ఇక డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఆటోమేషన్

Automation of longer driving tracks - Sakshi

శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్‌ సామర్థ్య పరీక్షలు  

ఇందుకోసం 9 చోట్ల రూ.13.4 కోట్లతో ట్రాక్‌ల ఆటోమేషన్‌ 

టెండర్లు ఖరారు  

సాక్షి, అమరావతి: వీడియో ఆధారిత సెన్సర్‌ల వినియోగం ద్వారా శాస్త్రీయ పద్ధతిలో డ్రైవింగ్‌ సామర్థ్య పరీక్షల నిర్వహణకు రవాణా శాఖ సన్నద్ధమవుతోంది. రూ.13.4 కోట్లతో రాష్ట్రంలో తొమ్మిది చోట్ల డ్రైవింగ్‌ ట్రాక్‌ల ఆటోమేషన్‌ నిర్మాణాలను చేపట్టనుంది. ఇందుకు కేంద్రం ఏపీకి రూ.9 కోట్లు కేటాయించగా, మిగిలిన రూ.4.4 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోంది. రాష్ట్రంలోని రవాణా కార్యాలయాల్లో సివిల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఉన్న చోట్ల ఈ ఆటోమేషన్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌లు నిర్మిస్తారు. వైజాగ్, చిత్తూరు, అనంతపురం, విజయవాడ, తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, వైఎస్సార్‌ జిల్లా ప్రొద్దుటూరులలో ఈ ట్రాక్‌లకు టెండర్లు ఖరారయ్యాయి. మార్చి నెలాఖరుకల్లా విశాఖ, అనంతపురం, చిత్తూరు, విజయవాడలలో, డిసెంబర్‌ నాటికి తిరుపతి, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, ప్రొద్దుటూరులలో ట్రాక్‌ల్‌ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు.  

ఆటో మేషన్‌ డ్రైవింగ్‌ ట్రాక్‌ అంటే..  
డ్రైవింగ్‌ లైసెన్స్‌ల కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు ప్రస్తుతం మోటారు వాహన తనిఖీ అధికారులు మాన్యువల్‌ విధానంలో పరీక్షలు నిర్వహించి సామర్థ్యాన్ని నిర్ధారిస్తున్నారు. ఈ విధానంలో ఏజెంట్లు, మధ్యవర్తులు, డ్రైవింగ్‌ స్కూళ్ల ప్రమేయం ఎక్కువగా ఉంటోంది. దీంతో నైపుణ్యం లేని వారికి కూడా తేలిగ్గా లైసెన్స్‌లు దక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రైవింగ్‌ పరీక్షలను మానవ ప్రమేయ రహితంగా, పారదర్శకంగా నిర్వహించాలని రవాణా శాఖ నిర్ణయించింది. వీడియో సెన్సర్‌లే కీలకంగా పనిచేస్తాయి. ట్రాక్‌లో వాహనం నడిపే వ్యక్తి కదలికలను ఇవి నమోదు చేస్తాయి. వాహనాన్ని నడిపే తీరు, వేగం, వాహనం కండిషన్, పార్కింగ్‌ చేసే పద్ధతి, వాహనాన్ని వెనక్కి తీసుకోవడం, ఎత్తయిన ప్రాంతాల్లో, కచ్చా రోడ్లపైన, ట్రాఫిక్‌ రద్దీలో నడిపేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలపై కచ్చితమైన అంచనాలు ఉంటాయి.   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top