పదో తరగతి విద్యార్థులకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం

Botsa Satyanarayana says Free RTC Bus travel for tenth students - Sakshi

ఏపీఎస్‌ ఆర్టీసీ ఉత్తర్వులు

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయాన్ని కల్పిస్తూ ఏపీఎస్‌ ఆర్టీసీ ఆదేశాలిచ్చింది. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు వారి గ్రామం నుంచి పరీక్ష కేంద్రం వరకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణానికి అవకాశం కల్పించాలని రాష్ట్రంలోని ఆయా జోన్ల ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లకు, జిల్లాల పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్లకు ఏపీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌(ఆపరేషన్స్‌) ఆదేశాలిచ్చారు. పరీక్ష అయిపోయాక ఇంటికి చేరుకునేందుకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించాలని అందులో సూచించారు. హాల్‌ టికెట్‌ ఆధారంగా బస్సుల్లో ఉచితంగా పరీక్ష కేంద్రాల వరకు రాకపోకలు సాగించొచ్చు. ఈ అవకాశం పదో తరగతి పరీక్షలు జరిగే ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు అమల్లో ఉంటుంది. రాష్ట్రంలో 3,780 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించే ఈ పరీక్షలకు 6,22,746 మంది విద్యార్థులు హాజరుకానున్నారు.  

పది పరీక్షలపై మంత్రి బొత్స సమీక్ష
విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక గురువారం తొలిసారి సమగ్ర శిక్ష రాష్ట్ర కార్యాలయాన్ని మంత్రి బొత్స సత్యనారాయణ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యా పథకాలన్నింటినీ సక్రమంగా అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ నెల 27 నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో పరీక్షల నిర్వహణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర చర్యలపై రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఉన్నతాధికారులతో కలసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందుల్లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. తాగునీరు, వైద్య సదుపాయం, ఫర్నిచర్‌ ఏర్పాట్లు తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో పాఠశాల విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, కమిషనర్‌ ఎస్‌.సురేష్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల సంచాలకుడు డి.దేవానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top