ప్రైవేట్‌ చేతుల్లోకి ఎయిర్‌పోర్ట్‌లు | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ చేతుల్లోకి ఎయిర్‌పోర్ట్‌లు

Published Sat, Dec 18 2021 6:07 AM

Central Govt Plan 3 Airports Privatisation In Andhra Pradesh - Sakshi

సాక్షి, అమరావతి : భారీ నష్టాల కారణంగా రాష్ట్రంలోని ప్రధాన మూడు విమానాశ్రయాలను ప్రైవేటు సంస్థలకు లీజుకివ్వడానికి కేంద్రం ప్రణాళిక సిద్ధం చేసింది. ఎయిర్‌పోర్టు అథారిటీ ఆఫ్‌ ఇండియా దేశ వ్యాప్తంగా 136 ఎయిర్‌పోర్టులను కలిగి ఉంటే, అందులో ఆరు ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నాయి. ఇందులో ఒక్క దొనకొండ తప్ప మిగతా రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, కడప నుంచి ప్రతి రోజు సర్వీసులు నడుస్తున్నాయి. ఈ విమానాశ్రయాల నష్టం ప్రతి ఏటా భారీగా పెరుగుతుండటంతో వీటిని నేషనల్‌ మానిటైజేషన్‌ పైప్‌లైన్‌ (ఎన్‌ఎంపీ) కింద దశల వారీగా పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్ట్‌నర్‌ షిప్‌ (పీపీపీ) విధానంలో ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టనున్నట్లు ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. 2022 నుంచి 2025 లోగా మొత్తం 25 ఎయిర్‌పోర్టులను పీపీపీ విధానంలో అభివృద్ధి చేయడానికి టెండర్లు పిలవనుంది. మొత్తం 50 ఏళ్లు నిర్వహించుకునే విధంగా టెండర్లు పిలవనున్నారు. తొలి దశలో చేపట్టిన 25 విమానాశ్రయాల్లో రాష్ట్రానికి చెందిన రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలు ఉన్నాయి. ఇందులో విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలకు అంతర్జాతీయ విమానాశ్రయ హోదా ఉండటంతో ఈ రెండింటికి మంచి డిమాండ్‌ ఏర్పడుతుందని అంచనా. విశాఖపట్నం విమానాశ్రయాన్ని కొత్తగా భోగాపురంలో నిర్మించడానికి ఇప్పటికే జీఎంఆర్‌కు రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. దీంతో రాష్ట్రంలో ఏఏఐ ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయం కడప ఒక్కటే మిగిలి వుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే విమానాశ్రయంగా కర్నూలు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం మిగలనుంది. 

రాష్ట్ర వాటాపై స్పష్టత లేదు 
ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా.. రాజమండ్రి, విజయవాడ, తిరుపతి విమానాశ్రయాలను పీపీపీ విధానంలో ప్రైవేటు సంస్థలకు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. కానీ ఇంకా విధివిధానాలు పంపలేదు. ఈ మూడు విమానాశ్రయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం భూమి సేకరించి ఇచ్చింది. అందువల్ల రాష్ట్ర వాటాపై స్పష్టత రావాలి. విధివిధానాలు వస్తేనే ఆ విషయం తేలుతుంది.  – వీఎన్‌ భరత్‌ రెడ్డి, రాష్ట్ర విమానయాన సలహాదారు

రూ.191 కోట్లకు చేరిన నష్టాలు 
రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో ఒక్క విశాఖ విమానాశ్రయం తప్ప మిగిలిన విమానాశ్రయాలు ఒక్కసారి కూడా లాభాలు నమోదు చేయలేదని ఏఏఐ తాజాగా విడుదల చేసిన గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 2018–19లో మొత్తం ఆరు విమానాశ్రయాల నష్టం రూ.130.24 కోట్లు ఉండగా, అది 2020–21 నాటికి రూ.191.5 కోట్లకు చేరింది. 2019–20లో విశాఖ విమానాశ్రయం రూ.2.29 కోట్ల లాభాలను నమోదు చేయగా, కోవిడ్‌ దెబ్బతో 2020–21 నాటికి రూ.29.37 కోట్ల నష్టాలను ప్రకటించింది. దొనకొండ ఎయిర్‌స్ట్రిప్ట్‌ నిర్వహణలో లేకపోయినప్పటికీ సెక్యూరిటీ సిబ్బంది కోసం ఏటా కొన్ని లక్షలు వ్యయం చేయాల్సి వస్తోంది.  

Advertisement
Advertisement