పెదగంజాంలో బర్డ్‌ ఫ్లూ కలకలం

Bird Flu Tension In Pedaganjam, Prakasam - Sakshi

తీరంలో చనిపోయిన కాకులు, గోరింకలు

కళేబరాలను పూడ్చి పెట్టించిన అధికారులు

సాక్షి, చినగంజాం(ప్రకాశం): బర్డ్‌ ఫ్లూ వ్యాధి ప్రబలుతోందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో సోమవారం చెట్ల కింద పక్షులు చనిపోయి ఉండటం తీవ్ర కలకలం రేపింది. ఒకే చెట్టు కింద ఎనిమిది పక్షుల కళేబరాలు ఉండటంతో జనం ఆందోళనకు గురయ్యారు. చినగంజాం మండలంలోని పెదగంజాం పల్లెపాలెం సముద్ర తీరం వెంబడి వేప చెట్టు కింద 5 కాకులు, 3 గోరింకలు చనిపోయి ఉండటాన్ని సోమవారం స్థానికులు గమనించారు. గ్రామంలోకి సమాచారం చేరవేయడంతో బర్డ్‌ ఫ్లూ వల్లే అలా జరిగి ఉంటుందని అనుమానాలు వ్యక్తం కావడంతో అధికారులు సత్వరం స్పందించారు. పెదగంజాం గ్రామ కార్యదర్శి భారతి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పక్షుల కళేబరాలను అక్కడి నుంచి తొలగించి వెంటనే పూడ్చి వేయించారు. విషయం తెలుసుకున్న పలు మీడియా చానళ్లు బర్డ్‌ ఫ్లూ అంటూ.. ప్రచారం చేశాయి. ఈ విషయమై రెవెన్యూ, పోలీసు అధికారులు, పశు వైద్యాధికారులతో ‘సాక్షి’ మాట్లాడి వివరణ తీసుకుంది. తీరం వెంబడి చెట్ల వద్ద పక్షులు నిత్యం నివాసం ఉంటుంటాయని, ఆ సమీప ప్రాంతాలలో వేరుశనగ సాగవుతున్న నేపథ్యంలో రైతులు పంటకు సత్తువ కోసం గుళికల మందు వాడుతుంటారని, అది కలిసిన నీటిని తాగి పక్షులు చెట్టు మీద సేదతీరిన సందర్భల్లోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకొనే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. 

అపోహలు, ఆందోళన వద్దు: డాక్టర్‌ బసవశంకర్, ప్రాంతీయ పశువైద్య సహాయ సంచాలకులు  
పల్లెపాలెంలో పక్షులు చనిపోయిన విషయం మా దృష్టికి వచ్చింది. మేం వెళ్లేలోగా అధికారులు వాటిని పూడ్చి పెట్టారు. పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో నుంచి సమాచారం సేకరించాం. గుంటూరు, విజయవాడ, ఒంగోలు ప్రాంతాల్లో పక్షుల కళేబరాలు పరీక్షించే ల్యాబ్‌ రేటరీలున్నాయి.  బర్డ్‌ ఫ్లూకు సంబంధించి దేశంలో భోపాల్‌లో నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌లో మాత్రమే నిర్దారణ చేస్తారు. పరీక్షిస్తేనే ఏవిషయం తెలుస్తుంది. భవిష్యత్‌లో ఇలా పక్షులు చనిపోతే సత్వరం తమకు సమాచారం ఇవ్వాలని సూచించాం. బర్డ్‌ ఫ్లూ గురించి ఆందోళన అవసరం లేదు. మన దేశంలో 150 నుంచి 200 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు చికెన్‌ను ఉడికిస్తారు  చికెన్‌ తినడం వల్ల వ్యాధులు ప్రబలే అవకాశం లేదు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top