ఏఎన్‌యూని కొల్లగొడుతున్న చంద్రబాబు సర్కార్‌ | Chandrababu Naidu government is using ANU funds | Sakshi
Sakshi News home page

ఏఎన్‌యూని కొల్లగొడుతున్న చంద్రబాబు సర్కార్‌

Apr 24 2026 4:10 AM | Updated on Apr 24 2026 4:10 AM

Chandrababu Naidu government is using ANU funds

ఇప్పటికే రూ.100 కోట్లు సమర్పించిన వర్సిటీ 

మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం 

పదవుల కోసం వర్సిటీ పాలకుల పాట్లు

సాక్షి ప్రతినిధి, గుంటూరు:  ఆచార్య నాగార్జున యూని­వర్సిటీ (ఏఎన్‌యూ) నిధులను చంద్రబాబు ప్రభుత్వం వాడేసుకుంటోంది. విశ్వవిద్యాలయం అభివృద్ధిని, అతిథి అధ్యాపకుల వేతనాలను పట్టించుకోని వర్సిటీ పాలకులు ప్రభుత్వ కటాక్షం కోసం సాగిలపడుతున్నారు. ఇప్పటికే రూ.100 కోట్లను ప్రభుత్వానికి అప్పగించిన తాత్కాలిక పాలకులు మరో రూ.50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. తాత్కాలిక పాలకుల తీరు విశ్వవిద్యాలయం భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తుందని ఉద్యోగులు, విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. వర్సిటీ అవినీతి ఊబిలో కూరుకుపోయినా ప్రభుత్వం పట్టించుకోకపో­వ­డా­నికి నిధుల మళ్లింపే కారణమన్న ఆరోపణలు­న్నా­యి. 

ప్రభుత్వాధికారుల మౌఖిక ఆదేశాలను పాటిస్తూ.. తాత్కా­లిక పాలకులు తమ పదవులను కాపాడుకునేందుకు ఇష్టారీతిన డబ్బును ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏఎన్‌యూ ప్రభుత్వానికి రూ.100 కోట్లు ఇచ్చినట్లు మార్చిలో జరిగిన వర్సిటీ ఫైనాన్స్‌ కమిటీ సమావేశంలో వెల్లడైంది. ఇందుకు సంబంధించిన ప్రొసీడింగ్స్‌ జనవరి 29న వెలువడినట్లు సమాచారం. నిధులను విడతల­వారీ­గా ఒక ఫైనాన్షియల్‌ కార్పొరేషన్‌లో డిపాజిట్‌ చేసినట్లు వర్సిటీ వర్గాలు చెబుతున్నాయి. 

ఈ డిపాజిట్‌పై 7.75 శాతం వడ్డీ వర్సిటీకి అందేలా ఒప్పందం జరిగినట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఫైనాన్స్‌ కమిటీ సమావేశంలో చర్చ జరిగింది. మార్చి 30న జరిగిన వర్సిటీ పాలకమండలి సమావేశం రూ.3 కోట్ల లోటు బడ్జెట్‌కు ఆమోదం తెలిపింది. పీఎఫ్‌ అధికారులు రూ.6 కోట్లను సీజ్‌ చేసి­నప్పుడు ఆందోళన చెందిన వర్సిటీ అధికారులు, ఇంత పెద్ద మొత్తాన్ని ధారాదత్తం చేయడానికి పదవులే ప్రధా­న కారణమని ప్రచారం జరుగుతోంది. ఇంత రహస్యంగా నిధులను దారి మళ్లించడంపై విమర్శలు వెల్లువెత్తు­తున్నాయి. దీనిపై అధికారులు నోరు విప్పడం లేదు. 

నిధుల కోసమే చూసీచూడనట్లు.. 
పీఎఫ్‌ బకాయిలు చెల్లించలేదని అడిగినా, లేబర్‌ కమి­షనర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించని వర్సిటీ అధికా­రులు.. ప్రభుత్వానికి రూ.100 కోట్లను ఎలా ఇస్తారని వర్సిటీ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. అక్టోబర్‌లో నియ­మి­తులైన ఉపకులపతి ఇప్పటికీ బాధ్యతలు స్వీకరించకపో­యి­నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం వెనుక కూడా నిధు­ల బదిలీనే కారణమని పేర్కొంటున్నారు. పేపర్‌ లీకే­జీ­లు, పరీక్షల నిర్వహణలో అవినీతి వంటి అనేక వివా­దా­లపైనా ప్రభుత్వం చూసీచూడనట్లు వ్యవహరించడానికి ఇదే కారణమని ఉద్యోగులు ఆవేదన చెందుతున్నారు.

పదవుల కోసమే నిధులు ధారాదత్తం 
తాత్కాలిక పాలకులు తమ పదవులను కాపాడు­కోవడానికి ఏఎన్‌యూ నిధులు రూ.100 కోట్లను ప్రభుత్వానికి ధారాదత్తం చేశారు. అతిథి ఆధ్యాపకులకు జీతాలు మాత్రం సక్రమంగా చెల్లించడంలేదు. సుమారు 130 మంది అతిథి ఆధ్యాపకులకు జీతాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారు. ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించకుండా కోట్లాది రూపాయలు వసూలు చేసినా, కాసులు వసూలు చేసి కాపీ కొట్టిస్తున్నా, దళిత మహిళా అధికారులను వేధిస్తున్నా, మహిళా ప్రొఫెసర్ల పట్ల అనుచితంగా ప్రవర్తించినా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. – పంతగాని రమేష్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం ఏఎన్‌యూ గౌరవాధ్యక్షుడు   

Advertisement
 
Advertisement
Advertisement