భూ రికార్డుల స్వచ్ఛీకరణ

Clearance of land records in AP - Sakshi

‘వెబ్‌ల్యాండ్‌’లో తప్పులు దిద్దుతున్న రెవెన్యూ యంత్రాంగం

8 నెలల్లో 2.04 లక్షల దిద్దుబాట్లు 

వివిధ కారణాల వల్ల 1.70 లక్షల అర్జీల తిరస్కరణ 

పెండింగ్‌లో మరో 43,047 వినతులు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో భూ యాజమాన్య హక్కు పత్రాలు (ఆర్‌వోఆర్‌–అడంగల్‌) తప్పుల తడకగా.. అస్తవ్యస్తంగా తయారయ్యాయి. భూ రికార్డులను నవీకరించి నిర్వహించడానికి వీలుగా 2014లో అప్పటి ప్రభుత్వం ‘వెబ్‌ల్యాండ్‌’ కొత్త సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టింది. అది కాస్తా తప్పుల తడకగా.. లోపభూయిష్టంగా తయారైంది. ఫలితంగా భూ యజమానులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే దుస్థితి దాపురించింది. వెబ్‌ల్యాండ్‌ రికార్డులు సక్రమంగా లేకపోవడంవల్లే భూ వివాదాలు పెరిగి ఘర్షణలకు దారి తీస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో హత్యలకు దారి తీసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొన్ని వివాదాల విషయంలో ఇరువర్గాలు ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరుగుతున్న దృష్టాంతాలు లక్షల్లో ఉన్నాయి. అందువల్లే భూ రికార్డులను ప్రక్షాళన చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. భూములు, పట్టణ, గ్రామీణ ఆస్తులను రీసర్వే చేసి ప్రతి సబ్‌ డివిజన్‌కు సరిహద్దు రాళ్లు నాటాలని నిర్ణయించింది. తద్వారా ల్యాండ్‌ రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమాన్ని పక్కాగా చేపడుతోంది.

ప్రైవేట్‌ భూములు ప్రభుత్వ ఖాతాలో.. 
అనేకచోట్ల ప్రైవేట్‌ భూములు ప్రభుత్వ ఖాతాల్లోనూ, ప్రభుత్వ భూములు ప్రైవేట్‌ వ్యక్తుల ఖాతాల్లోను అడంగల్‌లో నమోదై ఉన్నాయి. కొందరు కిందిస్థాయి రెవెన్యూ సిబ్బంది, రిటైర్డు ఉద్యోగులు ముడుపులు తీసుకుని తప్పుడు రికార్డులు సృష్టించారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నాయకులు కూడా ఈ వ్యవహారంలో కీలక భూమిక పోషించారు. ఇప్పటికీ చాలా భూములు రెవెన్యూ రికార్డుల్లో అన్‌ నోన్‌ (ఎవరివో తెలియవు) అనే ఖాతాలోనే ఉన్నాయి.

తప్పుల సవరణ కోసం...
2020 జూన్‌ 1 నుంచి 2021 జనవరి 29వ తేదీ వరకూ 8 నెలల్లో భూ యాజమాన్య పత్రం (ఆర్‌వోఆర్‌/అడంగల్‌)లో తప్పుల సవరణ కోసం 4,17,650 వినతులు వచ్చాయి. వెబ్‌ల్యాండ్‌ ఎంత అస్తవ్యస్తంగా.. తప్పుల తడకగా ఉందనేది ఈ గణాంకాలే చెబుతున్నాయి. వాటిలో.. 2,04,577 తప్పులను అధికారులు సరిదిద్దారు. 43,047 అర్జీలు పెండింగ్‌లో ఉండగా.. 1,70,026 అర్జీలను వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. 

అందుకే స్వచ్ఛీకరణ  
దశాబ్దాల తరబడి సబ్‌ డివిజన్‌ కాకపోవడం, కిందిస్థాయిలో జరిగిన అక్రమాలు వంటి కారణాల వల్ల అడంగల్‌లోనూ, వెబ్‌ల్యాండ్‌ అడంగల్‌లోనూ కొన్ని తప్పులు ఉన్న మాట వాస్తవమేనని రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు అంగీకరించారు. ఈ తప్పులను సరిదిద్ది ప్రక్షాళన చేయడం కోసమే  ప్రభుత్వం రికార్డుల స్వచ్ఛీకరణ కార్యక్రమం చేపట్టిందని తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top