రాష్ట్రవ్యాప్తంగా బీసీల సదస్సులు

BC conferences across Andhra Pradesh - Sakshi

రాష్ట్ర బీసీ మంత్రుల సమావేశంలో నిర్ణయం

ఏప్రిల్‌ 15 తర్వాత నెలపాటు పర్యటనలు 

రాష్ట్ర మంత్రి వేణుగోపాలకృష్ణ వెల్లడి  

సాక్షి,అమరావతి: సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల అభ్యున్నతికి చేపట్టిన చర్యలతో వారిలో ఆత్మగౌరవం పెరిగిందని, ఈ విషయాన్ని ప్రజలకు వివరించేందుకు రాష్ట్రవ్యాప్తంగా సదస్సులు నిర్వహిస్తామని రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఏప్రిల్‌ 15 తర్వాత తాను, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి నెల పాటు రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తామన్నారు. బీసీల సమస్యలను పరిష్కరించి, వారి ఆత్మగౌరవాన్ని మరింతగా పెంచేందుకు ఈ పర్యటన ఉపయోగపడుతుందని తెలిపారు. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం బీసీలకు చేస్తున్న మేలు ప్రతి ఇంటికీ తెలిసేలా చేస్తామని చెప్పారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో గురువారం బీసీ మంత్రుల సమావేశం నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, ధర్మాన కృష్ణదాస్, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, సీదిరి అప్పలరాజు, శంకరనారాయణ, వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, పార్టీ కేంద్ర కార్యాలయం పర్యవేక్షకులు, ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి పాల్గొన్నారు. అనంతరం క్యాంపు కార్యాలయం మీడియా పాయింట్‌ వద్ద మంత్రి వేణుగోపాలకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను వెల్లడించారు.

ముందుగా కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామని చెప్పారు. రెండు, మూడు జిల్లాలకు ఒక సదస్సు నిర్వహించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. అనంతరం రాష్ట్రస్థాయిలో సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చేసిన మంచిని ప్రజలకు తెలియజేయడం, లోపాలను సవరించడమే సదస్సుల ముఖ్య ఉద్దేశమని తెలిపారు. రాష్ట్రంలో 139 బీసీ కులాలకు రాష్ట్ర ప్రభుత్వం 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిందని చెప్పారు. బీసీ సబ్‌ ప్లాన్‌ కోసం రూ. 31 వేల కోట్లు కేటాయించిందన్నారు.

విద్యుత్‌ చార్జీల భారం వేసింది టీడీపీనే
విద్యుత్‌ చార్జీలు భారీగా పెంచి ప్రజలపై భారం వేసింది టీడీపీనే అని మంత్రి ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్‌ పథకాలను చంద్రబాబు రద్దు చేయలేదా అని ప్రశ్నించారు. ఏదో విధంగా ప్రజలను మభ్య పెట్టడమే టీడీపీ లక్ష్యమని అన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top