పాతలైన్లతోనే రెట్టింపు కరెంట్‌

AP Transco Leans Towards HTLS Technology - Sakshi

హెచ్‌టీఎల్‌ఎస్‌ టెక్నాలజీ వైపు ట్రాన్స్‌కో మొగ్గు

సాక్షి, అమరావతి: ఏపీ ట్రాన్స్‌కో సరికొత్త హై టెన్షన్‌ లో సాగ్‌ (హెటీఎల్‌ఎస్‌) సాంకేతిక పరిజ్ఞానంపై ఆసక్తి చూపుతోంది. ఈ టెక్నాలజీ వినియోగం ద్వారా విద్యుత్‌ లైన్ల సామర్థ్యం పెంచబోతోంది. కొత్తగా లైన్లు వేయకుండా, ఉన్న కారిడార్‌తోనే ఎక్కువ విద్యుత్‌ సరఫరా చేయడం ఈ టెక్నాలజీ ప్రత్యేకత. ఎక్కువ కరెంట్‌ రావడమే కాకుండా, కొత్త లైన్లు వేసే అవసరం లేకపోవడంతో సమయం, డబ్బు ఆదా అవుతుందని  అధికారులు తెలిపారు. ఇప్పటికే 2 జిల్లాల్లో చేసిన ప్రయోగం సత్ఫలితాలనివ్వడంతో మరికొన్ని జిల్లాల్లో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  

కండక్టర్ల మార్పుతో రెట్టింపు వేగం
విద్యుత్‌ వినియోగం పెరుగుతున్న కొద్దీ విద్యుత్‌ పంపిణీ లైన్ల సామర్థ్యం కూడా పెంచాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే కొత్త కారిడార్లు వేయాలి.  వ్యవసాయ భూముల్లోంచి విద్యుత్‌ లైన్లు వేయడం కష్ట సాధ్యంగా మారుతోంది. రైతులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండటంతో ప్రాజెక్టులు ముందుకెళ్ళడం లేదు. ఈ నేపథ్యంలో హెటీఎల్‌ఎస్‌ టెక్నాలజీపై ట్రాన్స్‌కో దృష్టి సారించింది. ప్రస్తుతం ఉన్న విద్యుత్‌ కారిడార్‌ను వాడుకుంటూనే కేవలం కండక్టర్‌ను మార్చడం ద్వారా రెట్టింపు విద్యుత్‌ను పంపేందుకు ఈ టెక్నాలజీ ఉపయోగపడనుంది. హెచ్‌టీఎల్‌ఎస్‌ సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కండక్టర్లు అత్యధిక ఉష్ణోగ్రతను తట్టుకుంటాయి. అత్యధిక వేగంతో కరెంట్‌ను సరఫరా చేస్తాయి. పెరుగుతున్న విద్యుత్‌ డిమాండ్‌ను తట్టుకునేందుకు, వివిధ రకాలుగా లభిస్తున్న విద్యుత్‌ను గ్రిడ్‌పై ప్రతికూల ప్రభావం లేకుండా పంపిణీ చేయడానికి ఇది తోడ్పడుతుందని అధికారులు తెలిపారు. 

రూ.100 కోట్ల వ్యయం..
హెటీఎల్‌ఎస్‌ టెక్నాలజీ కోసం ఏపీ ట్రాన్స్‌కో రూ.100 కోట్లు వెచ్చిస్తోంది. ప్రయోగాత్మకంగా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో రూ.15 కోట్లతో 13 కిలోమీటర్ల మేర 132 కేవీ కండక్టర్లు వేశారు. ఇవి మంచి ఫలితాన్నిచ్చాయి. రెండో దశలో విశాఖ, విజయనగరం, రాజమండ్రి, నెల్లూరు విద్యుత్‌ జోన్లలో కొత్త కండక్టర్లు వేయనున్నారు. 27 కిలోమీటర్ల మేర 220 కిలోవాట్ల సామర్థ్యంతో, 110 కిలోమీటర్ల మేర 132 కేవీ సామర్థ్యంతో హెటీఎల్‌ఎస్‌ కండక్టర్లు వేయబోతున్నారు. కాగా, విద్యుత్‌ లోడ్‌ తగ్గించడమే లక్ష్యంగా.. కొత్త టెక్నాలజీతో చేపడుతున్న ఈ ప్రాజెక్టు పనులకు త్వరలో టెండర్లు పిలవబోతున్నట్లు ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top