APSRTC Employee Benefits In Telugu | ఆర్టీసీలో అదృష్టవంతులు - Sakshi
Sakshi News home page

APSRTC: ఆర్టీసీలో అదృష్టవంతులు

Dec 14 2021 5:22 AM | Updated on Dec 14 2021 7:12 PM

తాజా పీఆర్సీ సిఫార్సుల్లో ఆ సంస్థ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం కలగనుంది. పీటీడీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా

సాక్షి, అమరావతి: ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ విప్లవాత్మక విధాన నిర్ణయం ఆ సంస్థ ఉద్యోగులకు వరంగా మారింది. 2020, జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి ప్రజా రవాణా విభాగం(పీటీడీ) ఏర్పాటు చేయడంతో తాజా పీఆర్సీ సిఫార్సుల్లో ఆ సంస్థ ఉద్యోగులకు గరిష్ట ప్రయోజనం కలగనుంది. పీటీడీ ఉద్యోగులు అందరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ప్రయోజనాలు కలగనున్నాయని పీఆర్సీ నివేదిక స్పష్టం చేసింది. ఈ మేరకు పీటీడీ ఉద్యోగులకు 32 గ్రేడ్‌లు, 83 దశలతో కూడిన రివైజ్డ్‌ పే స్కేల్‌ను సిఫార్సు చేసింది. 

ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా...
► పీటీడీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతోపాటు సమానమైన పే స్కేల్‌ను కేటాయించారు. ఆర్టీసీలో 9 లేదా 18ఏళ్లు స్టాగ్నేషన్‌ గ్రేడ్‌ పే స్కేల్‌ డ్రా చేస్తున్నవారికి స్పెషల్‌ గ్రేడ్‌ పోస్ట్‌ పే స్కేల్, స్పెషల్‌ ప్రమోషన్‌ పోస్ట్‌ స్కేల్‌ ఐబీ / స్పెషల్‌ అడహాక్‌ ప్రమోషన్‌ పోస్ట్‌ స్కేల్‌ ఐబీ కేటాయించాలని సిఫార్సు చేశారు. 
► ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్కేల్స్‌లో గ్రేడ్‌ 25 ఆటోమేటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీమ్‌ ప్రయోజనాలు అందజేస్తారు.
► పీటీడీ ఉద్యోగులకు వేతన స్థిరీకరణ 2020, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 2018, జూలై 1 కంటే ముందు సర్వీసులో ఉన్న ఉద్యోగులకు వేతన స్థిరీకరణ రెండు దశల్లో చేయాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. అంటే ముందు 2018, జూలై 1నాటికి నోషనల్‌గా నిర్ణయించి, ఆపై 2020, జనవరి 1నాటికి పే ని మళ్లీ నిర్ణయిస్తారు. మొదటి దశ కింద 2018, జూలై 1 నాటికి 1.6శాతం ఫిట్‌మెంట్‌ ప్రయోజనాన్ని కమిషన్‌ సిఫార్సు చేసింది. 2018, జూలై 1 నుంచి 2020, జనవరి 1 మధ్య  సర్వీసులో చేరిన ఉద్యోగుల వేతన స్థిరీకరణకు కూడా సిఫార్సు చేశారు. 

అన్ని ప్రయోజనాలూ జనవరి 1, 2020 నుంచి వర్తింపు..
► పీటీడీ ఉద్యోగులకు డీఏ ప్రభుత్వ ఉద్యోగులతోసమానంగా 2020, జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. 
► ఇంటి అద్దె అలవెన్స్‌(హెచ్‌ఆర్‌ఏ) కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 2020, జనవరి 1 నుంచి వర్తిస్తుంది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని వర్క్‌ స్టేషన్లలోని పీటీడీ ఉద్యోగులకు గరిష్టంగా రూ. 26వేలకు లోబడి 30శాతం హెచ్‌ఆర్‌ఏ సిఫార్సు చేశారు. 
► సిటీ కాంపెన్సేటరీ అలవెన్స్‌(సీసీఏ) కూడా ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా పీటీడీ ఉద్యోగులకు ఇవ్వాలని కమిషన్‌ సిఫార్సు చేసింది. హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలలోని వర్క్‌ స్టేషన్లలోని పీటీడీ ఉద్యోగులకు ప్రత్యేక రేట్లను సూచించింది.
► ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే పీటీడీ ఉద్యోగులకు కూడా ఇతర సేవా ప్రయోజనాలు కల్పించాలని పీఆర్సీ సిఫార్సు చేసింది. డిఫరెంట్లీ ఏబుల్డ్‌ ఎంప్లాయిస్, కారుణ్య నియామకాల పథకం, ఏపీజీఎల్‌ఐ/ జీఐఎస్‌ బీమా రక్షణ తదితర ప్రయోజనాలను 2020, జనవరి 1 నుంచి వర్తింపజేస్తారు. 
► పీటీడీ ఉద్యోగులకు పింఛన్‌ ప్రయోజనాల కోసం ఈపీఎస్‌–95 పథకంగానీ సీపీఎస్‌ పథకాన్నిగానీ ఎంపిక చేసుకునే అవకాశం కల్పించారు. సీపీఎస్‌ పథకాన్ని ఎంపిక చేసుకునేవారు ఇతర ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించే డీసీఆర్‌జీ పథకం కిందకు వస్తారు. ఈపీఎస్‌–95 పథకంలో కొనసాగాలని ఎంపిక చేసుకునేవారికి గతంలో ఏపీఎస్‌ఆర్టీసీ గ్రాట్యుటీ విధానంలో ప్రయోజనం కల్పిస్తారు. 
► ఇక రిటైర్డ్‌ ఉద్యోగులకు ఆర్జిత సెలవుల ఎన్‌క్యాష్‌మెంట్, ఈహెచ్‌ఎస్‌ కవరేజీ, మెడికల్‌ అలవెన్స్, వైద్య కారణాలతో స్వచ్ఛంద పదవీ విరమణ ప్రయోజనాలు, డెత్‌ రిలీఫ్‌ తదితరమైనవన్నీ వర్తిస్తాయి.

‘అప్పటి పెన్షన్‌ విధానాన్ని కల్పించండి’
ఆర్టీసీ ఉద్యోగులకు 2004కు ముందు అమల్లో ఉన్న పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేయాలని నేషనల్‌ మజ్దూర్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, ఐ.శ్రీనివాసరావు కోరారు. ఎస్‌ఆర్‌బీఎస్‌ను రద్దు చేసినందున 2020 జనవరి 1 తరువాత రిటైరయ్యే ఉద్యోగులకు కొంత పెన్షన్‌ కూడా రాని పరిస్థితి తలెత్తిందన్నారు. కాబట్టి తమకు 2004 ముందునాటి పెన్షన్‌ విధానాన్ని వర్తింపజేసి ఆర్థిక భద్రత కల్పించాలని సోమవారం ఓ ప్రకటనలో కోరారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement