బీరు లారీ బోల్తా.. బాటిళ్లను ఎత్తుకెళ్లిన ప్రజలు

Beer bottles Lorry Accident At Prakasam District - Sakshi

బోల్తా పడిన లారీని ఢీకొట్టిన మరో ట్యాంకర్‌ లారీ

దీంతో రోడ్డుపై చెల్లాచెదురుగా పడిపోయిన బీరు బాటిళ్లు

అందినకాడికి ఎత్తుకెళ్లిన మద్యం ప్రియులు

ప్రకాశం జిల్లాలో ఘటన

సింగరాయకొండ: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్‌ సమీపంలో బీరు బాటిళ్లతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. దీంతో మద్యం ప్రియులు ఎగబడి బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. పోలీసుల కథనం ప్రకారం.. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం బంటుపల్లి గ్రామంలోని యునైటెడ్‌ బ్రేవరేజెస్‌ లిమిటెడ్‌ ఫ్యాక్టరీ నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లిలోని మద్యం డిపోకు కింగ్‌ఫిషర్, ఎన్‌జి బ్రాండు బీరు బాటిళ్ల లోడుతో లారీ బయలుదేరింది.

ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండల పరిధిలో కలికవాయ ఫ్లైఓవర్‌ సమీపంలోని విమానాల రన్‌వేపైకి రాగానే డ్రైవర్‌ నిద్రమత్తు కారణంగా.. రోడ్డు మధ్యలో ఉన్న సిమెంటు దిమ్మెను బలంగా ఢీ కొట్టి లారీ బోల్తా పడింది. ఆదివారం వేకువజామున 3 గంటల సమయంలో ఘటన జరిగింది. అదే సమయంలో చెన్నై నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న ట్యాంకర్‌ లారీ మద్యం లారీ ట్రక్కు భాగాన్ని బలంగా ఢీ కొట్టడంతో బీరు బాటిళ్లు రోడ్డుపై పడ్డాయి. బీరు బాటిళ్ల విలువ అధికారికంగా రూ.5.50 లక్షలు కాగా మార్కెట్‌ ధర ప్రకారం సుమారు రూ.30 లక్షలు ఉంటుంది.

బీర్‌ బాటిళ్ల లారీ బోల్తా పడిందని తెలుసుకున్న మద్యం ప్రియులు ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని దొరికినవి దొరికినట్లు బీరు బాటిళ్లను ఎత్తుకెళ్లారు. దీంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ సమస్య ఏర్పడింది. సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు, టంగుటూరు హైవే పెట్రోలింగ్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ సమస్య పరిష్కరించారు. తరువాత క్రేన్‌ సహాయంతో లారీని రోడ్డు పక్కకు చేర్చి మిగిలిన బాటిళ్లను ఎత్తుకెళ్లకుండా జాగ్రత్తలు తీసుకుని ఎక్సైజ్, సెబ్‌ అధికారులకు సమాచారం అందించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ ఎల్‌.సంపత్‌కుమార్‌ తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top