త్రీడీ విధానంలో పురావస్తు సమాచారం

Archaeological Information In 3D At Five Museums In AP - Sakshi

రాష్ట్రంలోని పురాతన వస్తువుల సమగ్ర సమాచారం డిజిటలీకరణ  

తొలిదశలో ఐదు మ్యూజియాల్లో చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు 

డీపీఆర్‌లకు కేంద్ర ప్రభుత్వ ప్రశంసలు

సాక్షి, అమరావతి: పురావస్తు తవ్వకాల్లో బయల్పడిన లక్షల ఏళ్లనాటి వారసత్వ సంపద, సాంస్కృతిక ఆనవాళ్లను భావితరాలకు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. పురావస్తు ప్రదర్శన శాలల్లో భద్రపర్చిన పురాతన వస్తువుల సమగ్ర సమాచారాన్ని నూతన సాంకేతిక పద్ధతుల్లో నిక్షిప్తం చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 14 పురావస్తు ప్రదర్శన శాలలు ఉండగా.. తొలి దశలో విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, నెల్లూరు మ్యూజియాల్లో డిజిటలైజేషన్‌ ప్రక్రియకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇందుకు రాష్ట్ర పురావస్తు శాఖ రూపొందించిన డీపీఆర్‌లకు సైతం కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రశంసలు లభించడం విశేషం. 

సమాచారం కంటికి కనిపించేలా 
మ్యూజియాల్లో భద్రపరిచిన వస్తువులను 360 డిగ్రీల కోణంలో ఫొటోలు, వీడియో తీస్తారు. అనంతరం వాటికి సంబంధించి పూర్తి వివరాల(కాలం, లభ్యమైన ప్రదేశం, విశిష్టత)ను ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌లో పొందుపరుస్తారు. దానిని పురావస్తు శాఖ వెబ్‌సైట్, ప్రత్యేకంగా రూపొందించిన యాప్‌లకు అనుసంధానిస్తారు. తద్వారా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా ఏ మ్యూజియంలో ఏ వస్తువు ఉంది, అది ఏకాలానికి చెందినదన్న విషయాన్ని సులభంగా తెలుసుకునేందుకు వీలుంటుంది. మరోవైపు పురాతన వస్తువుల భద్రత, రక్షణ విషయంలో కూడా పారదర్శకత ఉంటుంది. భవిష్యత్‌లో సదరు వస్తువు విరిగినా, చోరీకి గురైనా సులభంగా గుర్తించవచ్చు. ఇప్పటివరకూ మ్యూజియాల్లోని పురాతన వస్తువుల వివరాలు, ఫొటోలను గ్రంథస్థం చేస్తున్నప్పటికీ వాటిని పరిరక్షించడం పెను సవాల్‌గా మారింది. కొత్త విధానంతో సమాచారం ఎప్పటికీ చెక్కు చెదరకుండా ఉండనుంది. ఈ ప్రక్రియలో కేంద్ర సమాచార, సాంకేతిక మంత్రిత్వ శాఖ పరిధిలో నడిచే పూణేకు చెందిన సీ–డాక్‌ సంస్థ సాంకేతిక సహాయాన్ని అందించనుంది.  

లక్షల ఏళ్లనాటి వారసత్వ సంపద 
క్రీ.పూ. లక్షల ఏళ్ల నుంచి 19 శతాబ్దం వరకు అనేక ప్రాచీన విశేషాలు పురావస్తు ప్రదర్శన శాలల్లో చారిత్రక వైభవాన్ని చాటుతున్నాయి. ఆది మానవులు, రాతియుగంలో వాడిన పరికరాలు, వినియోగించిన వస్తువులు కనువిందు చేస్తున్నాయి. వీటిల్లో రాతి విగ్రహాలు, చిత్రపటాలు, నాణేలు, బీడ్స్, ఫ్లేక్స్, కుండలు, ఆయుధాలు, పింగాణి పాత్రలు, రాగి, శిలా శాసనాలు వంటివి వేలాది రకాలున్నాయి.

భావి తరాలకు అందిస్తాం..
డిజిటలైజేషన్‌ వల్ల పురాతన వస్తువుల సమాచారం అందుబాటులోకి రావడంతో పాటు వాటికి భద్రత, రక్షణ ఏర్పడుతుంది. భవిష్యత్‌లో సదరు వస్తువు దెబ్బతిన్న, చోరీ అయినా అంతకుముందే దానికి సంబంధించిన వివరాలు కచ్చితంగా నమోదై ఉంటాయి. ఫలితంగా వారసత్వ సంపదను భావితరాలకు జాగ్రత్తగా అందించేందుకు వీలుంటుంది. త్వరలో ఐదు మ్యూజియాల్లో డిజిటలీకరణ చేపట్టనున్నాం.  
– జి.వాణీమోహన్, పురావస్తు శాఖ కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top