
విజయనగరం సభలో మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టీకరణ
మహిళలకు కూటమి సర్కార్ మరో ధోకా...
నాడు.. ఇంటింటికీ తిరిగారు.. బాండ్లు రాసిచ్చారు
సూపర్‌సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా పెట్టారు..
తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టారు
ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురుచూస్తుంటే ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేమని చేతులెత్తేశారు
ఆడబిడ్డ నిధి కింద ఈ 13 నెలల్లో మహిళలు కోల్పోయింది రూ.35,100 కోట్లు..
ఆంధ్ర మహిళా లోకాన్ని దారుణంగా దగా చేసిన చంద్రబాబు ప్రభుత్వం
ఏరుదాటాక తెప్పతగలేసినట్టు ఇప్పుడు మోసపూరిత ప్రకటనలా?.. మరి ఎన్నికలప్పుడు తెలియదా ఆంధ్రాను అమ్మాలని..?
ఎన్నికలకు ఏడాది ముందు నుంచే బాబు గ్యారంటీ అంటూ కరపత్రాలు
అన్నీ క్యాలిక్యులేషన్ చేసి.. ఎంత ఖర్చవుతుందో తెలుసుకునే మాట ఇస్తున్నామని లోకేశ్ ప్రగల్భాలు
అమలు చేయలేకపోతే కాలర్ పట్టుకోవచ్చంటూ ప్రజలను నమ్మించడానికి విశ్వప్రయత్నాలు..
మంత్రి వ్యాఖ్యలు.. కూటమి ప్రభుత్వ తీరుపై భగ్గుమంటున్న మహిళలు
ఎన్నికలకు ముందు చంద్రబాబు టీడీపీ అధికారంలోకి వచ్చాక మహా శక్తి కింద ఐదు కార్యక్రమాలు అమలు చేస్తాం. 19 నుంచి 59 ఏళ్ల మధ్య మహిళలందరికీ.. ఒక్కొక్కరికీ నెలకు రూ.1,500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు.. ఇంట్లో ఎంతమంది మహిళలు ఉంటే అందరికీ అందజేస్తాం.
– 2024 మార్చి 13న టీడీపీ ‘కలలకు రెక్కలు’ నినాదంతో వెబ్ పోర్టల్‌లో పేర్లు నమోదు కార్యక్రమం ప్రారంభం సందర్భంగా చంద్రబాబు
ఏరుదాటాక.. అచ్చెన్న ఆడవాళ్లకు నెలకు రూ.1,500 హామీని అమలు చేయాలంటే, ఆంధ్రానే అమ్మాలి. అంత డబ్బు అవసరం ఉంది. ఏమి చేయాలి? పథకం ఎలా అమలు చేయాలి? అని ఆలోచన చేస్తూ చంద్రబాబు ముందుకెళ్తున్నారు.
– విజయనగరం జిల్లా సభలో మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యలు
‘ఇచ్చిన ప్రతి హామీకి క్యాలిక్యులేషన్ చేసి ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకున్నాం. ఎలా అమలు చేయాలో తెలుసుకున్నాకే హామీ ఇచ్చాం. సూపర్ సిక్స్ వెరీ క్లియర్. ఇది మా ఎష్యూరెన్స్. పూర్తి చేస్తామని చెబుతున్నా. కెమేరాలు ఉన్నాయి. రికార్డు చేసుకోండి. ఇచ్చిన ప్రతి హామీ అమలు చేస్తాం. చేయకపోతే ప్రజలకు కాలర్ పట్టుకుని నిలదీసే హక్కు కూడా ఉంటుంది.
–2023 డిసెంబరులో ఓ టీవీ చానల్ ఇంటర్వ్యూలో నారా లోకేశ్
‘వైఎస్సార్‌సీపీ నాయకులు అడుగుతున్నారు హామీలు ఎలా నిలబెట్టుకుంటారని...?
అలాంటి వారందరికీ మీ లోకేశ్ ఒకటే సమాధానం ఇస్తున్నాడు. జగన్ అప్పుల అప్పారావు అయితే, మా చంద్రన్న సంపద సృష్టికర్త. మహిళలు ఎదుర్కొంటున్న కష్టాలు తెలిసి మా చంద్రన్న మహాశక్తి ప్రకటించారు. దాంట్లో ప్రధానంగా నాలుగు ప్రకటనలు ఉన్నాయి. మొదటిది ఆడబిడ్డ నిధి. 18 ఏళ్లు నిండిన మహిళలకు ప్రతి నెలా రూ.1,500 వాళ్ల ఖాతాలో వేస్తున్నాం. సంవత్సరానికి రూ.18 వేలు. ఐదేళ్లు రూ.90 వేలను తెలుగింటి ఆడపచుల అకౌంట్లలో మన చంద్రన్న వేయబోతున్నాడు’
–2023లో ఓ బహిరంగ సభలో నారా లోకేశ్
‘రాష్ట్ర ప్రజల నేటి అవసరాలను తీరుస్తూ... రేపటి ఆకాంక్షలను సాకారం చేసేలా రూపొందించిన మేనిఫెస్టోను పక్కాగా అమలు చేస్తాం’
–ప్రజాగళం పేరుతో 2024 ఏప్రిల్ 30న చంద్రబాబుతో కలిసి ఎన్నికల ఉమ్మడి మేనిఫెస్టో విడుదల సందర్భంగా అందులో పేర్కొన్న హామీల అమలుపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు.
‘చంద్రబాబు–పవన్‌కళ్యాణ్ ఉమ్మడిగా ప్రకటించిన మేనిఫెస్టోలో ‘ప్రతి మహిళకు నెలకు రూ.1500’ (19 నుంచి 59 సంవత్సరాల వరకు) అని పేర్కొన్నారు. కానీ, ఎన్నికలకు ఏడాది, ఏడాదిన్నర ముందు నుంచే... మేనిఫెస్టోలో పేర్కొన్నట్లుగా ‘19–59 సంవత్సరాల వరకు’ అన్నది కూడా లేకుండా, భవిష్యత్‌కు గ్యారెంటీ–బాబు ష్యూరిటీ నినాదంతో ‘ఆడబిడ్డ నిధి’ నుంచి ‘18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500’ అంటూ ప్రత్యేక కరపత్రాలను రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ నాయకులు ఇంటింటికీ పంచుతూ ప్రచారం చేశారు’.
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మహిళలందరికీ ప్రతి నెలా రూ.1,500 చొప్పున ఏటా రూ.18 వేలు ‘ఆడబిడ్డ నిధి’ ఇస్తామని ఇంటింటా బాండ్లు పంపిణీ చేసి.. తీరా గద్దెనెక్కాక చంద్రబాబు, కూటమి నేతలు మాట తప్పారు. సూపర్ సిక్స్ కింద మేనిఫెస్టోలో కూడా చేర్చి ఆ హామీ అమలు చేయకుండా మోసం చేశారు. తొలి ఏడాది రూ.32,400 కోట్లు ఎగ్గొట్టి అక్కచెల్లెమ్మలకు వెన్నుపోటు పొడిచారు.
ఈ ఏడాదైనా ఇస్తారని ఆశగా ఎదురు చూస్తుంటే ‘ఆంధ్రాను అమ్మితే తప్ప ఇవ్వలేం’ అని చేతులెత్తేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ఒక్క ఆడబిడ్డ నిధి పథకం కింద రాష్ట్రంలో మహిళలు గడిచిన 13 నెలల్లో ఏకంగా రూ.35,100 కోట్లు కోల్పోయారు. అధికారమే పరమావధిగా హామీల వర్షం కురిపించి.. ప్రజలను నమ్మించి.. గద్దెనెక్కాక వారిని నిలువునా మోసం చేయడంలో తనను మించిన వారు లేరని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోమారు చాటుకున్నారు.
ఎన్నికలకు ఏడాదిన్నర ముందు నుంచే చంద్రబాబు, లోకేశ్ సహా టీడీపీకి చెందిన చిన్న, పెద్ద నాయకుల వరకు ప్రజల ఇళ్లకు వెళ్లి తమ ప్రభుత్వం వస్తే ఆడబిడ్డ నిధి కింద చంద్రబాబు ప్రతి మహిళకు నెలకు రూ.1,500 చొప్పున ఇచ్చేలా పథకం అమలు చేస్తారని ఊదరగొట్టారు. ‘గ్యారంటీ’ కార్డులను కూడా పంపిణీ చేశారు. తీరా 13 నెలల పాటు పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టి.. ఇప్పుడేమో ఈ పథకాన్ని అమలు చేస్తే రాష్ట్రాన్నే అమ్మాల్సి ఉంటుందంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రి అచ్చెన్నాయుడు వ్యాఖ్యానించడం కూటమి మోసాలకు పరాకాష్టగా నిలిచింది.
ఎగవేతపై 2 నెలల కిందటే బాబు సంకేతాలు
⇒ ఆడ బిడ్డ నిధి హామీ అమలుపై సీఎం చంద్రబాబు పూర్తిగా చేతులేత్తేసినట్టే కనిపిస్తోంది. వాస్తవానికి రెండు నెలల కిందటే కర్నూలు బహిరంగ సభలో ఆయన ఈ మేరకు సంకేతాలు ఇచ్చారు. ఆయన మాట్లాడిన తీరే ఇందుకు నిదర్శనమని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. ప్రభుత్వం–ప్రైవేట్ భాగస్వామ్యంతో పి–4 కార్యక్రమం ద్వారా 2029 నాటికి రాష్ట్రంలో పేదరికం లేకుండా చేస్తానని, అప్పటికీ పేదలు మిగిలితే అడ్డబిడ్డ నిధి కింద ఇచ్చే డబ్బులు పి–4కు అనుసంధానం చేసి మహిళల ఆదాయాన్ని పెంచే మార్గం ఆలోచిస్తానంటూ కర్నూలులో చంద్రబాబు వ్యాఖ్యానించారు.
⇒ అంటే 2029 వరకు ఈ పథకం అమలు ఉండదని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలతో దీనికి మరింత బలం చేకూరుతోందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. వాస్తవానికి... ఎన్నికల్లో ఎలాగైనా గెలవడం అనే ఉద్దేశం తప్ప... ఇచ్చిన హామీలపై కూటమి ప్రభుత్వ పెద్దలకు చిత్తశుద్ధి లేదని వివరిస్తున్నారు. ఇందులోభాగంగానే హామీల అమలు నుంచి తప్పించుకునేందుకు సాకులు మీద సాకులు వెదుక్కుంటున్నారని చెబుతున్నారు.
మహిళలు నష్టపోయిన మొత్తం రూ.35,100 కోట్లు
⇒ ఎన్నికల నాటికి రాష్ట్రంలో 2,10,58,615 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అంటే వీరంతా 18 ఏళ్లు దాటినవారే. ఈ నేపథ్యంలో... టీడీపీ కూటమి ఎన్నికలకు ముందు చెప్పిన హామీ ప్రకారం మొత్తం 2.10 కోట్ల మందికి ప్రభుత్వం ప్రతి నెల రూ.1500 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన దాదాపు 30 లక్షల మంది పెన్షనర్లను తీసేసినా రాష్ట్రంలో సుమారు 1.80 కోట్ల మంది ఆడబిడ్డ నిధి పథకానికి అర్హులయ్యే అవకాశం ఉంది. వారికి ఏడాదికి రూ.18 వేలు చొప్పున 13 నెలల కాలంలో మొత్తం రూ.35,100 కోట్లు ఇప్పటికే కూటమి ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది.
⇒ ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1,500 చొప్పున అందజేస్తామంటూ చంద్రబాబు ఇచ్చిన హామీ ఎప్పటినుంచి అమలవుతుందా? అని రాష్ట్రవ్యాప్తంగా మహిళలు 13 నెలలుగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే.. ఒక్కొక్క నెల ఆలస్యం అయ్యేకొద్దీ వారు కోల్పోతున్న మొత్తం పెరుగుతోంది. ఇలా గత 13 నెలల్లో రాష్ట్రంలోని పేద మహిళలందరూ నెలకు ఏకంగా రూ.2,700 కోట్ల చొప్పున ఇప్పటికి రూ.35,100 కోట్ల లబ్ధిని కోల్పోయారు.
ఎన్నికలకు ముందు ఇచ్చిన అన్ని హామీలను నెరవేర్చిన వైఎస్ జగన్
కోవిడ్ వంటి మహమ్మారులు ఎదురైనా వెనక్కుతగ్గని వైనం
మేనిఫెస్టో అంటే భగవద్గీత, ఖురాన్, బైబిల్ అంత పవిత్రంగా భావించిన వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ హామీ ఇచ్చారంటే.. కచ్చితంగా అమలు చేస్తామని నిరూపించారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో కోవిడ్ వంటి మహమ్మారులు, అనుకోని విపత్తులు వచ్చినా అప్పటి సీఎం వైఎస్ జగన్ ఏమాత్రం వెనక్కుతగ్గలేదు.
2019 ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలును అపలేదు. కాగా, వైఎస్ జగన్ ప్రభుత్వం అమలు చేసిన నవరత్న పథకాలను చూపిస్తూ.. ‘రాష్ట్రం మరో శ్రీలంకలా తయారవుతుందోంటూ నాడు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ దుష్ప్రచారం చేసింది. తీరా సరిగ్గా ఎన్నికల సమయానికి ప్రజలను ప్రలోభపెట్టేందుకు చంద్రబాబు కూటమి హామీల వరద పారించింది. అధికారం దక్కాక మాత్రం వాటిని ఒక్కోటిగా పక్కనపెడుతోంది.
కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా..!
కూటమి ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మలను నట్టేట ముంచారు. ఆడబిడ్డ నిధి, బీసీ మహిళలకు 50 ఏళ్ల మహిళలకే పెన్షన్ ఇస్తామని మాయమాటలు చెప్పిన చంద్రబాబు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాలేదని, రాష్ట్రాన్ని అమ్మేయాలంటూ మంత్రులతో చెప్పిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏమిటో కుర్చీలో కూర్చున్నాకే తెలిసిందా?
– బూడి ముత్యాలనాయుడు, మాజీ డిప్యూటీ సీఎం
ఇది మంచి ప్రభుత్వమా?
ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తాం–సంక్షేమ పథకాలు అమలు చేస్తాం అని ఓట్లు వేయించుకుని.. గద్దెనెక్కిన తర్వాత అమలు చేయలేమని వ్యాఖ్యలు చేయడం మీకు తగునా అచ్చెన్నాయుడు? ఇది మంచి ప్రభుత్వమా చంద్రబాబూ?
– పాముల పుష్ప శ్రీవాణి, మాజీ డిప్యూటీ సీఎం
ముందుగా తెలియదా?
కూటమి పార్టీలు అబద్ధపు హామీలు ఇచ్చాయని మరోమారు తేటతెల్లమైంది. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తికి హామీలు అమలు చేయగలమా లేదా అనేది ముందుగా తెలియదా? చేయలేమని తెలిసీ ఎందుకు హామీలు ఇచ్చారు?
– ధర్మాన కృష్ణదాస్, మాజీ డిప్యూటీ సీఎం
మహిళలను నిలువునా మోసం చేశారు..
ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయాలంటే ఆంధ్రాను అమ్మేయాలనడం మహిళలను ఈ ప్రభుత్వం ఏ రకంగా మోసం చేసేందుకు కుట్రలు పన్నుతుందో తెలుస్తోంది. మొదటి ఏడాది ఎగ్గొట్టినా రెండో ఏడాది నుంచి అయినా ఇస్తారని చూస్తున్న మహిళల నోట్లో కూటమి మన్ను కొట్టింది. అధికార దాహంతో హామీలు గుప్పించారు. అమలు చేయలేక చేతకాని మాటలు మాట్లాడటం మహిళలను నిట్టనిలువునా మోసం చేయడమే.
– కారుమూరి వెంకట నాగేశ్వరరావు, వైఎస్సార్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్
అబద్ధపు హామీలిచ్చారా?
చంద్రబాబు, అచ్చెన్నాయుడు ఎన్నికల ముందు కళ్లు మూసుకుపోయిన అబద్ధపు హామీలు ఇచ్చారా? మీ మాటలు నమ్మి ఆడబిడ్డలు ఓట్లు వేశారు. వారిని మోసం చేసేందుకు చంద్రబాబే అచ్చెన్నాయుడు చేత ఇలాంటి వ్యాఖ్యలు చేయిస్తున్నారు. రాష్ట్రాన్ని అమ్మేస్తే కాని తీర్చలేని హామీలు మీకు ఎవరు ఇమ్మన్నారు?
– తమ్మినేని సీతారాం, మాజీ స్పీకర్
సంపద సృష్టిస్తానని చేతులెత్తేశారు!
ఒక్క హామీని అమలు చేయకుండా సుపరిపాలనకు చీతొలి అడుగుచీ అంటూ టీడీపీ మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. చంద్రబాబు ఏమో సంపద సృష్టిస్తా.. పథకాలు అమలు చేస్తా అన్నారు. ఇప్పుడేమో మంత్రి అచ్చెన్నాయడు చీఆడబిడ్డ నిధిచీ అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలంటున్నారు. పథకాలు అమలు చేయలేనప్పుడు హామీలు ఎందుకు ఇచ్చారు?
– విడదల రజిని, మాజీ మంత్రి
అడ్డమైన హామీలు ఇచ్చి మోసం చేస్తారా?
సంక్షేమ పథకాలు అమలు చేయాలంటే ఆంధ్రప్రదేశ్‌ను అమ్మాలా? అలా మాట్లాడడానికి సిగ్గులేదా అచ్చెన్నాయుడు? ఎన్నికల ముందు హామీలు ఇచ్చేటప్పుడు తెలియదా? అప్పుడేమో ఓట్లు కోసం అడ్డమైన హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చాక ఇలా మాట్లాడమని మీ నాయకుడు చంద్రబాబు చెప్పారా?
– ఆర్కే రోజా, మాజీ మంత్రి
చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది
ఆడబిడ్డ నిధిని అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాల్సిందే అని అచ్చెన్నాయుడు అనడం దారుణం. ఈ విషయం ఎన్నికలప్పుడు చంద్రబాబుకు తెలియదా? అమలు చేయలేని హామీలివ్వడం అంటే ప్రజలను మోసం చేయటమే కాదా? హామీలు అమలు చేయటంలో చేతులెత్తేసి మంత్రులతో ఇలా నిస్సిగ్గుగా మాట్లాడించడంతో చంద్రబాబు వైఖరేంటో తేటతెల్లమైంది.
– మేరుగు నాగార్జున, మాజీ మంత్రి
ప్రజల పక్షాన పోరాటం చేస్తాం
రాష్ట్ర ప్రభుత్వం చేసిన ఈ మోసానికి నిఘంటువులో కొత్త పదం వెతకాలి. ఆడబిడ్డ నిధి అమలుకు రాష్ట్రాన్ని అమ్మాల్సిందేనని మంత్రి మాట్లాడటం మహిళలను అవమానపరచడమే. వాగ్దానాలు ఇచ్చినప్పుడు తెలియదా? ముఖ్యమంత్రి సంతకానికి ఉన్న విలువ ఇదేనా? కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేసే వరకు ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తాం.
– డాక్టర్ ఆదిమూలపు సురేష్, మాజీ మంత్రి
చంద్రబాబు వెన్నుపోటు పొడిచారు
ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రజల ఆశలపై వెన్నుపోటు పొడిచారు. అచ్చెన్నాయుడు నోట మాట వచ్చిందంటే అది చంద్రబాబు మాటే. సంపద సృష్టించి ప్రజలకు పంచి పెడతామంటూ వివిధ నూతన విధానాల పేరుతో ప్రజల నడ్డివిరుస్తున్నారు. కూటమి దగాకోరు మాటలను ప్రజలందరూ గమనిస్తున్నారు.
– డాక్టర్ సాకే శైలజానాథ్, మాజీ మంత్రి
అచ్చెన్నాయుడూ.. సిగ్గుండాలి
రాష్ట్రాన్ని ఇప్పటికే అమ్మేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. కొత్తగా ఏదో ఆడబిడ్డ నిధి కోసం రాష్ట్రాన్ని అమ్మాలని వ్యాఖ్యలు చేయడానికి అచ్చెన్నాయుడుకి సిగ్గుండాలి. ఏరు దాటాక తెడ్డు తగలేసే వైఖరి కూటమిది. ఆడబిడ్డలకు ఇస్తానన్న పథకాలను అమలు చేయకపోగా సిగ్గూఎగ్గూ లేకుండా రాష్ట్రాన్ని అమ్మాలని అనటం సబబు కాదు. మహిళలను వంచిస్తున్న కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయి.
– అంబటి రాంబాబు, మాజీ మంత్రి
హామీలు ఎందుకిచ్చారు?
ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం దుర్మార్గం. కూటమి ప్రభుత్వం మహిళలను దారుణంగా మోసం చేస్తోంది. ఆడబిడ్డలకు ఈ ప్రభుత్వ అబద్ధపు హామీలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇచ్చారో కూటమి నేతలు చెప్పాలి.
– డాక్టర్ సీదిరి అప్పలరాజు, మాజీ మంత్రి
నమ్మించి.. నయ వంచన..
‘ఆడబిడ్డల కష్టాలు కళ్లారా చూశాను. ఆ కష్టాల నుంచి బయట పడేయడానికి ఆడబిడ్డ నిధి పథకం తీసుకువచ్చాం’ అని ఎన్నికల ముందు ప్రతి సభలో చంద్రబాబు ప్రచారం చేశారు. ఇంట్లో ఎంత మంది ఉంటే అంత మందికి ప్రతి నెలా రూ.1,500లు చొప్పున ఏడాదికి రూ.18000 ఇస్తామన్నారు. అధికారంలోకి వచ్చాక నయవంచన చేశారు.
– వరుదు కళ్యాణి, ఎమ్మెల్సీ
ప్రజలను దగా చేసింది..
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో టీడీపీ వైఖరి మరోసారి తేటతెల్లమైంది. ఆడబిడ్డ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గు చేటు. అలవికాని హామీలిచ్చి టీడీపీ ప్రజలను నిలువుగా దగా చేసింది. ఓటు వేసినందుకు ప్రజలు టీడీపీని అసహ్యించుకుంటున్నారు. త్వరలోనే కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు.
– పర్వతరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి, ఎమ్మెల్సీ
పథకాలకు ఎగనామం పెట్టేందుకే ..
ఆడబిడ్డ నిధి సంక్షేమ పథకం అమలు చేయాలంటే ఏపీనే తాకట్టు పెట్టాలని టీడీపీ మంత్రి అచ్చెన్నాయుడు అనడం ఆశ్చర్యకరంగా ఉంది. సంక్షేమ పథకాల హామీలకు ఎగనామం పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కుట్రలు పన్నుతుంది. సూపర్ సిక్స్‌తో పాటు 143 హామీలు ఇచ్చి ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారు.
– కేకే రాజు, వైఎస్సార్‌సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు
ప్రభుత్వ మెడలు వంచుతాం
అలవిగాని హామీలతో చంద్రబాబు గద్దెనెక్కారు. ఏడాదిలోనే రూ.1,87,000 కోట్ల అప్పులు చేశారు. ఆడబిడ్డ నిధి ఇవ్వాలంటే రాష్ట్రాన్ని అమ్ముకోవాలంటూ మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలతో కూటమి ప్రభుత్వ నిజస్వరూపం బయటపడింది. చంద్రబాబు జీవితమంతా మోసపూరితం, కుట్రలే. ప్రభుత్వం మెడలు వంచైనా పథకాలు అమలు చేయించేలా పోరాటం చేస్తాం.
– అనంత వెంకటరామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు
ప్రజలు ప్రభుత్వ భరతం పడతారు
ఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. హామీల అమలుకు ఎంత ఖర్చవుతుందనే కనీస పరిజ్ఞానం కూడా కూటమి ప్రభుత్వానికి లేదు. రాష్ట్రాన్నే కాదు, దేశాన్ని అమ్మినా చంద్రబాబు ఇచ్చిన హమీలు అమలు చేయలేరు. బాబు ష్యూరీటీ, మోసం గ్యారెంటీ అని తేలిపోయింది. ప్రజలంతా ఈ ప్రభుత్వ భరతం పట్టడం ఖాయం.
– ఎస్‌వీ మోహన్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు
మాటపై నిలబడే ప్రభుత్వం కాదిది
కూటమిది మాటపై నిలబడే ప్రభుత్వం కాదని తెలిసిపోయింది. మేనిఫెస్టోను అమలు చేయలేమని వారికి కూడా తెలుసు. అయినా ఎన్నికల్లో నీకు రూ.18వేలు, నీకు రూ.18వేలు అని మహిళందరికీ చెప్పి ఇప్పుడు మోసం చేస్తున్నారు. ఆడబిడ్డ నిధి పథకాన్ని ఎత్తేసే కార్యక్రమంలో భాగంగానే అచ్చెన్నాయుడితో మాట్లాడించారు.
– పి.రవీంద్రనాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు
మహిళలను మోసగించే ఎత్తుగడ
మహిళలకు రూ.1,500 ఇవ్వడానికి రాష్ట్రాన్ని అమ్మేయాలా? మంత్రి అచ్చెన్నాయుడి మాటలు మహిళలను మోసగించే ఎత్తుగడ అని స్పష్టమవుతుంది. చంద్రబాబు జీవితమంతా ప్రజలను మోసగించడమే. అమలుకాని హామీలు ఇవ్వడం ఆ తరువాత వెన్నుపోటు పొడవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
– ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు
రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు
ఆడబిడ్డ నిధిపై మంత్రి అచ్చెన్నాయుడి వ్యాఖ్యలు దమననీతికి నిదర్శనం. పథకం అమలుకు రాష్ట్రాన్ని అమ్మేయాలనడం సిగ్గుచేటు. ఆడబిడ్డనిధిని అమలు చేయలేమని చేతులెత్తేయడం కూటమి పాలన దగా కోరుకు నిదర్శనం.
– శ్రీకాంత్‌రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి