బహుజనుల పోరాటానికి 951 రోజులు | Bahujana Prakshan Samithi Protest Reach To 951th Day | Sakshi
Sakshi News home page

బహుజనుల పోరాటానికి 951 రోజులు

Published Sun, May 7 2023 9:27 AM | Last Updated on Sun, May 7 2023 10:34 AM

 Bahujana Prakshan Samithi Protest Reach To 951th Day - Sakshi

తాడికొండ: అమరావతిలో అందరికీ సమాన హక్కులు.. అన్ని కులాల వారికీ సమాంతర జీవన హక్కులు కల్పించాలని కోరుతూ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన పోరాటం శనివారం 951వ రోజుకు చేరింది. బహుజనుల హక్కులను హరిస్తూ.. కులవాదంతో చంద్రబాబు అండ్‌ కో చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా 2020 మార్చి 9న రిలే దీక్షలు చేపట్టిన ఉద్యమం ఇప్పటికీ అవిశ్రాంతంగా కొనసాగుతోంది. తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం నుంచి అసెంబ్లీకి వెళ్లే సీడ్‌ యాక్సిస్‌ రోడ్డు జంక్షన్‌లో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని కొనసాగిస్తున్నారు.

మూడు రాజధానులు వద్దంటూ న్యాయస్థానం నుంచి స్టే ఉత్తర్వులు తెచ్చిన కులవాదుల ఆట కట్టించేందుకు బహుజన పరిరక్షణ పేరుతో 266 దళిత సంఘాలు, ప్రజాసంఘాలు పోరాటానికి దిగాయి. ఇందులో 70 సంఘాలు ప్రత్యక్షంగా పాల్గొని ఉద్యమం నిర్వహిస్తుండగా.. 194 సంఘాలు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలు, పక్క రాష్ట్రాల నుంచి మద్దతు తెలిపాయి. ఒకే అంశంపై సుదీర్ఘంగా పోరాటం చేసిన ఏకైక ఉద్యమం బహుజన పరిరక్షణ సమితి ఉద్యమంగా ఈ ఉద్యమం చరిత్రకెక్కింది.  

బహిరంగ నిరసనతో కడకంటూ పోరాటం.. 
అమరావతిలో 54 వేల పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలతోపాటు ఇళ్లు కట్టి ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించగా.. కులవాదులు కోర్టుకు వెళ్లి స్టే ఉత్తర్వులు తెచ్చారు. సీఆర్డీయే చట్టంలో పొందుపరచిన ప్రకారం 5 శాతం భూమిని పేదలకు కేటాయించి.. శాటిలైట్‌ సిటీ కట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుండగా.. పేదలు ఈ ప్రాంతంలో ఉంటే సామాజిక అసమతుల్యత ఏర్పడుతుందంటూ కులవాదంతో అడ్డుకునేందుకు రకరకాల ప్రయత్నాలు చేశారు.

పేదలకు ఇంగ్లిష్‌ మీడియం విద్య అందకుండా చేసేందుకు కుట్ర పన్నిన కులవాదులు కార్పొరేట్‌ స్కూళ్లతో కుమ్మక్కై తప్పుడు కేసులు వేయించారు. పూలింగ్‌ పేరిట ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నా.. రైతుల ముసుగులో కులవాదులు, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సేవ్‌ అమరావతి పేరిట దొంగ ఉద్యమం చేపట్టారు. ఇలాంటి ఆగడాలపై బహుజన పరిరక్షణ ఉద్యమం కన్నెర్ర చేసింది. వారి ఆగడాలను ఎండగడుతూ బహుజనుల కలలు సాకరమయ్యే వరకు కడకంటూ పోరాటం కొనసాగిస్తోంది.

అడ్డంకులు ఎదురైనా.. 
2020 నవంబర్‌లో ఉద్దండరాయుని పాలెంలో ఎంపీ నందిగం సురేష్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు బహుజన పరిరక్షణ సమితి నాయకులు వెళితే అమరావతి శిబిరంలో ఉన్న కులవాదులు రాళ్లతో దాడి చేశారు. బహుజనులపై కవ్వింపు చర్యలకు పాల్పడి దుర్భాషలాడుతూ దాడులకు తెగబడ్డారు. దీనిపై కూడా పోలీసు కేసులు నమోదయ్యాయి. కాగా, 2021 ఫిబ్ర­వరి 21న కులవాదులంతా కలిసి ఆటోలలో ఉద్యమానికి వస్తున్న మహిళలపై దాడులకు తెగబడ్డారు. రైతుల ముసుగులో ఉన్న విచక్షణ రహితంగా దాడులు చేయడంతో మహిళలు సైతం దెబ్బలు తిని ఇబ్బందులకు గురయ్యా­రు. వీటన్నింటిని తట్టుకుని నిలబడి ఉద్యమం చేస్తున్న వారిపై బెదిరింపులకు పాల్పడినా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్నారు.  

‘ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటే బాబుకు మంచిది’ 
శనివారం నాటి 951వ రోజు దీక్షలో బహుజన పరిరక్షణ సమితి నాయకులు మాట్లాడుతూ..  హైకోర్టు తీర్పుతో అయినా చంద్రబాబు తన తప్పుడు విధానాలను మార్చుకోవాలని.. కోర్టు తీర్పును స్వాగతించి పేదలకు ఈ ప్రాంతంలో అడ్డంకులు లేకుండా చూడాలని కోరారు. అలా కాదని వ్యవస్థలను ప్రలోభాలకు గురిచేసి బహుజనుల్ని ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదన్నారు. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని హైకోర్టు తీర్పు ఇస్తే వామపక్షాలు, ఇతర పార్టీలు స్వాగతించకపోవడం దుర్మార్గమని పేర్కొన్నారు. కార్యక్రమంలో సోషల్‌ డెమొక్రటిక్‌ ఫ్రంట్‌ రాష్ట్ర అధ్యక్షుడు మాదిగాని గురునాథం, న్యాయవాది పెరికే వరప్రసాద్, వివిధ సంఘాల నాయకులు నూతక్కి జోషి, బేతపూడి సాంబయ్య, ఈపూరి ఆదాం, పులి దాసు, బొలిమేర శ్యామ్యూల్, పల్లె బాబు, కారుమూరి పుష్పరాజ్‌ తదితరులు ఉన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement