నేరేడు పండ్లలోనే కాదు.. ఆకుల్లోనూ గుణాలు.. పరిశోధన చేశారిలా..

AU Pharmacy Students Research: Medicine In Neredu Leaves - Sakshi

ఏయూ ఫార్మసీ విద్యార్థుల పరిశోధన

కొర్సిటిన్, రూటిన్‌ ఫ్లావనాయిడ్స్‌ గుర్తింపు

సాక్షి, విశాఖపట్నం: ఇప్పటి వరకు నేరేడు పండ్లలోనే ఔషధ గుణాలు ఉంటాయని  మనకు తెలుసు. కానీ నేరేడు ఆకుల్లోనూ ఔషధ గుణాలున్నట్లు కనుగొన్నారు ఆంధ్ర విశ్వవిద్యాలయం ఫార్మసీ కళాశాల విద్యార్థులు. సమాజానికి ఉపయుక్తంగా నిలిచే అంశంపై అధ్యయన ప్రక్రియలో భాగంగా నేరేడు ఆకుల్లో ఔషధ గుణాలను అన్వేషించే ప్రాజెక్ట్‌ను వీరు చేపట్టారు.

హెచ్‌వోడీ ఎ.కృష్ణమంజరి పవార్‌ పర్యవేక్షణలో నందిన, శ్రీదేవి, అనూష, కళ్యాణ్, రాజ్‌సుశితశ్రీ , శిరీష తమ పరిశోధనల్లో నేరేడు ఆకుల్లో రెండు ఫ్లావనాయిడ్స్‌ను గుర్తించారు. దాదాపు 50 గ్రాముల ఆకుల పొడిలో కొర్సిటిన్‌ 0.342 మైక్రో గ్రాములు, రూటిన్‌ 1.397 మైక్రో గ్రాములున్నట్లు తేల్చారు. ఈ ఫ్లావనాయిడ్స్‌ మధుమేహం, క్యాన్సర్‌ నియంత్రణకు ఉపకరిస్తాయి.

పరీక్ష చేశారిలా.. 
తొలుత కొన్ని నేరేడు ఆకులను తీసుకుని ఆరబెట్టారు. వాటిలో తేమ పూర్తిగా ఆరిపోయాక పొడి చేసి.. సన్నని జల్లెడతో వడగట్టారు.  అనంతరం నేరేడు ఆకుల పొడి ఇథనాల్, మిథనాల్‌లలో కరుగుతోందని గుర్తించారు. ఇన్‌ఫ్రారెడ్‌ కిరణాలలో ఈ పొడిని పరిశీలించారు. ఈ పరీక్షతో ఆ పొడిలో ఫ్లావనాయిడ్స్‌ ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌లుగా నిలుస్తాయి. మలినాలను తొలగించే వ్యవస్థగా పనిచేస్తాయి.

తదుపరి దశలో సినోడా టెస్ట్‌ చేసి దానిలో ఉన్న ఫ్లావనాయిడ్స్‌ రకాన్ని గుర్తించారు. టీఎల్‌సీ (థిన్‌ లేయర్‌ క్రొమెటోగ్రఫీ) చేసి కొర్సిటిన్, రూటిన్‌లు ఉన్న శాతాన్ని గుర్తించారు. విద్యార్థులు తమ రిపోర్టును వీసీ ఆచార్య పీవీజీడీ ప్రసాదరెడ్డికి అందజేశారు. సమాజ ఉపయుక్త అంశంపై పనిచేస్తున్న విద్యార్థులను వీసీ అభినందించారు. గతేడాది ఫార్మసీ కళాశాలకు చెందిన విద్యార్థులు ఫోర్టిఫైడ్‌ రైస్‌పైన ఇదే విధంగా అధ్యయనం చేశారు. విశ్వవిద్యాలయంలో జరిపే ప్రతి పరిశోధన సమాజానికి ఉపయుక్తంగా ఉండేలా అధికారులు కృషిచేస్తున్నారు.
చదవండి: సీఎం జగన్‌ చరిత్రాత్మక నిర్ణయం.. వారికి తీపి కబురు..   

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top