AP: ఇక రోడ్ల పనులు చకచకా 

BOB Has Acceptance Of Rs 2,000 Crore For Road Repairs In AP - Sakshi

రూ.2 వేల కోట్ల మంజూరుకు బీవోబీ అంగీకారం 

సాక్షి, అమరావతి:  రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయడానికి మార్గం సుగమమైంది. బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ) నుంచి రూ.2 వేల కోట్ల రుణ సేకరణకు రాష్ట్ర రోడ్ల అభివృద్ధి సంస్థ (ఆర్‌డీసీ)తో ఒప్పందం కుదుర్చుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌ గ్యారంటీ ఇవ్వగా.. ఈ మేరకు ఆర్‌డీసీ, బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా ప్రతినిధులు రుణ ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశారు. ఈ నిధులతో ఆర్‌డీసీ రాష్ట్రంలో రోడ్ల పునరుద్ధరణ పనులను వేగవంతం చేయనుంది. ఇప్పటికే రాష్ట్రంలో 8,268 కి.మీ. మేర 1,147 రోడ్ల పునరుద్ధరణ కోసం ఆర్‌డీసీ టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టింది.

మొదటి దశలో రూ.604 కోట్లతో 328 పనుల కోసం టెండర్లు ఖరారు చేసింది. రెండో దశలో రూ.1,601 కోట్లతో 819 రోడ్ల పనుల కోసం టెండర్లు ఇటీవల పిలిచింది. తాజాగా రోడ్ల పునరుద్ధరణ కోసం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాతో రూ.2వేల కోట్లకు రుణ ఒప్పందం కూడా కుదరడంతో కాంట్రాక్టర్లలో కొత్త జోష్‌ వచ్చింది. ఎందుకంటే ఆర్‌డీసీ ఆ రుణ మొత్తాన్ని ప్రత్యేక ఖాతాలో జమ చేయనుంది. రోడ్ల పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ఆ ఖాతా నుంచి నేరుగా బిల్లు చెల్లింపులు జరుగుతాయి. దీనివల్ల మొదటి దశ టెండర్ల పనులు వేగవంతం కానుండటంతోపాటు.. రెండో దశ టెండర్లలో పాల్గొనేందుకు ఎక్కువ మంది కాంట్రాక్టర్లు సంసిద్ధమవుతున్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నిర్దేశించిన మేరకు డిసెంబర్‌ మొదటి వారంలో పనులు చేపట్టి 2022 మే నాటికి పూర్తి చేసేలా ఆర్‌ అండ్‌ బీ సమాయత్తమవుతోంది.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top