కమనీయం.. అప్పన్న నిజరూపం

Appanna Swamy Temple Chandanotsavam Visakha - Sakshi

నేత్రపర్వంగా శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి చందనోత్సవం

ప్రభుత్వం తరఫున స్వామికి పట్టువస్త్రాలు సమర్పించిన దేవదాయ శాఖ మంత్రి

తొలి దర్శనం చేసుకున్న ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు 

స్వామిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్, స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి

పోటెత్తిన భక్తులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు

సాక్షి, విశాఖపట్నం: సింహగిరిపై శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి చందనోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వైశాఖ శుద్ధ తదియను పురస్కరించుకుని మంగళవారం తెల్లవారుజామున నుంచే స్వామి దివ్యరూపాన్ని భక్తులు దర్శించుకున్నారు. ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే లభించే స్వామివారి నిజరూపాన్ని దర్శనం చేసుకునేందుకు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు, రాష్ట్రేతర ప్రాంతాల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు. ఆలయ అనువంశిక ధర్మకర్త అశోక్‌ గజపతిరాజు తన కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి 2.30 గంటలకే స్వామివారి తొలి నిజరూప దర్శనం చేసుకుని తొలి చందనం సమర్పణ చేశారు. అనంతరం ప్రభుత్వం తరఫున దేవదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు. టీటీడీ తరఫున జేఈఓ ధర్మారెడ్డి, టీటీడీ చైర్మన్‌ సతీమణి స్వర్ణలతారెడ్డిలు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం 3.30 నుంచి భక్తులను అనుమతించారు.  

స్వామి సేవలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ శ్రీనరసింహ 

కదలివచ్చిన భక్తజనం
చందనోత్సవ వైదిక కార్యక్రమాలను ఆలయ అర్చకులు మంగళవారం వేకువజామున నుంచి ప్రారంభించారు. పాంచరాత్ర ఆగమశాస్త్రం ప్రకారం ఒంటిగంటకు స్వామిని సుప్రభాత సేవతో మేల్కొలిపి చందనం ఒలుపును (స్వామిపై ఉన్న చందనాన్ని తొలగించడం) అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. రాత్రి 9 గంటల అనంతరం సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. గడిచిన రెండేళ్లుగా కరోనా కారణంగా ఏకాంతంగానే చందనోత్సవం జరగడం, భక్తులెవరినీ దర్శనానికి అనుమతించకపోవడంతో ఈ ఏడాది చందనోత్సవానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భక్తులకు మంచినీళ్లు, ఆహారం అందించేందుకు దేవస్థానంతో పాటు పలు స్వచ్ఛంద సంస్థలు ఏర్పాట్లుచేశాయి. సుమారు 2,500 మంది పోలీసులను భద్రత కోసం వినియోగించారు. వైద్యులు, 108 అంబులెన్స్‌లు, ఏఎన్‌ఎంలతోపాటు ఉచిత మందులూ అందుబాటులో ఉంచారు. 

పోటెత్తిన వీఐపీలు
చందనోత్సవం సందర్భంగా మంగళవారం వీఐపీలు పోటెత్తారు. తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌ అంతరాలయంలో స్వామివారిని దర్శించుకున్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం, మంత్రులు పీడిక రాజన్నదొర, గుడివాడ అమర్‌నాథ్, చెల్లుబోయిన వేణుగోపాల్, అనకాపల్లి ఎంపీ డాక్టర్‌ బీశెట్టి సత్యవతి, మాజీమంత్రులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, వెలంపల్లి శ్రీనివాసరావు, ఎమ్మెల్సీలు వంశీకృష్ణ శ్రీనివాస్, తోట నరసింహం, వరుదు కల్యాణి, మాధవ్, ఎమ్మెల్యేలు కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అచ్చెన్నాయుడు, సుప్రీంకోర్డు న్యాయమూర్తి జస్టిస్‌ నరసింహం తదితరులు స్వామివారి నిజరూప దర్శనం చేసుకున్నారు. మరోవైపు.. చందనోత్సవ వేళ ఆలయంలో అపచారం జరిగింది. స్వామి గర్భాలయాన్ని ఓ ఆకతాయి వీడియో తీయగా.. అది సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ప్రభుత్వం ఏర్పాట్లు బాగా చేసింది
సింహాద్రి అప్పన్న నిజరూప దర్శనం మహాభాగ్యం. తొలిసారిగా నేను చందనోత్సవంలో పాల్గొన్నాను. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అత్యంత శక్తివంతమైన దేవుడు. ఇక్కడ అడుగుపెట్టిన వెంటనే శరీరమంతా దివ్యతేజమైనట్లు అనిపించింది. ఇక్కడ భక్తులకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చాలాబాగా చేసింది. ప్రజలందరికీ ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నా.
– తమిళిసై, తెలంగాణ గవర్నర్‌ 

వైభవంగా చందనోత్సవం 
ఈ ఏడాది చందనోత్సవానికి ఏర్పాట్లు అద్భుతంగా చేసి వైభవంగా నిర్వహించారు. రెండు తెలుగు రాష్ట్రాలూ ఈ ఏడాది ఆర్థికంగాను, ప్రజలు ఆరోగ్యకరంగా, అన్ని రకాలుగాను బాగుండాలని కోరుకున్నా. అందరినీ సమన్వయం చేసుకుంటూ దేవస్థానం ఈఓ సూర్యకళ, కలెక్టర్‌ మల్లికార్జున, సీపీ శ్రీకాంత్, దేవదాయశాఖ నుంచి ఫెస్టివల్‌ అధికారి భ్రమరాంబ సామాన్య సేవకుల్లా ఉండి భక్తుల సేవలో ఉండటం గొప్ప విషయం.
– స్వరూపానందేంద్ర సరస్వతి, విశాఖ శ్రీ శారదా పీఠాధిపతి 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top