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌లో వరికి ఉరి వేస్తున్న ముఖ్యమంత్రి
వరి సాగు కరెక్ట్ కాదు.. వదిలేయడం మంచిదంటూ పదేపదే వ్యాఖ్యలు
యూరియా వాడితే కేన్సర్ వస్తుందంటూ దుష్ప్రచారం
గతంలో కూడా ఇదే తీరు.. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్ర రైతులు పండిస్తున్న ధాన్యం రకాలు తినడానికి, ఎగుమతి చేయడానికి ఉపయోగపడడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే రానున్న కాలంలో ఆల్కహాల్ తయారీకి తప్ప మన ధాన్యం దేనికీ ఉపయోగపడదు’’ అని సీఎం చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా మరోసారి రైతు వ్యతిరేక వ్యాఖ్యలు చేశారు. ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు. ‘‘రాష్ట్రంలో 14.90 లక్షల హెక్టార్లల్లో వరి పండిస్తుంటే 6.25 లక్షల హెక్టార్లలో బీపీటీ, 8.35 లక్షల హెక్టార్లల్లో స్వర్ణ, 30 వేల ఎకరాల్లో ఎగుమతి రకం సాగు చేస్తున్నారు.
ఎప్పుడూ ఒక పంట వేసే నెల్లూరు జిల్లా వాళ్లు ఈ సారి రెండు పంటలు వేశారు. దేశవ్యాప్తంగా డిమాండ్ ఉన్న నెల్లూరు ములగొలకలు కాకుండా వేరే రకం పండించారు. ఇలా రెండు పంటలు వేసి కొనాలంటే ఏం చేయాలో తెలియడం లేదు’’ అని అన్నారు. సోమవారం అసెంబ్లీలో వ్యవసాయంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో చంద్రబాబు మాట్లాడారు. ఏడాదికి ఒక్కసారే వరి సాగు చేసేలా రైతులు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు కార్యాచరణ సిద్ధం చేసినట్లు తెలిపారు.
ప్రజల ఆహార అలవాట్లు మారాయని దీనికి అనుగుణంగా పంటల మారి్పడి జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకసారి వరి పండిస్తే రెండో పంటగా నూనె గింజలు, తృణధాన్యాలు సాగు చేయాలన్నారు. వరి సాగు నుంచి ఆదాయం ఇచ్చే ఉద్యాన, ఆక్వా రంగాల వైపు రైతులు మళ్లాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం అక్టోబరు నుంచి కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. కాగా, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ నిర్ణయంతో ఆక్వా రంగం విలవిల్లాడుతోందని, దీనిపై కేంద్రంతో నిరంతరం చర్చిస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
యూరియాకు ఆధార్ లింక్
రేషన్ బియ్యం ఇస్తున్నట్లే... వచ్చే సీజన్ నుంచి ఎరువులను కూడా ఆధార్ అనుసంధానంతో రైతుకు పంట చేల వద్దనే అవసరమైన మేర మాత్రమే అందిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. పంటకు ఎంత ఎరువు అవసరమో ఆ మేరకే అందిస్తామన్నారు. యూరియా వాడకం తగ్గిస్తే కేంద్రం అందించే ప్రయోజనం బస్తాకు రూ.800 రైతుకే ఇస్తామని చెప్పారు. బాధ్యత లేని నాయకులు ఎరువులు ఇవ్వడం లేదంటూ మాట్లాడుతున్నారని వారు ఖరీదైన సరి్టఫికేషన్ తిండి తింటూ రైతులను రెచ్చగొడుతున్నారని విమర్శించారు.
బాబు నిజ స్వరూపం బట్టబయలు
వరి విషయంలో సీఎం వ్యాఖ్యలపై వ్యవసాయ నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దేశానికి అన్నపూర్ణ అయిన ఆంధ్రప్రదేశ్‌లో వరి పంటకు చంద్రబాబు ఉరి వేస్తున్నారని మండిపడుతున్నారు. ‘వరి సాగు కరెక్ట్ కాదు. వర్షాధార పంట కావడంతో రైతులకు ఏమాత్రం లాభదాయకం కాదు. వచ్చే ఏడాది నుంచి ఒక పంట మాత్రమే వరి పండించేలా ప్రోత్సహిస్తాం’ అంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యల పట్ల మండిపడుతున్నారు. రాష్ట్రంలో ఖరీఫ్‌లో 54 శాతం, రబీలో 36 శాతం విస్తీర్ణంలో వరి సాగవుతోంది. గోదావరి, కృష్ణా, పెన్నా డెల్టాలో వరి విస్తీర్ణమే ఎక్కువ. ఖరీఫ్‌లో వరికి ప్రత్యామ్నాయం లేదు. అలాంటిది వరి వేయొద్దంటూ సీఎం మాట్లాడడం ఎంతవరకు సమంజసమని వ్యవసాయ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. వరి లేకుంటే వ్యవసాయ రంగం కనుమరుగవుతుందని, రాష్ట్రమంతా ఉద్యాన పంటలు పండించడం సాధ్యం కాదని, మారుతున్న వాతావరణ పరిస్థితులు సహకరించవని చెబుతున్నారు.
చంద్రబాబు ఆది నుంచి రైతు వ్యతిరేకే...!
అధికారంలోకి వచి్చంది మొదలు చంద్రబాబు ప్రభుత్వం రైతుల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు శాసనసభ వేదికగా... ఏడాదికి ఒకసారే వరి వేయాలని చంద్రబాబు మౌఖిక ఆదేశాలు జారీ చేయడం, మన ధాన్యం ఆల్కహాల్ తయారీకి తప్ప ఇంకెందుకు పనికిరాదనడం విభ్రాంతికరమని నిపుణులు అంటున్నారు. వ్యవసాయం దండగ అని గతంలో అధికారంలో ఉండగా ఆయన చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ... రైతులను మరోసారి దగా చేసేందుకు సిద్ధమవుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘రైతులకు ఉచిత కరెంట్ ఇస్తే తీగలపై దుస్తులు ఆరేసుకోవడమే’’ అంటూ బాబు చేసిన వ్యాఖ్యలను మళ్లీ గుర్తు చేస్తున్నారు.
దేశమంతా పెరుగుతుంటే.. మనదగ్గర తగ్గిస్తారా?
పొరుగునున్న తెలంగాణ సహా దేశవ్యాప్తంగా వరి సాగు పెరుగుతోంది. అందుకు విరుద్ధంగా ఏపీలో రాష్ట్ర ప్రభుత్వ నిర్వాకంతో విస్తీర్ణం తగ్గిపోతోంది. వరి సాగును లాభసాటిగా మార్చి ప్రోత్సహించాల్సింది పోయి ఈ పంట వేయొద్దు... మీకేమీ మిగలదంటూ చంద్రబాబు పదేపదే వ్యాఖ్యలు చేస్తున్నారు. వరి సాగులో యూరియా వాడకంతో కేన్సర్ కేసులు పెరుగుతున్నాయంటూ వివాదాస్పద ప్రకటన చేయడంపై వరి రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు.
అచ్చెన్నా.. ఇది తగునా?
‘‘రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. 10 రోజుల పాటు ఇబ్బంది ఏర్పడింది. యూరియా వాడకం వలన కేన్సర్ వస్తోందని హెచ్చరిస్తూ రాష్ట్రానికి ఎలాట్‌మెంట్లు తగ్గిస్తున్నామంటూ కేంద్రం ప్రకటించింది’’ అని వ్యవసాయ శాఖమంత్రి అచ్చెన్నాయుడు అసెంబ్లీలో చేసిన ప్రకటన పట్ల రైతులు మండిపడుతున్నారు. ప్రభుత్వం ఎంత అడిగితే అంత ఇస్తుంది కదా అని ఎరువులు అధికంగా వాడితే జబ్బులొచ్చి ప్రజలు చనిపోతారంటూ ఆయన చేసిన మరో వివాదాస్పద వ్యాఖ్య పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
పథకం ప్రకారమే నిర్విర్యం
కూటమి ప్రభుత్వం వచి్చన దగ్గరనుంచి రాష్ట్రంలో వ్యవసాయం ఉనికి లేకుండా చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు పైసా భారం పడకుండా అండగా నిలిచిన ఉచిత పంటల బీమాను అటకెక్కించిన చంద్రబాబు సర్కారు.. 15 నెలలుగా ఏ ఒక్క పంటకు బీమా పరిహారం అందకుండా చేసింది. వరుస వైపరీత్యాలకు తోడు కరువు విలయతాండవం చేస్తున్నా పైసా ఇవ్వలేదు.
⇒ విత్తు నుంచి విక్రయం వరకు గ్రామ స్థాయిలో రైతులను చేయిపట్టి నడిపించిన రైతు భరోసా కేంద్రాలతో పాటు సచివాలయాలను నిర్విర్యం చేశారు. నాన్ సబ్సిడీ విత్తనాల సరఫరాను నిలిపివేశారు. సబ్సిడీ విత్తనాలకు కోత పెట్టారు. అదునుకు అందాల్సిన యూరియాను కావాలనే అందకుండా చేస్తూ సాగును చిన్నాభిన్నం చేశారు. యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతుంటే ఎకరాకు అరకట్ట కూడా అందించలేకపోతున్నారు. ఏ ఒక్క పంటకూ గిట్టుబాటు ధర దక్కక రైతులు విలవిల్లాడి పోతుంటే వేడుక చూస్తున్నారే తప్ప ఆదుకునే ప్రయత్నం చేసిన పాపాన పోలేదు.
⇒ ధరలు పతనమైనప్పుడు మార్కెట్‌లో జోక్యం చేసుకొని వ్యాపారులతో పోటీపడి కొని రైతులకు మద్దతు ధర కల్పించాల్సింది పోయి గాలికొదిలేసింది. మద్దతు ధరకు మించి ధర లభించే ఫైన్ వెరైటీలకు సైతం ప్రస్తుతం మద్దతు ధర కరువవుతున్నా ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని నామరూపాలు లేకుండా చేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని నిపుణులు అంటున్నారు.