ఏపీకి 512.04.. తెలంగాణకు 298.96 టీఎంసీలు

Center directed the Krishna Board to distribute water to both Telugu states - Sakshi

కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి వచ్చేవరకు ఇదే ప్రకారం కృష్ణా జలాల పంపిణీ

కేంద్ర జల్‌ శక్తి శాఖ స్పష్టీకరణ

సాక్షి, అమరావతి: కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్‌(కేడబ్ల్యూడీటీ)–2 తీర్పు అమల్లోకి(నోటిఫై) వచ్చేవరకూ ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీల చొప్పున కేటాయించి, పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. ఈ మేరకు కృష్ణా బోర్డుకు కేంద్ర జల్‌ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్‌ సమాచారమిచ్చారు. సర్వ సభ్య సమావేశంలో కేంద్రం ప్రతిపాదనను ప్రవేశపెట్టి.. ఇరు రాష్ట్రాల నుంచి లాంఛనంగా ఆమోదం తీసుకోవాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. బచావత్‌ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–1 కృష్ణా నదీజలాల్లో 75 % లభ్యత ఆధారంగా 811 టీఎంసీలను ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది. బ్రిజేష్‌కుమార్‌ నేతృత్వంలోని కేడబ్ల్యూడీటీ–2 తీర్పును సవాలు చేస్తూ ఏపీ, తెలంగాణలు సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషిన్‌ దాఖలు చేశాయి. దీనిపై విచారణ జరుగుతోంది.

ఈ క్రమంలోనే ఉమ్మడి రాష్ట్రానికి కేడబ్ల్యూడీటీ–2 కేటాయించిన జలాలను విభజన నేపథ్యంలో ఏపీ, తెలంగాణకు పునఃపంపిణీ చేయాలని ఆ ట్రిబ్యునల్‌ను కేంద్రం ఆదేశించడంతో కేడబ్ల్యూడీటీ–2 గడువును పొడిగించింది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను పునఃపంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 ఇరు రాష్ట్రాల వాదనలను వింటోంది. ఈ నేపథ్యంలో బచావత్‌ ట్రిబ్యునల్‌ ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన 811 టీఎంసీల్లో.. ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల ఆధారంగా.. ఏపీకి 512.04, తెలంగాణకు 298.96 టీఎంసీలు కేటాయిస్తూ 2015, జూన్‌ 19న కేంద్ర జల్‌శక్తి శాఖ తాత్కాలిక సర్దుబాటు చేసింది.

ఆ మేరకు 2015–16 నుంచి ఇప్పటివరకూ కృష్ణా బోర్డు నీటిని పంపిణీ చేయడానికి ఏటా ప్రతిపాదనలు చేయడం.. వాటిని ఏపీ, తెలంగాణలు ఆమోదించడం.. ఆ మేరకు నీటిని పంపిణీ చేయడం జరుగుతూ వస్తోంది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పు అమల్లోకి రానందున ఏపీ, తెలంగాణకు కృష్ణా జలాల పంపిణీపై కేంద్రం మరోసారి కృష్ణా బోర్డుకు స్పష్టతనిచ్చింది. ఆ తీర్పు అమల్లోకి వచ్చేవరకూ జూన్‌ 19, 2015న ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటు మేరకు 2 రాష్ట్రాలకు నీటిని కేటాయించి, పంపిణీ చేయాలని స్పష్టం చేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top