ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం | Centre Responds Positively To YSRCP MP Gurumurthy Request | Sakshi
Sakshi News home page

ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి.. కేంద్రం సానుకూలం

Jun 25 2026 2:54 PM | Updated on Jun 25 2026 3:55 PM

Centre Responds Positively To YSRCP MP Gurumurthy Request

ఢిల్లీ: వైఎస్సార్‌సీపీ ఎంపీ మద్దిల గురుమూర్తి విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. తిరుపతిలో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (నైలెట్) శాశ్వత క్యాంపస్ ఏర్పాటు, శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్‌ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ స్థాపనకు సంబంధించిన ప్రతిపాదనలపై కేంద్ర ఎలక్ట్రానిక్స్, సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వకంగా ఎంపీ గురుమూర్తికి సమాధానమిచ్చారు.

ఈ ఏడాది మే నెలలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసి తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు చేయడంతో పాటు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను నెలకొల్పాలని ఎంపీ గురుమూర్తి విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. తిరుపతిలో నైలెట్ శాశ్వత క్యాంపస్ ఏర్పాటు ప్రతిపాదన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో చర్చల దశలో ఉందని కేంద్ర మంత్రి తెలిపారు. భూమి కేటాయింపు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను సమర్పించాలని నైలెట్‌కు సూచించినట్లు లేఖలో పేర్కొన్నారు. డీపీఆర్ అందిన వెంటనే కేంద్ర మంత్రిత్వ శాఖ తగిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

అదే విధంగా శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో సైబర్ స్పేస్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు ప్రతిపాదన కూడా కేంద్ర ప్రభుత్వానికి అందిందని, ప్రస్తుతం దానిని పరిశీలిస్తున్నట్లు మంత్రి తెలిపారు. తిరుపతిని సమాచార సాంకేతిక, సైబర్ భద్రతా విద్య, నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ముందంజలో నిలపాలనే లక్ష్యంతో ఈ రెండు ప్రతిపాదనలు చేసినట్లు ఎంపీ గురుమూర్తి పేర్కొన్నారు. తిరుపతిలో నైలెట్ ఏర్పాటు కోసం ఎనలేని కృషి చేసిన ఎంపీ, ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చితే తిరుపతి యువతకు ఉన్నత స్థాయి సాంకేతిక విద్య, శిక్షణ అవకాశాలు అందుబాటులోకి రావడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement