‘కృష్ణా’లో నీటి లభ్యత 2,048 టీఎంసీలే 

Central Water Corporation On Water availability In Krishna River - Sakshi

జలవనరులపై సీడబ్ల్యూసీ విడుదల చేసిన వార్షిక నివేదికలో వెల్లడి 

75 శాతం లభ్యత ఆధారంగా ‘కృష్ణా’లో 2,060 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చిన బచావత్‌ ట్రిబ్యునల్‌ 

సీడబ్ల్యూసీ తాజా లెక్కల ప్రకారం బచావత్‌ ట్రిబ్యునల్‌ తేల్చిన లభ్యత కంటే 12 టీఎంసీలు తక్కువ 

వరద రోజులు తగ్గడం.. గరిష్టంగా వచ్చిన వరదను ఒడిసి పట్టి మళ్లించే సదుపాయాలు లేకపోవడమే కారణం 

ఫలితంగా కడలిపాలవుతున్న కృష్ణా వరద జలాలు

సాక్షి, అమరావతి: కృష్ణా నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 3,144.41 టీఎంసీలు ఉంటుందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అంచనా వేసింది. ఇందులో వాడుకోదగినవి 2,048.25 టీఎంసీలు మాత్రమేనని తేల్చింది. ‘కృష్ణా’లో 75 శాతం లభ్యత ఆధారంగా 2,060 టీఎంసీలు (పునరుత్పత్తి జలాలు 70 టీఎంసీలతో కలిపి 2,130 టీఎంసీలు)గా 1976లో బచావత్‌ ట్రిబ్యునల్‌ తేల్చింది. బచావత్‌ ట్రిబ్యునల్‌ లెక్కగట్టిన దానికంటే ప్రస్తుతం ‘కృష్ణా’లో వాడుకోదగినవిగా సీడబ్ల్యూసీ తేల్చిన జలాలు 12 టీఎంసీలు తక్కువగా ఉండటం గమనార్హం.

కృష్ణా నదిలో వరద రోజులు తగ్గడం.. వరద వచ్చినప్పుడు ఒకేసారి గరిష్టంగా రావడం.. ఆ స్థాయిలో వరదను ఒడిసిపట్టి మళ్లించే సదుపాయాలు లేకపోవడంవల్ల కడలిలో కలిసే జలాల పరిమాణం అధికంగా ఉందని.. అందువల్లే ‘కృష్ణా’లో వాడుకోదగిన జలాల పరిమాణం తగ్గుతోందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. దేశంలోని నదులలో నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ వార్షిక నివేదికను ఇటీవల విడుదల చేసింది. అందులో ముఖ్యాంశాలు ఏమిటంటే.. 

వాడుకోడానికి అవకాశం ఉన్నది 34.51 శాతమే 
► దేశంలోని నీటి లభ్యతలో గంగా నది మొదటి స్థానంలో నిలిస్తే. గోదావరి రెండో స్థానంలో ఉంది. ‘కృష్ణా’ మూడో స్థానంలోనూ.. మహానది, నర్మద నాలుగు, ఐదో స్థానాల్లో నిలిచాయి. పెన్నా నది 15వ స్థానంలో నిలిచింది.  

► హిమాలయ నదులు, ద్వీపకల్ప నదుల్లో ఏడాదికి సగటున 70,601.08 టీఎంసీల లభ్యత సామర్థ్యం ఉంది. ఇందులో వినియోగించుకోవడానికి అవకాశమున్నది 24,367.12 టీఎంసీలే(34.51 శాతం). వరదలను ఒడిసిపట్టి, మళ్లించే సామర్థ్యం లేకపోవడంవల్ల 65.49 శాతం (46,233.96 టీఎంసీలు) జలాలు కడలిలో కలుస్తున్నాయి. 

► గంగా నది పరివాహక ప్రాంతం (బేసిన్‌) 8,38,803 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. గంగాలో నీటి లభ్యత సామర్థ్యం ఏటా 17,993.53 టీఎంసీలు ఉంటుంది. ఇందులో ప్రస్తుతానికి  వినియోగించుకోవడానికి అవకాశమున్నది 8,828.66 టీఎంసీలు. 

► అలాగే, గోదావరి బేసిన్‌ 3,12,150 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. ఇందులో నీటి లభ్యత సామర్థ్యం ఏడాదికి సగటున 4,157.94 టీఎంసీలు. ప్రస్తుతానికి వినియోగించుకోవడానికి అవకాశమున్నది 2,694.5 టీఎంసీలే. 

పెన్నాలో జలరాశులు అపారం 
ఇక పెన్నా నది వర్షఛాయ (రెయిన్‌ షాడో) ప్రాంతమైన కర్ణాటకలోని నందిదుర్గం కొండల్లో పురుడుపోసుకుని.. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్‌ జిల్లాల మీదుగా ప్రవహించి 597 కి.మీల దూరం ప్రవహించి నెల్లూరు జిల్లా ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

పెన్నా బేసిన్‌ 54,905 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించింది. దేశంలో అతిపెద్ద నదుల్లో పెన్నాది 15వ స్థానం. ఈ నదిలో ఏటా సగటున నీటి లభ్యత సామర్థ్యం 389.16 టీఎంసీలని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. ఇందులో వాడుకోదగిన జలాలు 243.67 టీఎంసీలని తేల్చింది. గత నాలుగేళ్లుగా పెన్నా బేసిన్‌లో విస్తృతంగా వర్షాలు కురుస్తుండటం వల్ల నీటి లభ్యత పెరిగిందని నీటిపారుదల రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top