
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పారదర్శకంగా అమలు చేసిన మద్యం విధానంపై టీడీపీ కూటమి ప్రభుత్వం అక్రమ కేసు నమోదు వెనుక పక్కా పన్నాగం దాగుంది. ఎందుకంటే గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో తెగించి పాల్పడిన మద్యం దోపిడీని కప్పిపుచ్చే కుతంత్రం ఉంది. అసలు రాష్ట్రంలో మద్యం దందాకు ఆద్యుడు చంద్రబాబే అన్నది బహిరంగ రహస్యం.
మద్యం మాఫియాను పెంచి పోషించిన వ్యవస్థీకృత దందాను స్థిర పరచింది ఆయనే. 2014–19లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే తన బినామీలు, సన్నిహితుల మద్యం కంపెనీల ముసుగులో ఖజానాకు భారీగా గండి కొట్టారు. నిబంధనలకు విరుద్ధంగా అస్మదీయుల కంపెనీలకు అడ్డగోలు లబ్ధి కలిగించారు. అందుకోసం ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు స్వయంగా సంతకాలు చేసి మరీ రెండు చీకటి జీవోలతో కుంభకోణానికి పాల్పడ్డారు.
తద్వారా ఖజానాకు ఏటా రూ.1,300 కోట్ల చొప్పున 2015 నుంచి 2019 వరకు రూ.5,200 కోట్లు గండికొట్టారు. ఈ విషయాన్ని రాజ్యాంగబద్ధ సంస్థ ‘కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్’(కాగ్) ఆధ్వర్యంలో స్వతంత్రంగా విధులు నిర్వర్తించే ప్రిన్సిపల్ అకౌంటెంట్ జనరల్ తన అభ్యంతరాలను స్పష్టంగా నివేదించారు కూడా. ఇక టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలో 4,380 ప్రైవేటు మద్యం దుకాణాలు.. వాటికి అనుబంధంగా 4,380 పర్మిట్ రూమ్‌లు.. 43 వేల బెల్ట్ దుకాణాలతో మద్యం ఏరులై పారించారు.
ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి, ఐదేళ్లలో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టారు. వెరసి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏకంగా రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడ్డారు. చంద్రబాబు ముఠా బాగోతం ఆధారాలతో సహా బయట పడటంతో 2023లోనే సీఐడీ కేసు నమోదు చేసింది. 2014–19 టీడీపీ ప్రభుత్వంలో ఎక్సైజ్ కమిషనర్‌గా వ్యవహరించిన ఐఎస్ నరేష్, అప్పటి ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, అప్పుటి సీఎం చంద్రబాబు, తదితరులపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్ విత్ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు: 13(1),(డి), రెడ్ విత్ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్ నమోదు చేసింది.
ఆ కేసులో చంద్రబాబు అప్పటి నుంచి ముందస్తు బెయిల్‌పైనే ఉన్నారు. 2024లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మద్యం విధానం ముసుగులో మహా దోపిడీకి మరోసారి తెగబడ్డారు. 3,396 ప్రైవేటు మద్యం దుకాణాలను టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా కట్టబెట్టడంతోపాటు ఏకంగా 75 వేల బెల్ట్ దుకాణాలతో భారీ దోపిడీకి బరితెగించారు. టీడీపీ ప్రభుత్వంలో గతంలో చేసిన దోపిడీ.. ప్రస్తుతం బరితెగించి సాగిస్తున్న దోపిడీ నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే సిట్ ద్వారా మద్యం అక్రమ కేసు కుట్రకు తెగబడ్డారు.

‘ప్రివిలేజ్’గా ఖజానాకు గండి కొట్టారు
మద్యం దుకాణాలు, బార్లపై ప్రివిలేజ్ ఫీజు ప్రభుత్వానికి ఆదాయ వనరు. ఆ ఫీజును గుట్టుచప్పుడు కాకుండా రద్దు చేస్తే ఖజానాకు గండి పడుతుంది. సీఎం హోదాలో నోట్ ఫైళ్లపై సంతకాల సాక్షిగా ఆ నిర్వాకం చంద్రబాబుదే. మంత్రివర్గాన్ని బురిడీ కొట్టిస్తూ 2015లో రెండు చీకటి జీవోలతో ప్రివిలేజ్ పన్నును రద్దు చేశారు చంద్రబాబు. తద్వారా టీడీపీ సిండికేట్ ఆధ్వర్యంలోని మద్యం దుకాణాలు, బార్ల యజమానులకు అడ్డగోలుగా ప్రయోజనం కలిగించారు. ఇలా నాలుగేళ్లలోనే రూ.5 వేల కోట్లు కొల్లగొట్టారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఇలాంటి ఒక్క చీకటి జీవోను కూడా జారీ చేయనేలేదు.
తమవారికి దోచిపెట్టారు
2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో కేవలం నాలుగు డిస్టిలరీల నుంచే ఏకంగా 53.21 శాతం మద్యం కొన్నారు. సి–టెల్ అనే సాఫ్ట్‌వేర్‌ను ప్రవేశపెట్టి మరీ దందా సాగించారు. ఆ విషయాన్ని ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం నియమించిన సిట్ నివేదికే వెల్లడించింది కూడా. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాత్రం కేవలం కొన్ని డిస్టిలరీలకే ప్రయోజనం కలిగించలేదు. లోపభూ యిష్టమైన సి–టెల్‌సాఫ్ట్‌వేర్‌ను తొలగించింది. సగటున ప్రతి డిస్టిలరీకీ 5 శాతం నుంచి 10% ఆర్డర్లు వచ్చేలా పారదర్శకంగా వ్యవహరించింది.