
సాక్షి, అమరావతి: రెడ్‌బుక్ కుట్రలకు అడ్డగోలుగా వత్తాసు పలికే పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీలుగా అవకాశం ఇచ్చేందుకు చంద్రబాబు సర్కారు సన్నద్దమవుతోంది. అందుకోసం క్యాడర్ ఐపీఎస్ అధికారులు కాకుండా తమకు కొమ్ము కాసే ‘కన్‌ఫర్డ్ ఐపీఎస్’ అధికారులను నియమించాలని భావిస్తోంది. ఇది పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది.
రెడ్‌బుక్ కుట్ర కేసులతో ఐపీఎస్‌లు బెంబేలు..
టీడీపీ కూటమి సర్కారు ఏడాదికిపైగా సాగిస్తున్న రెడ్‌బుక్ కక్ష సాధింపు చర్యలతో పలువురు ఐపీఎస్ అధికారులు బెంబేలెత్తుతున్నారు. అధికార పార్టీకి అడ్డగోలుగా కొమ్ముకాస్తూ అక్రమ కేసులతో వేధింపులకు పాల్పడితే భవిష్యత్‌లో న్యాయపరంగా, ఇతరత్రా ఇబ్బందులు తప్పవన్నది వారి ఆందోళన. ప్రధానంగా ఇంకా చాలా సర్వీసు ఉన్న ఐపీఎస్ అధికారులు మరింత ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ కుట్రల్లో భాగస్వాములు కాలేమని డీజీ, అదనపు స్థాయి సీనియర్ ఐపీఎస్‌లే సహాయ నిరాకరణ చేస్తుండటాన్ని ప్రస్తావిస్తున్నారు.
సీఐడీ ఐజీగా ఉన్న వినీత్ బ్రిజ్‌లాల్ రెడ్‌బుక్ కుట్రలకు సహకరించలేనని కేంద్ర సర్వీసులకు వెళ్లిపోయారు. మరో యువ ఐపీఎస్ సిద్ధార్థ్ కౌశల్ స్వచ్ఛందంగా ఉద్యోగ విరమణ చేశారు. ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు ఎస్పీ కృష్ణకాంత్ తీవ్ర ఒత్తిడితో ఇప్పటికే రెండుసార్లు కుప్పకూలి అనారోగ్యం బారిన పడ్డారు. ఈ పరిణామాలన్నీ క్యాడర్ ఐపీఎస్ అధికారులను పునరాలోచనలో పడేశాయి. రెడ్‌బుక్ కుట్ర కేసులకు దూరంగా జరుగుతున్నారు. కొందరు నేరుగా చెప్పలేక సహాయ నిరాకరణ చేస్తున్నారు. ప్రభుత్వం తమను అప్రాధాన్య పోస్టుకు బదిలీ చేసినా పర్వాలేదు కానీ అక్రమ కేసులకు వత్తాసు పలకలేమని తేల్చి చెబుతున్నారు.
అస్మదీయ కన్‌ఫర్డ్ ఐపీఎస్‌లతో రెడ్‌బుక్ కుట్ర..
చంద్రబాబు ప్రభుత్వం మరో ఎత్తుగడకు తెరతీసింది. తమకు అస్మదీయులైన కన్‌ఫర్డ్ ఐపీఎస్‌ల ద్వారా రెడ్‌బుక్ కుట్రను తీవ్రతరం చేయాలని భావిస్తోంది. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం 14 మందిని కన్‌ఫర్డ్ ఐపీఎస్‌లుగా గుర్తించింది. దాంతో జిల్లా ఎస్పీల బదిలీల ప్రక్రియపై ప్రభుత్వం కసరత్తు వేగవంతం చేసింది. తిరుపతి విజిలెన్స్–ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం తిరుపతి ఆర్‌ఈవీవోగా ఉన్న కరీముల్లా షరీఫ్, కర్నూలు ఆర్‌ఈవీవోగా ఉన్న చౌడేశ్వరి, ఇంటెలిజెన్స్ విభాగంలో ఉన్న రామ్మోహన్‌రావులను ఇప్పటికే సూత్రప్రాయంగా ఎంపిక చేసినట్లు సమాచారం.
కరీముల్లా షరీఫ్‌ను పుట్టపర్తి జిల్లాకు, చౌడేశ్వరిని ఉభయ గోదావరిలో ఒక జిల్లా, రామ్మోహన్‌రావును నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో ఒక జిల్లాకు ఎస్పీగా నియమించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. మరో కన్‌ఫర్డ్ ఐపీఎస్ అధికారి చక్రవర్తిని పల్నాడు జిల్లా ఎస్పీగా నియమించాలని భావిస్తున్నారు. సీఐడీ విభాగంలో ఉన్న కన్‌ఫర్డ్ ఐపీఎస్ అ«దికారి ఈశ్వరరావు, శ్రీనివాసరావులకు కీలక జిల్లాల ఎస్పీలుగా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. ప్రకాశం ఎస్పీ దామోదర్‌ను మరో కీలక జిల్లాకు ఎస్పీగా బదిలీ చేసే అవకాశం ఉంది. కన్‌ఫర్డ్ ఐపీఎస్ అధికారులను కీలక జిల్లాల ఎస్పీలుగా నియమించేందుకు వీలుగా క్యాడర్ ఐపీఎస్ అధికారులను అప్రాధాన్య పోస్టుటులకు బదిలీ చేయాలనే ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది.