కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువుపై ప్రత్యేక దృష్టి

Budithi Rajasekhar Comprehensive educational Policy - Sakshi

పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బి.రాజశేఖర్‌

ప్లస్‌ టూ వరకు సమగ్ర విద్యా విధానం అమలు

సాక్షి, అమరావతి: పూర్వ ప్రాథమిక విద్య నుంచి ప్లస్‌ టూ (ఇంటర్మీడియెట్‌) విద్య వరకు సమగ్ర విద్యా విధానం అమలు కావలసిన అవసరముందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్‌ తెలిపారు. ఫౌండేషనల్‌ లిటరసీ అండ్‌ న్యూమరసీ (ఎఫ్‌ఎల్‌ఎన్‌) అమలులో భాగంగా ఒకే ప్రాంగణం లేదా 250 మీటర్లలోపు ప్రాథమిక పాఠశాలల్లో గల  3, 4, 5 తరగతుల విద్యార్థులను సమీప ఉన్నత పాఠశాలలకు అనుసంధానించాలన్నారు. తద్వారా 3 నుంచి 10వ తరగతి విద్యార్థులకు విషయ నిపుణుల చేత బోధన నిర్వహించాలని సూచించారు.

గురువారం ఇబ్రహీంపట్నంలోని పాఠశాల విద్యాశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా మాట్లాడారు. ప్రస్తుతం గణాంక ఆధార వ్యవస్థ అవసరమైన దృష్ట్యా ప్రతి ఒక్కరూ గణాంకాల మీద లోతైన అవగాహన పెంచుకోవాలని డీఈవోలకు, ఏపీసీలకు సూచించారు. యూడైస్‌ ప్లస్‌ (ఏకీకృత జిల్లా సమాచార వ్యవస్థ)లో వివరాలు నమోదు చేయడంలో అలసత్వం చూపొద్దని విద్యాధికారులకు రాజశేఖర్‌ స్పష్టం చేశారు. దాని ప్రభావం జాతీయ స్థాయిలో రాష్ట్ర ప్రగతి సూచీలపై పడుతుందని తెలిపారు. యూడైస్‌ ప్లస్‌లో ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు కూడా ఉండేలా చూసుకోవాలన్నారు.

కోవిడ్‌తో తల్లిదండ్రులు చనిపోయిన పిల్లల చదువులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇలాంటి పిల్లలు ప్రైవేటు విద్యా సంస్థల్లో ఉంటే ఉచిత విద్యతోపాటు ఇతర బాధ్యతలపై ఆయా సంస్థల నుంచి ధ్రువపత్రం తీసుకోవాలని చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ ఎస్‌.సురేష్‌ కుమార్, సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు ఎ.మురళి, జగనన్న గోరుముద్ద  పథకం డైరెక్టర్‌ దివాన్‌ మైదీన్, ఆర్‌ఎంఎస్‌ఏ డైరెక్టర్‌ పి.పార్వతి, పౌర గ్రంథాలయాల సంచాలకులు డా.ప్రసన్నకుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ దేవానందరెడ్డి, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్‌ డా.ప్రతాప్‌ రెడ్డి, పాఠశాల విద్య జాయింట్‌ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, జిల్లా విద్యాశాఖాధికారులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top