బాబు ముఠా బార్ల దందా | Chandrababu Naidu TDP Gang Liquor Syndicate In Andhra Pradesh, Check Full Story For More Details | Sakshi
Sakshi News home page

Liquor Syndicate In AP: బాబు ముఠా బార్ల దందా

Aug 25 2025 4:51 AM | Updated on Aug 25 2025 8:50 AM

Chandrababu Naidu TDP Gang liquor syndicate in Andhra Pradesh

టీడీపీ సిండికేట్‌కు ఏకపక్షంగా అన్నింటినీ కట్టబెట్టే కుట్ర 

ఇతరులు దరఖాస్తు చేయకుండా అడ్డుకుంటున్న వైనం

పోలీసుల బెదిరింపులు.. టీడీపీ రౌడీల వేధింపులు 

840 బార్లకు దాదాపు 2 వేల రిజిస్ట్రేషన్లు 

కానీ ఏడు రోజుల్లో వచ్చింది కేవలం 32 దరఖాస్తులే  

చివరి రెండు రోజుల్లో సిండికేట్‌ సభ్యులే దాఖలు చేసేలా స్కెచ్‌.. మరింత లాభాల మార్జిన్, రాయితీలు పొందేందుకు పన్నాగం 

వారితో ఇండెంట్‌ పెట్టించి ప్రభుత్వమే మద్యంకొనుగోలు చేసేలా  వ్యూహం.. ఇదే పెద్ద స్కామ్‌

2014–19 మధ్య దోపిడీకి మించి ఇప్పుడు కొల్లగొట్టేలా కుతంత్రం.. అప్పట్లో ప్రివిలేజ్‌ ఫీజు రద్దుతో ఖజానాకు రూ.5,200 కోట్లు గండి.. ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరతో మరో రూ.20 వేల కోట్లు  

ఈ కుంభకోణాన్ని ఆధారాలతో సహా నిగ్గు తేల్చిన సీఐడీ  

ఆ కేసులో ఇప్పటికీ బెయిల్‌పై ఉన్న చంద్రబాబు 

సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వంలో టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీలో మరో అంకానికి తెరలేచింది. ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన 840 బార్లను ఏకపక్షంగా దక్కించుకునేందుకు సిండికేట్‌ రంగంలోకి దిగింది. ఇతరులు ఎవరూ దరఖాస్తులు చేయకుండా అడ్డుకుంటోంది.  టీడీపీ సిండికేట్‌ కూడా చివరి వరకు దరఖాస్తులు చేయకుండా పక్కా పన్నాగంతో వ్యవహరిస్తోంది. తద్వారా దరఖాస్తులు రావడం లేదనే సాకు చూపించి బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, రాయితీలు దక్కించుకోవాలని సిండికేట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వ పెద్దల పన్నాగంలో భాగంగానే ఈ తతంగం మొత్తం సాగుతుండటం గమనార్హం. 

రాష్ట్రంలో 840 బార్లకు లైసెన్సుల కేటాయింపు కోసం ఎక్సైజ్‌ శాఖ ఈ నెల 18న నోటిఫికేషన్‌ జారీ చేసింది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు ఈ నెల 26వ తేదీ చివరి రోజు. ఇప్పటికి వారం రోజులు అయినా సరే 840 బార్లకు కేవలం 32 దరఖాస్తులే దాఖలయ్యాయి. కనీసం నాలుగు దరఖాస్తులు దాఖలయ్యే బార్లకే లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. దరఖాస్తులు దాఖలు చేసేందుకు మరో రెండు రోజులే గడువు ఉంది. అయినా సరే దరఖాస్తులు ఇంత తక్కువగా దాఖలు కావడం వెనుక గూడుపుఠాని జరుగుతోందని ఇట్టే స్పష్టమవుతోంది.  

ఎవరైనా దరఖాస్తు చేస్తే ఖబడ్డార్‌.. 
బార్లకు ఇంత తక్కువ సంఖ్యలో దరఖాస్తులు రావడం వెనుక టీడీపీ సిండికేట్‌ దందా దాగుంది. బెదిరింపులు, దౌర్జన్యాలతో హడలెత్తించి ప్రైవేటు మద్యం దుకాణాలను ఏకపక్షంగా దక్కించుకున్న కుట్రనే ఇక్కడా పునరావృతం చేస్తోంది. వాస్తవానికి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసేందుకు ఇప్పటి వరకు దాదాపు 2 వేల మందికిపైగా రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. కానీ వారిలో ఏడు రోజుల్లో కేవలం 32 మంది మాత్రమే దరఖాస్తు చేయడం గమనార్హం. తమ సిండికేట్‌ సభ్యులు కాకుండా ఇతరులెవరైనా బార్లకు దరఖాస్తులు చేస్తే అంతు చూస్తామని కూటమి ప్రజా ప్రతినిధులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. 

రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారి వివరాలను టీడీపీ సిండికేట్‌ సేకరించి వడపోస్తోంది. వారిలో తమ సిండికేట్‌ సభ్యులు కాని వారిని బెదిరించి బెంబేలెత్తిస్తోంది. ఏకంగా డీఎïస్పీ, సీఐ స్థాయి అధికారులు వారిని పిలిపించి మరీ బెదిరిస్తుండటం పరిస్థితి తీవ్రతకు నిదర్శనం. ‘ఎమ్మెల్యే గారు చెప్పారు. ఆయనకు ఇష్టం లేకుండా బార్‌ లైసెన్స్‌ కోసం ఎందుకు అప్లై చేయడం? లాటరీలో లైసెన్స్‌ వచ్చినా బార్‌ బిజినెస్‌ చేసుకోనివ్వరు. ఎందుకు అనవసర గొడవలు’ అని పోలీసు అధికారులే హెచ్చరిస్తున్నారు. 

‘మీరు బార్‌ పెట్టుకోవడానికి ఎవరూ భవనాన్ని గానీ, ఖాళీ స్థలాన్ని గానీ లీజుకు ఇవ్వరు.. ఇవ్వాలని అనుకున్నా ఎమ్మెల్యే ఇవ్వనివ్వరు. మీ సొంత భవనంలో పెట్టుకున్నా ఎక్సైజ్, పోలీస్‌ ఆఫీసర్లు ఎప్పుడు పడితే అప్పుడు రైడింగ్‌లు చేస్తారు. బిజినెస్‌ జరగనివ్వరు’ అని కూడా అసలు విషయాన్ని కుండబద్దలు కొడుతున్నారు. మరో వైపు టీడీపీ గూండాలు బహిరంగంగానే బెదిరింపులకు పాల్పడుతున్నారు. దాంతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న వారు దరఖాస్తు చేయడానికి భయపడుతున్నారు. 

నేడు, రేపు సిండికేట్‌ సభ్యులే దాఖలు చేసే ఎత్తుగడ
చివరి రెండు రోజుల్లో టీడీపీ సిండికేట్‌ ఎంపిక చేసిన వారే దరఖాస్తులు దాఖలు చేసేలా స్కెచ్‌ వేశారు. కనీసం నాలుగు దరఖాస్తులు వచ్చే బార్లకే లైసెన్సుల కేటాయింపు కోసం లాటరీ నిర్వహి­స్తామని ఎక్సైజ్‌ శాఖ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఆ ప్రకారం టీడీపీ సిండికేట్‌ సభ్యుల తరఫునే నాలుగు చొప్పున దరఖాస్తులు దాఖలు చేసేలా పన్నాగం పన్నారు. ఈ నాలుగు దరఖాస్తుల ప్రక్రియ అంతా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలే స్వయంగా పర్యవేక్షి­స్తున్నారు. 

అంతా పారదర్శకంగా నిర్వహిస్తున్నా­మని నమ్మించేందుకు కొన్ని ప్రధాన ప్రాంతాల్లో అదనంగా మరో ఇద్దరు ముగ్గురితో కూడా దర­ఖాస్తు చేయిస్తారు. వారు కూడా టీడీపీ సిండికేట్‌ వర్గీయులే అయ్యుండేలా గూడు పుఠాణి సాగిస్తు­న్నారు. ఫలితంగా లాటరీ ద్వారా సిండికేట్‌కే బార్ల లైసెన్సులు దక్కించుకునేలా పక్కాగా స్కెచ్‌ వేశారు.


మరింత అడ్డగోలు దోపిడీకి స్కెచ్‌ 
బార్ల విధానంలో తమకు అనుకూలంగా మరిన్ని సడలింపులు, మరింత లాభం మార్జిన్‌ దక్కించుకోవాలని కూడా సిండికేట్‌ లక్ష్యంగా పెట్టుకుంది. అందుకే ప్రస్తుత బార్ల విధానం పట్ల వ్యాపారులు ఎవరూ ఆసక్తి కనబరచడం లేదని నమ్మించేందుకు కూడా తక్కువ దరఖాస్తులు దాఖలు అయ్యేలా కథ నడిపిస్తున్నారు. ఇప్పటికే రోజుకు ఏకంగా 14 గంటలు బార్లు తెరచి ఉంచేలా, లైసెన్స్‌ దక్కిన తర్వాత రెస్టారెంట్‌ ఏర్పాటు చేసుకునేలా, ఆరు వాయిదాల్లో లైసెన్స్‌ ఫీజు చెల్లించేలా, ఇతరత్రా సడలింపులు చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చింది. అయినా సరే మరింత అడ్డగోలు దోపిడీపై సిండికేట్‌ గురి పెట్టింది.  



బార్ల యజమానులను ప్రోత్సహించాలనే సాకుతో లాభాల మార్జిన్‌ మరింత పెంచేలా, పన్నులు తగ్గించేలా ఒత్తిడి తేవాలన్నది లక్ష్యం. దరఖాస్తుదారుల నుంచి ఆ డిమాండ్‌ రాగానే వెంటనే ఆమోదించేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉందని సమాచా­రం. బార్ల యజమానులతో ముందుగా ఇండెంట్‌ పెట్టించి.. ప్రభుత్వమే తన డబ్బుతో మద్యం కొనుగోలు చేసేలా స్కెచ్‌ వేశారు. ఇందులోనే పెద్ద కుంభకోణం దాగి ఉంది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఇలా జరగలేదు.

బాబు రాజ్యం.. మద్యం దోపిడీ భోజ్యం
⇒ చంద్రబాబు ప్రభుత్వం అంటేనే టీడీపీ మద్యం సిండికేట్‌ దోపిడీ రాజ్యం అని మరోసారి కూటమి ప్రభుత్వం రుజువు చేస్తోంది. గతంలో టీడీపీ ప్రభుత్వం సాగించిన మద్యం దోపిడీకి మించిన స్థాయిలో ఈసారి మహా దోపిడీకి బరితెగిస్తోంది. 2014–19లో అప్పటి టీడీపీ ప్రభుత్వం మద్యం విధానం ముసు­గు­లో చంద్రబాబు యథే­చ్ఛగా అవినీతికి పాల్పడ్డారు. 

⇒ 2012 నుంచి అమ­లులో ఉన్న ప్రివిలేజ్‌ ఫీజును నిబంధనలకు విరుద్ధంగా రద్దు చేశారు. ఆర్థిక శాఖ అనుమతి­గానీ, కేబినెట్‌ ఆమోదం గానీ లేకుండానే 2015లో చంద్రబాబు ప్రభుత్వం కొత్త మద్యం విధా­నాన్ని తెచ్చింది. మద్యం దుకా­ణాలు, బార్లపై ప్రివిలేజ్‌ ఫీజును రద్దు చేస్తూ చీకటి జీవోలు 216, 217 జారీ చేసింది. తద్వారా 2015 నుంచి 2019 వరకు నాలుగేళ్లలో ఏడాదికి రూ.1,300 కోట్ల చొప్పున నాలుగేళ్లలో రూ.5,200 కోట్లు ప్రభుత్వ ఖజానాకు గండికొట్టారు. 

⇒ 4,840 ప్రైవేటు మద్యం దుకాణాలతోపాటు మరో 4,840 పర్మిట్‌ రూమ్‌లు ఏర్పాటు చేసింది. మద్యం దుకాణాలు, బార్లు అన్నీ టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. 43 వేల బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసింది. రాష్ట్రంలో 20 డిస్టిలరీలలో 14 డిస్టిలరీలకు టీడీపీ ప్రభుత్వమే (మిగతా ఆరింటికి అంతకు ముందు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి) అనుమతినిచ్చింది. అంతే కాకుండా బెవరేజెస్‌ కార్పొరేషన్‌ ద్వారా మద్యం కొనుగోళ్లకు మొత్తం 20 డిస్టిలరీలను ఎంప్యానల్‌ చేసింది కూడా నాటి టీడీపీ ప్రభుత్వమే. ఎంఆర్‌పీ కంటే 20 శాతం అధిక ధరలకు మద్యం విక్రయాలు సాగించి మరో రూ.20 వేల కోట్లు కొల్లగొట్టింది.

⇒ మొత్తం మీద 2014–19లో రూ.25 వేల కోట్ల దోపిడీకి పాల్పడింది. ఈ కుంభకోణాన్ని సీఐడీ ఆధారాలతో సహా నిగ్గు తేల్చింది. ప్రధాన నిందితులుగా అప్పటి సీఎం చంద్రబాబు, ఎక్సైజ్‌ శాఖ మంత్రి కొల్లు రవీంద్రలతోపాటు పలువురిపై ఐపీసీ సెక్షన్లు 166, 167, 409, 120(బి) రెడ్‌ విత్‌ 34, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 13(1), (డి), రెడ్‌ విత్‌ 13(2) కింద సీఐడీ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసింది. ఆ కేసులో చంద్రబాబు ఇప్పటికీ బెయిల్‌పై ఉన్నారు.

⇒ ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అంతకు మించి మద్యం దోపిడీకి బరితెగించింది. అందుకే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తొలగించిన ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను మళ్లీ తీసుకువచ్చింది. మొత్తం 3,736 మద్యం దుకాణాలు టీడీపీ సిండికేట్‌కే కట్టబెట్టింది. దాదాపు 75 వేల బెల్ట్‌ దుకాణాలను ఏర్పాటు చేసింది. ఇక 840 బార్లు కూడా తమ సిండికేట్‌కే కట్టబెట్టేందుకు సిద్ధపడుతోంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement