జీవనోపాధులను మెరుగుపరుస్తున్న స్త్రీ నిధి రుణాలు | AP: Women Fund Loans Improving Their Livelihoods | Sakshi
Sakshi News home page

జీవనోపాధులను మెరుగుపరుస్తున్న స్త్రీ నిధి రుణాలు

Published Sun, Aug 28 2022 11:20 AM | Last Updated on Sun, Aug 28 2022 11:28 AM

AP: Women Fund Loans Improving Their Livelihoods - Sakshi

మహిళా సాధికారత సాధించే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సత్ఫలితాలిస్తున్నాయి. మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం ఇస్తున్న స్త్రీ నిధి రుణాలు వారి జీవనోపాధులను మెరుగుపరుస్తున్నాయి. సొంతంగా వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చేస్తున్నాయి. తీసుకున్న రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తూ మహిళలు ఆర్థికంగా బలపడుతున్నారు.  

గుజ్జిబోయిన రంగలక్ష్మమ్మ. గిద్దలూరు మండలం దిగువమెట్ట గ్రామం. రెండేళ్ల క్రితం వరకు కూలి పనులకు వెళ్తుండేది. ఆమె భర్త మేదర పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. రంగలక్ష్మమ్మ చెన్నకేశవ పొదుపు గ్రూపులో సభ్యురాలిగా చేరి తొలి విడత రూ.50 వేల స్త్రీ నిధి రుణం తీసుకుని సకాలంలో చెల్లిస్తూ తిరిగి రెండోసారి రూ.50 వేల రుణం తీసుకుంది. ఆ నగదుతో ఆరు నెలల క్రితం బుట్టలు, చాటలు, ఇతర వెదురు అల్లికల వస్తువులు పెద్ద మొత్తంలో తయారు చేసి ఇంటి వద్దనే దుకాణం పెట్టుకున్నారు. క్రమంగా ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది. కుటుంబ అవసరాలకు ఇబ్బంది లేకుండా ఉందని సంతోషంగా చెబుతోంది. 

గిద్దలూరు రూరల్‌:  మహిళలు పురుషులపై ఆధారపడకుండా వారి స్వశక్తితో జీవితంలో ముందుకు సాగాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మహిళల అభ్యున్నతి కోసం స్త్రీ నిధి పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం ఇచ్చే రుణాలతో వివిధ రకాల వ్యాపారాలు కొనసాగిస్తూ నాలుగు రూపాయలు వెనకేసుకుంటూ ఆర్థిక స్వాలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. మహిళలు ఒకరి పై ఆధారపడకుండా వారి కాళ్ల మీద వారు నిలబడేలా ప్రభుత్వం వారికి చేయూతనిస్తోంది. జిల్లాలో ని 38 మండలాలకు గాను 6599 పొదుపు గ్రూపులు ఉన్నాయి.

అందులో 20,191 మంది సభ్యులైన మహిళలకు ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.62.8 కోట్లను స్త్రీ నిధి కింద రుణాలిచ్చినట్లు స్త్రీనిధి ప్రాజెక్టు ఏజీఎం హర్షవర్ధన్‌ తెలిపారు. పొదుపు గ్రూపు సభ్యులందరి సమ్మతితో రుణం తీసుకుని వారి భాగానికి వచ్చే నగదుతో కొందరు బుట్టలు, తట్టలు, చాటలు, విసనకర్రలు, గొర్రెలు, మేకల పెంపకం, మెడికల్‌ షాపు, చిల్లర వ్యాపారం, చీరల దుకాణం, సప్లయర్స్‌ సామాన్లు వంటి వివిధ రకాల ఇతర వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. వ్యాపారం చేయగా వచ్చిన డబ్బుతో నెమ్మది నెమ్మదిగా తీసుకున్న రుణాలను తీర్చుకుంటూ రుణవిముక్తులవుతున్నారు. ఒక వైపు కుటుంబ భారాన్ని మోస్తూ మరో వైపు వ్యాపారాలు కొనసాగిస్తూ ఆదర్శనీయంగా నిలుస్తున్నారు. స్త్రీ నిధి పథకం ద్వారా రుణం పొందిన వారు ప్రమాదవశాత్తు మరణిస్తే తిరిగి వారు తీసుకున్న రుణం చెల్లించాల్సిన అవసరం లేదు.  

పుష్కలంగా ఎరువులు
ఖరీఫ్‌ ఆశాజనకంగా సాగుతోంది. జిల్లాలో అధికంగా వరి సాగు చేశారు. ఎరువులు వాడే తరుణం వచ్చింది. మార్కెట్‌యార్డులు, సొసైటీల వద్ద క్యూలైన్లు అవసరం లేదు. తెల్లవారుజామునే పరుగులు తీయాల్సిన పనిలేదు. బ్లాక్‌ మార్కెట్‌ను ఆశ్రయించాల్సిన పనిలేదు. పడిగాపులు కాయాల్సిన అవసరం అంతకంటే లేదు. పంటకు ఎరువు వేయాల్సిన సమయంలో ఎరువులు చేతికందుతాయో లేదో అనే చింత లేదు. రైతన్న సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఏర్పాటు చేసిన ఆర్బీకేలు చింత తీరుస్తున్నాయి. ప్రస్తుతం అవసరం మేరకు ఎరువులు సిద్ధం చేశారు. దీంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. 
సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్‌లో 2,42,314 ఎకరాల్లో సాగు చేశారు. సాధారణ విస్తీర్ణం 3,16,169గా ఉంది. మిగిలిన  73,855 ఎకరాల్లో వరి, మిరప పంటల సాగుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అందులో వరి, పత్తి, మిరప, పసుపు ఇతర అపరాలు ఉన్నాయి. ఎరువులు వాడే తరుణం వచ్చింది. జిల్లాలో ఎరువులు పూర్తిస్థాయిలో అందుబాటులో ఉన్నాయి. ఇంకా కావాల్సిన ఎరువులకు ఇప్పటికే ప్రభుత్వానికి జిల్లా యంత్రాంగం ప్రతిపాదనలు పంపింది.  

ఎరువు ఎంత అవసరమంటే.. 
ఇప్పటి వరకు జిల్లాలో సాగు చేసిన పంటలకు గాను 72,000 మెట్రిక్‌ టన్నుల ఎరువులు అవసరం. ఇప్పటికే 20,048 మెట్రిక్‌ టన్నుల యూరియా, 10,356 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 17,500 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్, 1,763 మెట్రిక్‌ టన్నుల పోటాష్‌ కలిపి మొత్తం 49,667 మెట్రిక్‌ టన్నుల ఎరువులు జిల్లాలోని డీలర్లు, సొసైటీలు, ఆర్‌బీకేల ద్వారా వ్యవసాయ శాఖ రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చింది.  

సాగునీరు అందుబాటులో.. 
ఈఏడాది వర్షమేఘాల కోసం ఎదురుచూడాల్సిన పనిలేకుండాపోయింది. జిల్లాలో జూన్, జూలై మాసాల్లో అధిక వర్షపాతం నమోదైంది. ఈ సంవత్సరం అన్ని ముఖ్య పంటలు జూలై చివరి వారం నుంచి సాగు మొదలైంది. దీంతో సెప్టెంబర్‌లో వాడే డీఏపీ ఎరువు ఈ నెలలోనే అవసరం అయింది. జిల్లాకు 12,850 మెట్రిక్‌ టన్నుల డీఏపీ అవసరం కాగా, ఆగస్టు 26 నాటికి సుమారు 14,535 మెట్రిక్‌ టన్నుల డీఏపీ లభ్యతలోకి వచ్చింది. ఇంకా 2,758 మెట్రిక్‌ టన్నుల డీఏపీ ఆర్‌బీకేలు, సొసైటీలు, ప్రైవేటు డీలర్ల వద్ద అందుబాటులో ఉంది.  

ఎరువుల సరఫరా నిరంతర ప్రక్రియ 
రైతులకు అవసరమైన ఎరువుల ఇండెంట్‌ మేరకు సరఫరా ప్రక్రియను ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆగస్టు 24వ తేదీ నుంచి నెలాఖరువరకూ 2,650 టన్నుల డీఏపీ జిల్లాకు వచ్చింది. ఆర్‌బీకేలకు, సహకార సంఘాలకు సరఫరా చేయడం జరిగింది. అలాగే ప్రైవేటు ఎరువుల డీలర్ల వద్ద కూడా ఎరువుల లభ్యత సంవృద్ధిగా ఉంది. జిల్లాకు వచ్చిన డీఏపీ ఎరువులను వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో మాత్రమే రైతులకు అందించాలని, బ్లాక్‌ మార్కెట్, కొరత రాకుండా చూడాలని జిల్లా వ్యవసాయ అధికారిని జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాలరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.  

ఖరీఫ్‌లో కొరత లేదు జిల్లాలో ఖరీఫ్‌కు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయి. కొరత రాకుండా ముందస్తు ప్రణాళికతో అన్ని చర్యలు తీసుకున్నాం. కోటా మేరకు ఎరువులు సరఫరా జరిగేలా కంపెనీ ప్రతినిధులు, డిస్ట్రిబ్యూటర్లు, మార్క్‌ఫెడ్‌ అధికారులతో తరచూ సమీక్షిస్తున్నాం. ఖరీఫ్‌ పూర్తయ్యేలోగా వేసిన పంటలకు జిల్లాకు నిర్దేశించిన ఎరువులు తెప్పిస్తాం. ఇంత వరకు జిల్లాలో ఎక్కడా ఏ రకం ఎరువు కొరతే లేదు. ఆగస్టులో కోటా కంటే ఎక్కువే తెప్పించాం. మోతాదుకు మించి రసాయన ఎరువులు వాడవద్దు. 
–నున్న వెంకటేశ్వర్లు, గుంటూరు జిల్లా వ్యవసాయశాఖ అధికారి  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement