బాబు చేసిన పాపాలు | Chandrababu Debts at highest interest during five years of TDP rule | Sakshi
Sakshi News home page

బాబు చేసిన పాపాలు

Jul 24 2022 3:13 AM | Updated on Jul 24 2022 7:49 AM

Chandrababu Debts at highest interest during five years of TDP rule - Sakshi

చంద్రబాబు సర్కారు 2016–17, 2017–18లో 7.6 శాతం.. 2018–19లో ఏకంగా 8.3 శాతం వడ్డీతో మార్కెట్‌ రుణాలు తీసుకుంది. ప్రస్తుత ప్రభుత్వం 2019–20 ఆర్థిక సంవత్సరంలో 7.2%, 2020–21లో 6.5% వడ్డీతో మాత్రమే మార్కెట్‌ రుణాలు తీసుకుంది. క్రమంగా అప్పులు కూడా తగ్గిస్తోంది.
– ఆర్‌బీఐ నివేదిక  

సాక్షి, అమరావతి: గత చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అత్యధిక వడ్డీలకు అప్పులు చేసినట్లు ఆర్‌బీఐ అధ్యయన నివేదిక స్పష్టం చేసింది. ఏ సంవత్సరం కూడా ఎఫ్‌ఆర్‌బీఎం (ద్రవ్య జవాబుదారీ బడ్జెట్‌ నిర్వహణ చట్టం) నిబంధనలను పాటించలేదని కుండబద్దలు కొట్టింది. 2014–15 ఆర్థిక ఏడాది నుంచి ఇప్పటి వరకు దేశంలో వివిధ రాష్ట్రాల ఆర్థిక నిర్వహణ, అప్పులు, అప్పులపై వడ్డీలు, వ్యయాల తీరు తెన్నులపై ఆర్‌బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపొందించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక వడ్డీలకు ఎక్కువ అప్పులు చేస్తోందని గగ్గోలు పెడుతున్న ఈనాడు, టీడీపీ బృందానికి.. బాబు గత ఐదేళ్ల పాలనలో ఆర్థిక నిర్వహణపై ఆర్‌బీఐ వెల్లడించిన అధ్యయన నివేదిక కనిపించడం లేదు.

ఈ నివేదిక ప్రకారం చంద్రబాబు ప్రభుత్వం మార్కెట్‌ అప్పులను ఇతర రాష్ట్రాల కన్నా ఎక్కువ వడ్డీకి తీసుకున్నట్లు స్పష్టం అవుతోంది. స్టేట్‌ డెవలప్‌మెంట్‌ రుణాల కింద మార్కెట్‌ నుంచి రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీల వేలం ద్వారా తీసుకున్న అప్పులకు సాధారణం కన్నా 45 బేసెస్‌ పాయింట్లు ఎక్కువ వడ్డీ పడినట్లు ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఇప్పటి ప్రభుత్వం క్రమంగా అప్పులను కూడా తగ్గిస్తోందని తెలిపింది. 2020–21 బడ్జెట్‌లో రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో అప్పులు 35.5 శాతం ఉంటాయని అంచనా వేయగా, వాస్తవానికి సవరించిన అంచనాల్లో అవి 32.5 శాతానికే పరిమితం అయినట్లు వెల్లడించింది. ఆ అప్పులు కూడా తక్కువ వడ్డీకే తెచ్చిందని తెలిపింది.


చంద్రబాబు ఐదేళ్ల పాలనలో నాలుగేళ్ల పాటు ద్రవ్యలోటు 4 శాతం పైగానే ఉందని.. ఒక ఏడాది ఏకంగా 6 శాతానికి చేరిందని తెలిపే ఆర్‌బీఐ నివేదికలోని ఓ భాగం 

బాబు జమానాలో ఎఫ్‌ఆర్‌బీఎంను మించి అప్పులు
బాబు హయాంలో ఎక్కువ వడ్డీలకు అప్పులు తేవడం అప్పట్లో దిగజారిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితికి అద్దం పట్టింది. రాష్ట్ర ఆర్థిక పరపతి దిగజారినప్పుడే ఎక్కువ వడ్డీలకు గానీ అప్పులు పుట్టవని ఆర్‌బీఐ నివేదిక వ్యాఖ్యానించింది. మరో పక్క 2014–15 ఆర్థిక సంవత్సరం నుంచి 2018–19 ఆర్థిక సంవత్సరం వరకు చంద్రబాబు హయాంలో ఏ సంవత్సరం కూడా ఎఫ్‌ఆర్‌బీఎం (ఫిస్‌కల్‌ రెస్పాన్స్‌బిలిటీ అండ్‌ బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌) నిబంధనలను పాటించలేదని ఆర్‌బీఐ నివేదిక స్పష్టం చేసింది. ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ద్రవ్య లోటు మూడు శాతం దాటకూడదని, అయితే బాబు ఐదేళ్ల పాలనలో ఒక ఏడాది ఏకంగా ఆరు శాతం, మిగతా నాలుగేళ్లు నాలుగు శాతంపైనే ఉందని నివేదిక వెల్లడిచింది. వీటన్నింటి వల్ల ఆర్థిక సూచికల ర్యాంకులో రాష్ట్రం దిగజారినట్లు నివేదిక స్పష్టం చేసింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement