వైద్యం కోసం వచ్చిన రోగిని బయటకు పంపేసిన వైనం
ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో దారుణం
దిక్కుతోచక బస్టాండ్‌లో రోదిస్తున్న బాధితుడు
నెల్లూరు జిల్లా: ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వాస్పత్రిలో శనివారం దారుణం చోటు చేసుకుంది. వైద్యం కోసం ఒంటరిగా వచ్చిన ఓ పేషెంట్ ఓపీ తీసుకున్నప్పటికీ తోడుగా ఎవరూ రాలేదని వైద్యం చేయడానికి నిరాకరిస్తూ బయటకు పంపించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యం పేదలకు గగనంగా మారింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాధ్యతగా పనిచేసిన ఇదే వైద్య సిబ్బంది ఇప్పుడు ఇంత నిర్లక్ష్యంగా, నిర్దయగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. వివరాల్లోకి వెళ్తే.. జిల్లాలోని కలువాయి మండలం అంకుపల్లి గ్రామానికి చెందిన కొప్పాల పెంచలయ్య నెల్లూరులోని ఫత్తేఖాన్‌పేటలో ఉన్న నారాయణ జూనియర్ కళాశాలలో సెక్యూరిటీ గార్డుగా గత నెల క్రితం వరకు పని చేశాడు.
అప్పట్లో వర్షాల నేపథ్యంలో కళాశాల వరండాలో వర్షపు నీరు అధికంగా చేరడంతో వాటిని కాలితో నెట్టుతూ ఉండడంతో నాలుగు రోజులకే అతని అరి కాలికి పుండ్లు ఏర్పడ్డాయి. స్థానికంగా ప్రైవేట్‌గా వైద్యం చేయించినా తగ్గకపోవడంతో, విధులు నిర్వర్తించలేకపోవడంతో ఏజెన్సీ వారు అతన్ని ఉద్యోగం నుంచి తొలగించారు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నా.. విభేదాలతో వేరుగా ఉంటున్నారు. దీంతో స్వగ్రామమైన అంకుపల్లికి చేరాడు. రోజు రోజుకు కాలి బాధ తీవ్రం కావడంతో నడవలేని స్థితిలో అష్టకష్టాలు పడి శనివారం ఆత్మకూరు ప్రభుత్వ జిల్లా వైద్యశాలలో వైద్యం చేయించుకొనేందుకు వచ్చాడు. ఓపీ సైతం తీసుకున్నాడు. కట్టు కట్టే దగ్గరకు వెళ్తే అక్కడి సిబ్బంది ‘నువ్వు సహాయకుడు లేకుండా వస్తే వైద్యం చేయం’ అని చెప్పడంతో తాను గతంలో జగనన్న ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ ద్వారా 2021లో గుండె ఆపరేషన్ నెల్లూరులోని బొల్లినేని ఆస్పత్రిలో చేయించుకున్నానని, అప్పట్లో తన వెంట ఎవరూ లేరని, అయినా వైద్యం చేశారని తెలిపాడు.
జగనన్న వల్ల తనకు ఉచితంగా వైద్యం జరగడంతో ఆయన పేరును తన గుండెపై పచ్చబొట్టు పొడిపించుకున్నట్లు పెంచలయ్య ఆత్మకూరు ఆస్పత్రి సిబ్బందికి తెలిపాడు. దీంతో అక్కడి సిబ్బంది ఇక్కడ రాజకీయాలు చెప్పొద్దని, ముందు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని వైద్యం చేయకుండానే పంపేశారు. దీంతో ఏమి చేయాలో పాలుపోక ఏడుస్తూ నడవలేని స్థితిలో మున్సిపల్ బస్టాండ్ వద్దకు చేరుకొని దిక్కుతోచక రోడ్డుపై కూర్చోని రోదిస్తున్న తీరు చూసిన స్థానికులు ఆస్పత్రి సిబ్బంది ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదని, బస్టాండ్‌లో అతని పరిస్థితి చూసిన పలువురు వ్యాఖ్యానించారు. ఈ ఘటనపై ప్రభుత్వ ఆస్పత్రి ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌ను వివరణ కోసం ప్రయతి్నంచగా ఆయన అందుబాటులోకి రాలేదు.


