ఫలించిన అంధుడి పదేళ్ల పోరాటం..

Blind Man had Opportunity to Continue his Diet Education in Kurnool - Sakshi

హెచ్‌ఆర్‌సీ చొరవతో డైట్‌ సీటు పునరుద్ధరణ 

సాక్షి, కర్నూలు(సెంట్రల్‌): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్‌(హెచ్‌ఆర్‌సీ) చొరవతో మధ్యలో నిలిచిపోయిన డైట్‌ విద్యను కొనసాగించేందుకు ఓ అంధుడికి అవకాశం లభించింది. సీటును పునరుద్ధరిస్తూ విద్యాశాఖ శుక్రవారం నివేదికను సమర్పించడంతో పదేళ్ల పోరాట నిరీక్షణకు తెరపడింది. కడపలోని అల్మాస్‌ పేటకు చెందిన బి.రామాంజనేయులు కుమారుడు బి.కిరణ్‌కుమార్‌ అంధుడు. 2012లో డైట్‌ ప్రవేశ పరీక్ష రాసి ఉత్తమ ర్యాంకు సాధించడంతో నెల్లూరు ప్రభుత్వ డైట్‌ కళాశాలలో సీటు వచ్చింది. తెలుగు మీడియంలో సోషల్‌ స్టడీస్‌ మెథడాలజీ డీఈడీ కోర్సులో చేరాడు.

కొద్దిరోజులకే నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ప్రమాదానికి గురై కాళ్లు, చేతులు విరిగిపోవడంతో ఐదారు నెలలు ఇంటికే పరిమితం కావాల్సి వచ్చింది. కాస్త కోలుకున్న తరువాత కాలేజీకి వెళ్లగా తమకు ఎలాంటి సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో సీటు నిలిపివేసినట్లు ప్రిన్సిపాల్, ఇతర అధికారులు చెప్పారు. ఒకపక్క ఆరోగ్యం బాగోలేకపోవడం, మరో పక్క సీటు రద్దు కావడంతో ఆందోళన చెందాడు. పూర్తిగా కోలుకున్నాక ఎలాగైనా డీఈడీ పూర్తి చేయాలని తలచి న్యాయం కోసం 2019లో ఉమ్మడి హెచ్‌ఆర్‌సీని ఆశ్రయించాడు. ఆ సమయంలో ఏపీ కేసులను విచారణకు తీసుకోకపోవడంతో నిరాశతో వెనుదిరిగాడు. ఈఏడాది ఫిబ్రవరిలో హెచ్‌ఆర్‌సీ కర్నూలు తరలివచ్చిన తరువాత మరోసారి ఫిర్యాదు చేశాడు. అయితే పోస్టులో పంపడంతో విచారణకు రాలేదు.

చదవండి: (సంచలనం రేపిన ఎస్సై గోపాలకృష్ణ ఆత్మహత్య.. అదే ‍కారణమా..?)

చివరగా అదే ఏడాది ఏప్రిల్‌ 8న  నేరుగా కమిషన్‌ను ఆశ్రయించడంతో ప్రత్యేక కేసుగా పరిగణించి చైర్మన్‌ మంధాత సీతారామమూర్తి నేతృత్వంలోని బెంచ్‌ కిరణ్‌కుమార్‌ చదువుకోవడానికి ఉన్న అవకాశాలపై నివేదిక సమర్పించాలని నెల్లూరు డైట్‌ కళాశాల ప్రిన్సిపాల్, కరస్పాండెంట్, కలెక్టర్, కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్, విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, చీఫ్‌ సెక్రటరీలకు నోటీçులు జారీ చేసింది. అందుకు విద్యాశాఖ అధికారులు స్పందించి మొదటి ఏడాది డీఈడీ కాలేజీలో కొనసాగిస్తామని శుక్రవారం కమిషన్‌ చైర్మన్‌కు నివేదిక సమర్పించారు. దీంతో కిరణ్‌కుమార్‌ చదువుకోవాలన్న ఆశ, జిజ్ఞాస, పట్టుదలను చైర్మన్‌ అభినందించారు. విద్యాశాఖాధికారులు కూడా బాగా స్పందించి విద్యార్థి చదువుకోవడానికి అవకాశం కల్పించడంతో అభినందనలు తెలిపి కేసును మూసి వేసినట్లు కమిషన్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ బొగ్గారం తారక నరసింహకుమార్‌ తెలిపారు.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top