బీదా కుట్రలు కన‘పడవ’! | Beda Mastan Rao is the mastermind behind the disappearance of the boats | Sakshi
Sakshi News home page

బీదా కుట్రలు కన‘పడవ’!

Apr 24 2026 4:43 AM | Updated on Apr 24 2026 4:43 AM

Beda Mastan Rao is the mastermind behind the disappearance of the boats

బోట్ల మాయం ఘటనలో సూత్రధారి 

టీడీపీ ఎంపీ బీదాపై చర్యలు తీసుకోకుండా మత్స్యకార కాపులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్లు

ముగ్గురు పాత్రధారులకు రూ.2.25 కోట్ల జరిమానా 

పలు నిర్ణయాలు తీసుకున్న 164 గ్రామాల కాపులు 

బుధవారం అర్ధరాత్రి 2 వరకూ సాగిన సమావేశం

ఉలవపాడు: నెల్లూరు జిల్లా జువ్వలదిన్నె హార్బర్‌లో ఉంచిన తమిళనాడు, పుదుచ్చేరికి చెందిన బోట్ల మాయంపై 164 గ్రామాల మత్స్యకార కాపులు నిర్వహించిన సమావేశంలో అసలు సూత్రధారి అయిన టీడీపీ ఎంపీ బీదా మస్తాన్‌రావుపై ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడానికి రాజకీయ ఒత్తిళ్లే కారణమన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం పెదపట్టపుపాలెంలో బుధవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి 2 గంటల వరకు మత్స్యకార కాపుల సమావేశం జరిగింది. 

ప్రధానంగా బోట్ల మాయంకు సంబంధించి ముగ్గురు వ్యక్తులపై తీర్పుతో పాటు అందుకు కారణమైన వారిపై కూడా చర్యలు తీసుకోవాలని, మత్స్యకారుల  సమస్యల పరిష్కారం కోసం నిర్ణయాలు తీసుకోవాలని ఈ సమావేశం ఏర్పాటు చేశారు. దాదాపు 164 గ్రామాలకు చెందిన 1,500 మందికిపైగా మత్స్యకార కాపులు, మత్స్యకారులు పాల్గొ­న్నారు. హార్బర్‌లో బోట్లు మాయం చేసిన తోటయ్య, జాలిరెడ్డి, కొండూరు పోలిశెట్టిని సమావేశంలో హాజరుపరిచారు. 

వీరు ముగ్గురూ అల్లూరు మండలం ఇసకపాలెం, బోగోలు మండలం కొత్తబంగారుపా­లెం, పాతపాలేనికి చెందిన వారు కావడంతో ఆయా గ్రామాలే వారికి సంబంధించిన జరిమానా బాధ్యత తీసుకోవాలని తీర్మానించారు. బోట్ల విషయంలో ప్రధానంగా జరిపిన చర్చలో తొలుత ముగ్గురూ 2 కోట్ల 40 లక్షల రూపాయల జరిమానా కట్టాలని కాపులు తీర్మానించారు. తప్పు చేసిన వారు కాపుల కాళ్లు పట్టుకోవడంతో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున తగ్గించడంతో 2 కోట్ల 25 లక్షల రూపాయలు చెల్లించాలని తీర్మానించారు. దీనికి వారు కట్టుబడి కొంత నగదూ చెల్లించారు. ఐదు రోజుల్లో మిగిలిన డబ్బులు జమ చేసేలా నిర్ణయించారు. 

టీడీపీ ఎంపీ బీదాపై నిర్ణయం తీసుకోకుండా భారీ ఒత్తిళ్లు 
తప్పు చేసిన వారికి జరిమానా విధించడంతో పాటు వారి వెనుక ఉన్న టీడీపీ ఎంపీ బీదా మస్తాన్‌రావు విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాలని, ఆ మేరకు మత్స్యకార కాపుల సమావేశంలో చర్చించాలని తొలుత నిర్ణయించారు. కానీ, మత్స్యకార గ్రామ కాపులపై భారీగా రాజకీయ ఒత్తిళ్లు వచ్చినట్టు సమాచారం. 164 గ్రామాలకు చెందిన కాపుల్లో రాజకీయ నేపథ్యం ఉన్న కొందరు కాపులు చక్రం తిప్పి ప్రభుత్వానికి వ్యతిరేకంగాగానీ, బీదాకు వ్యతిరేకంగాగానీ ఎలాంటి చర్యలూ లేకుండా చేశారని ప్రచారం జరుగుతోంది. 

అందువల్లే బోట్లు మాయం చేసిన ముగ్గురికి మాత్రమే జరిమానా విధించి సమస్యను ముగించినట్లు తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ టీడీపీ నేతలు చేసిన ద్రోహంపై చర్చ జరగకుండానే మత్స్యకార కాపుల సమావేశం ముగిసింది. అయితే రాజకీయ నేతల వలనే ఈ సమస్యలు వచ్చాయని విలేకరుల సమావేశంలో మత్స్యకార కాపులు వెల్లడించడం గమనార్హం.  జరిమానా చెల్లింపు సమయంలో కూడా.. ఎంత జరిమానా విధించినా కట్టేది బీదా మస్తాన్‌రావే కదా అని కాపులు చర్చించుకోవడం విశేషం. 

సమావేశంలో పలు తీర్మానాలు 
ఈ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. వాటికి ప్రభుత్వం అండగా నిలవాలని కోరారు. ప్రధానంగా తమిళనాడు, పుదుచ్చేరి హైస్పీడ్‌ బోట్లను ఆంధ్రప్రదేశ్‌ సముద్ర జలాల్లోకి రానివ్వరాదని డిమాండ్‌ చేశారు. ఏపీఎంఎఫ్‌ఆర్‌ యాక్ట్‌ను ఆధునికీకరించాలని, పట్టపు కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని, మెరైన్‌ పోలీసు, సమీప పోర్టులలో మత్స్యకార యువతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు.  తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల జిల్లాల కాపుల కూటమి తరఫున ఈ నిర్ణయాలు తీసుకున్నారు.  

Advertisement
 
Advertisement
Advertisement