అంతర్జాతీయ విమానాశ్రయం మూసివేతకు చంద్రబాబు సర్కారు సిద్ధం
కొత్తగా అమరావతిలో 4,618 ఎకరాల్లో విమానాశ్రయానికి శ్రీకారం
నిన్నటి దాకా గన్నవరం కూడా అమరావతిలో భాగమేనని ప్రచారం
ఈ ఎయిర్‌పోర్ట్ విస్తరణకు రూ.4,000 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం
విజయవాడకు 20 కి.మీ.దూరంలో జాతీయ రహదారి పక్కనే విమానాశ్రయం
పశ్చిమ బైపాస్ మీదుగా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకొనే అవకాశం
అయినా రాజధానికి దూరమంటూ ఎయిర్‌పోర్టు అమరావతికి తరలింపు
రాజధానిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఇప్పుడు ప్లేటు ఫిరాయింపు
కొత్త ఎయిర్‌పోర్ట్ రాకతో గన్నవరం ఎయిర్‌పోర్టు మూసివేత తప్పదు
కొత్త విమానాశ్రయం కోసం ఏకంగా 4,618 ఎకరాలు
అత్యంత రద్దీగా ఉండే లండన్ హీత్రూ విమానాశ్రయం ఉన్నది 1,670 ఎకరాల్లోనే
శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు వినియోగించింది 2 వేల ఎకరాలే
చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారంపై సర్వత్రా విమర్శలు
సర్కారు దుబారా ఖర్చులపై భగ్గుమంటున్న రాష్ట్ర ప్రజలు
సాక్షి, అమరావతి: ఓ వైపు ప్రధాని నరేంద్ర మోదీ అనవసర వ్యయాలు తగ్గించుకుని పొదుపు పాటించండని పిలుపునిస్తుంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ దుబారాలో తనను మించిన వారు లేరని నిరూపిస్తున్నారు. ఈ క్రమంలో తన ప్రచార కండూతి కోసం రాజధానిలో విమానాశ్రయం పేరుతో రూ.7,500 కోట్ల ప్రజాధనాన్ని వృథా చేయడానికి వెనుకాడటం లేదు.
నిన్నటి వరకు గన్నవరం రాజధానిలో భాగమంటూ ఈ అంతర్జాతీయ విమానాశ్రయం అభివృద్ధి కోసం రూ.4,000 కోట్లకు పైగా వ్యయం చేసి, ఇప్పడు టెర్మింనల్ పనుల టెండర్లను రద్దు చేసి ఎక్కడి పనులను అక్కడే ఆపేశారు. భూ సేకరణ, ఫ్లై ఓవర్లు, కొత్త రన్‌వే, కొత్త టెర్మింనల్ ఇలా రూ.నాలుగు వేల కోట్ల ఖర్చును గంగపాలు చేయడానికి సిద్ధమైపోయారు. ఈ క్రమంలో అమరావతిలో 4,618 ఎకరాల్లో రూ.3,409 కోట్ల పెట్టుబడితో కొత్త విమానాశ్రయం కట్టడానికి సిద్ధపడుతుండటంపై రాష్ట్ర ప్రజలు భగ్గుమంటున్నారు.
ఇప్పటిదాక విజయవాడ, గన్నవరం రాజధాని అమరావతి పరిధిలోకే వస్తాయంటూ ప్రచారం చేసిన చంద్రబాబు సర్కారు.. ఇప్పుడు ప్లేట్ ఫిరాయించింది. గన్నవరం విమానాశ్రయం అమరావతికి కేవలం 35 కిలోమీటర్ల దూరంలో జాతీయ రహదారి–16కు ఆనుకొని అందరికీ అందుబాటులో ఉంది. పైగా పశ్చిమ బైపాస్ ద్వారా 30 నిమిషాల్లోనే రాజధానికి చేరుకునే వీలుంది. ఇవన్నీ లెక్కలు వేసుకునే అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణకు ఏకంగా 700 ఎకరాలు సేకరించారు.
భూ సేకరణ సమయంలో గన్నవరం కూడా రాజధాని పరిధిలోకే వస్తుందని హామీ ఇవ్వడమే కాకుండా, విమానాశ్రయం విస్తరణకు భూమి ఇచి్చన రైతులకు రాజధాని ప్రాంతంలో అభివృద్ధి చేసిన ప్లాట్లు కేటాయించారు. ఇప్పుడు ఈ విమానాశ్రయాన్ని అమరావతికి తరలించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తు అవసరాలకు మరింత విస్తరించాల్సింది పోయి దీన్ని మూసి వేయడం ద్వారా ఈ ప్రాంత ప్రజలను మోసం చేస్తున్నారంటూ స్థానికులు మండిపడుతున్నారు.
1,670 ఎకరాల్లో హీత్రూ విమానాశ్రయం
దేశ రాజధాని ఢిల్లీ ప్రస్తుత జనాభా 3.4 కోట్లు. ఢిల్లీలో ఉన్న ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం విస్తరణ 1,500 ఎకరాల లోపే. దేశ ఆర్ధిక రాజధాని ముంబై జనాభా 1.25 కోట్లు. అక్కడి ఛత్రపతి శివాజీ విమానాశ్రయం ఉన్నది 1,850 ఎకరాల్లోనే. హైదరాబాద్ జనాభా 1.10 కోట్లు. శంషాబాద్ రాజీవ్‌గాంధీ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు కేటాయించినా, ఇప్పటి వరకు వినియోగించుకున్నది 2 వేల ఎకరాలు మాత్రమే. అంతర్జాతీయంగా అత్యంత రద్దీగా పేరు పొందిన లండన్ హీత్రూ విమానాశ్రయం 1,670 ఎకరాల్లోనే ఉంది. ఆ విమానాశ్రయం నుంచి ఏటా 84 దేశాలకు చెందిన 214 ప్రాంతాలకు 8 కోట్ల మందికిపైగా ప్రయాణిస్తారు.
అయితే మూడు లక్షల జనాభా కూడా లేని అమరావతి రాజధానిలో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు కోసం దాదాపు 5 వేల ఎకరాలు ఎందుకని తెలుగుదేశం పార్టీ నాయకులే విమర్శలు గుప్పిస్తున్నారు. అమరావతి తొలి దశ పూర్తి కావడానికే 30 ఏళ్లకు పైగా సమయం పడుతుందని ప్రపంచ బ్యాంకు నివేదికలు చెబుతున్నాయని, అక్కడ ఇప్పుడు ఇంత భారీ విస్తీర్ణంలో, భారీ ఖర్చుతో కొత్త విమానాశ్రయం అవసరం ఏముందని ప్రశి్నస్తున్నారు. ఇది కేవలం రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం చేపట్టిన ప్రాజెక్టు తప్ప మరొకటి కాదని, అమరావతి విమానాశ్రయం ఆలోచన ఉపసంహరించుకొని గన్నవరం విమానాశ్రయాన్నే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రాభవం కోల్పోనున్న విజయవాడ
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పిచ్చి కారణంగా విజయవాడ నగరం ప్రాభవాన్ని కోల్పోయే పరిస్థితి వచి్చందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విశాఖ తర్వాత రాష్ట్రానికి ప్రధాన నగరంగా వెలుగొందుతున్న విజయవాడ ఇకపై అనామకంగా మిగిలిపోయేలా ప్రభుత్వ చర్యలు ఉన్నాయని విమర్శిస్తున్నారు. దేశంలో ప్రధాన బస్టాండ్లలో ఒకటిగా ఉన్న విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్, ప్రధాన రైల్వే జంక్షన్లలో ఒకటైన విజయవాడ రైల్వే స్టేషన్‌ను కూడా అమరావతికి తరలించి విజయవాడను రాజధానితో అనుబంధం లేకుండా చేస్తున్నారంటూ మేధావులు వాపోతున్నారు.
ఏదైనా ప్రైవేట్ సంస్థ కొత్తగా ఎయిర్‌పోర్టు నిర్మింస్తే సమీపంలో మరో ఎయిర్‌పోర్టు ఉండకూడదని ప్రభుత్వాలతో కన్సెషన్ ఒప్పందాలు చేసుకుంటాయి. 150 కిలోమీటర్ల దూరంలో అప్పటికే ఎయిర్‌పోర్టులు ఉంటే వాటిని మూసివేయాలి. దీని ప్రకారం అమరావతిలో కొత్త ఎయిర్‌పోర్టు వస్తే 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ను మూసి వేయాల్సి ఉంటుంది.
కేంద్ర ప్రభుత్వం కూడా పక్కపక్కనే రెండు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులకు అనుమతి ఇవ్వదని అధికారులు చెబుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టు వచి్చన తర్వాత బేగంపేట ఎయిర్‌పోర్టు మూత పడినట్లే, అమరావతి ఎయిర్‌పోర్ట్ వస్తే గన్నవరం విమానాశ్రయం కూడా మూసి వేయాల్సి ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అయినా అంత పెద్ద లండన్‌లోనే ఒకే విమానాశ్రయం ఉండగా, గన్నవరం సమీపంలోని అమరావతిలో మళ్లీ కొత్తగా విమానాశ్రయం నిర్మాణానికి పూనుకోవడం పట్ల సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. పొదుపు చర్యలు అంటే ఇవేనా అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు మండిపడుతున్నారు.


