‘రియల్‌ ఎస్టేట్‌’ సమస్యల పరిష్కారానికి చర్యలు

Botsa Satyanarayana On Construction sector progress Andhra Pradesh - Sakshi

అవసరమైన చోట్ల నిబంధనల సవరణకు సిద్ధం

క్రెడాయ్‌ ప్రతినిధులకు పురపాలక శాఖ మంత్రి బొత్స హామీ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నిర్మాణ రంగం పురోభివృద్ధికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆంధ్రప్రదేశ్‌ క్రెడాయ్‌ ప్రతినిధులతో ఆయన సమావేశమయ్యారు. రియల్‌ ఎస్టేట్‌ రంగం ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి, వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. విశాఖ ఎంపీ ఎం.వి.వి. సత్యనారాయణ, పురపాలక శాఖ కార్యదర్శి రామమనోహర్, కమిషనర్‌ (సీడీఎంఏ) ఎం.ఎం.నాయక్, డీటీసీపీ రాముడుతో పాటు క్రెడాయ్‌ ప్రతినిధులు రాజా శ్రీనివాస్, బోస్, స్వామి, జీవీఎస్‌సీ రాయుడు తదితరులు పాల్గొన్న ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు.

ప్రస్తుతం అమలులో ఉన్న జీవోలు, అందుకు అనుగుణంగా రూపొందించిన మార్గదర్శకాల్లో మార్పులు చేర్పులు తీసుకురావాలని, కోవిడ్‌ కారణంగా పనులు మందగించినందున నిర్మాణాలు పూర్తి కాలేదన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో జారీ చేసిన అనుమతులు (బిల్డింగ్‌ ప్లాన్‌ పర్మిషన్‌లు) గడువును పొడిగించాలని క్రెడాయ్‌ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. టీడీఆర్‌ల జారీ, వాటి కాలపరిమితి, ఖాళీ ల్యాండ్‌ ట్యాక్సు, ఎల్‌ఆర్‌ఎస్‌ అమలు, ఆన్‌లైన్‌ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందులను వారు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని అనేక సమస్యలను పరిష్కరించడం ద్వారా నిర్మాణ రంగం కొత్త పుంతలు తొక్కేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నదని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా క్రెడాయ్, ఇతర సంఘాల ప్రతినిధులతో పాటు రియల్‌ ఎస్టేట్‌ రంగంలోని స్టేక్‌ హోల్డర్లందరితో సమగ్రంగా చర్చించి, అందరికీ ఆమోదయోగ్యమైన విధానాలు రూపొందిస్తూ ఉత్తర్వులు విడుదల చేసిన సంగతిని గుర్తు చేశారు. అయితే, ఆ ఉత్తర్వుల అమలులో కొన్ని ఇబ్బందులు ఉన్నాయంటూ ఇటీవల క్రెడాయ్‌ ప్రతినిధులు తన దృష్టికి తీసుకుని వచ్చినందున ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామన్నారు. సమావేశంలో చర్చించిన అంశాలన్నింటినీ అధ్యయనం చేసిన తరువాత త్వరలోనే అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో తగిన ఉత్తర్వులను జారీ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి బొత్స హామీ ఇచ్చారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top