Ganapavaram: సీఎం జగన్‌ పర్యటనకు ఏర్పాట్లు 

Arrangements For CM Jagan Tour Ganapavaram on May 16 - Sakshi

సాక్షి, గణపవరం(పశ్చిమగోదావరి): ఈనెల 16న గణపవరంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యటన నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తుంది. వైఎస్సార్‌ రైతు భరోసా పథకంలో రైతులకు సీఎం చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఈ పర్యటన కోసం ఇప్పటికే హెలిప్యాడ్‌ నిర్మాణం పూర్తికావచ్చింది. హెలికాప్టర్‌ ట్రయల్‌రన్‌ పూర్తిచేశారు. హెలిప్యాడ్‌ నుంచి ముఖ్యమంత్రి ప్రత్యేక వాహనశ్రేణిలో నేరుగా సభాస్థలికి చేరుకుంటారు. ఇందుకోసం ప్రధాన రోడ్డుకు చేరడానికి ప్రత్యేకంగా రోడ్డును నిర్మించారు.

అలాగే సీఎం పర్యటించే దారిలో పారిశుధ్య పనులు ముమ్మరం చేశారు. ఏలూరు ఆర్డీఓ పెంచల కిషోర్‌ ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. హెలికాప్టర్‌ దిగినప్పుడు దుమ్ము రేగకుండా ఆ ప్రాంతం వాటరింగ్‌ చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీ మైదానంలో భారీ సభావేదికను నిర్మిస్తున్నారు. జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు, మంత్రులు, రాçష్ట్రస్థాయి నాయకులు, అధికారులు కూర్చునే విధంగా సువిశాలమైన సభావేదికను నిర్మిస్తున్నారు. సభలో పెద్ద సంఖ్యలో  రైతులు, ప్రజలు, పార్టీ కార్యకర్తలు పాల్గొననున్న దృష్ట్యా భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. సభాప్రాంగణానికి రావడానికి ప్రజలు ఇబ్బంది పడకుండా ఐదు ప్రత్యేక మార్గాలను ఏర్పాటు చేస్తున్నారు.  

ఏర్పాట్లు పరిశీలించిన ఎమ్మెల్యే  
ముఖ్యమంత్రి పాల్గొనే సభావేదిక నిర్మాణ పనులను శుక్రవారం సాయంత్రం ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు, జాయింట్‌ కలెక్టర్‌ అరుణ్‌బాబు పరిశీలించారు. సభకు తరలివచ్చే రైతులు, ప్రజలకు సిట్టింగ్‌ ఏర్పాటుపై చర్చించారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న స్టాల్స్‌ పరిశీలించారు. గురువారం రాత్రి వ్యవసాయ శాఖ జిల్లా, స్థానిక అధికారులతో సమావేశమై స్టాల్స్‌పై చర్చించారు. ముఖ్యమంత్రి పర్యటన విజయవంతం చేయడానికి నియోజకవర్గంలోని పార్టీ ముఖ్య నేతలు, గణపవరం, సరిపల్లె, బువ్వనపల్లి గ్రామాలకు చెందిన పార్టీ శ్రేణులతో సమావేశమై పార్టీపరంగా ఏర్పాట్లపై చర్చించారు. 

పటిష్ట భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ
ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఈనెల 16న పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ తెలిపారు. శుక్రవారం ఆయన గణపవరంలో ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి పోలీసు అధికారులతో పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ఎలాంటి ఘటనలూ తలెత్తకుండా, ఇబ్బందులు రాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హెలిప్యాడ్‌ నుంచి సభాస్థలి వరకూ రోడ్డు మార్గాన్ని పరిశీలించి ఏఏ ప్రదేశాల్లో ఎలాంటి బందోబస్తు ఏర్పాట్లు చేయాలో సూచించారు. 


గణపవరంలో సిద్ధం చేస్తున్న హెలీప్యాడ్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top