చదువులిక సాఫీ

AP SCHE Is Developing A Learning Management System To Overcome Obstacles To Education - Sakshi

రిమోట్‌ లెర్నింగ్‌ సెంటర్ల ఏర్పాటుపై సర్కారు దృష్టి

గ్రామ స్థాయిలోకి అభ్యసన నిర్వహణ విధానం

కోవిడ్‌ నేపథ్యంలో ఫ్లిప్‌డ్‌ క్లాస్‌ రూమ్‌తో అభ్యసించే కొత్త విధానం

అందుబాటులోకి సెల్ఫ్‌ లెర్నింగ్‌ కోర్సులు, షెడ్యూల్డ్‌ కోర్సులు

ప్రైవేట్, అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ, ఇంజనీరింగ్‌ కళాశాలల కోసం..

ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌

సాక్షి, అమరావతి: తరచూ తలెత్తుతున్న కోవిడ్‌ విపత్కర పరిస్థితులు విద్యార్థుల చదువులకు తీవ్ర ఆటంకం కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ విధానాలపై రాష్ట్ర ఉన్నత విద్యామండలి (ఏపీ ఎస్‌సీహెచ్‌ఈ) దృష్టి సారిస్తోంది. విద్యార్థుల చదువులు ఏ సమయంలో ఎక్కడైనా.. ఎప్పుడైనా నిరాటంకంగా, సాఫీగా సాగించేందుకు వీలుగా వీటికి శ్రీకారం చుడుతోంది. ఇందులో భాగంగా అత్యంత పటిష్టమైన అభ్యసన నిర్వహణ వ్యవస్థ, సుదూర అభ్యసన కేంద్రాలు (లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్, రిమోట్‌ లెర్నింగ్‌ సెంటర్లు)ఏర్పాటు చేయాలని తలపోస్తోంది. వీటి ఏర్పాటు వల్ల విద్యార్థులు గ్రామస్థాయిలో కూడా తమంతట తాము ఎప్పుడైనా అభ్యసనాన్ని కొనసాగించేందుకు ఆస్కారం కలుగుతుంది.  

అభ్యసన నిర్వహణ వ్యవస్థ ఇలా.. 
కోవిడ్‌ నేపథ్యంలో విద్యాభ్యసనానికి ఏర్పడిన తీవ్ర అవాంతరాలను అధిగమించడానికి లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ను ఏపీ ఎస్‌సీహెచ్‌ఈ రూపొందిస్తోంది. తరగతి గదిలో అభ్యసనానికి ప్రత్యామ్నాయంగా బ్లెండెడ్‌ మోడ్‌ విధానంలో ఫ్లిప్ప్‌డ్‌ క్లాస్‌ రూమ్‌ ద్వారా అభ్యసన ప్రక్రియలను అమలు చేయనున్నారు. విద్యార్థులు ఆన్‌లైన్, డిజిటల్‌ కంటెంట్‌ల ఆధారంగా ఇంటివద్దే స్వయంగా అభ్యసన సాగిస్తూ తరగతి గదుల్లోని అధ్యాపకులు, సహ విద్యార్థులతో కలసి చర్చాగోష్టి, ప్రాజెక్టు వర్కులు వంటివి నిర్వహించుకునేలా ఈ విధానం ఉంటుంది. లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌లో విద్యార్థులకు అవసరమైన ప్రోగ్రామ్స్, కోర్సులు, కంటెంట్‌లను అందుబాటులో ఉంచుతారు.

యూజీ నాన్‌ ప్రొఫెషనల్, ఇంజనీరింగ్‌ వంటి ప్రొఫెషనల్‌ కాలేజీల విద్యార్థుల అభ్యసన అవసరాలను ఉన్నత విద్యామండలి ఈ–ఎల్‌ఎంఎస్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా తీర్చనుంది. ప్రైవేటు కాలేజీలు కూడా ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్‌ కార్యక్రమాలను ఈ ప్లాట్‌ఫామ్‌ వేదికగా కొనసాగించుకునేలా చేయనున్నారు. వివిధ సబ్జెక్టు నిపుణుల వీడియో లెక్చర్ల ద్వారా విద్యార్థులకు అవసరమైన పరిజ్ఞానాన్ని అందిస్తారు. సెల్ఫ్‌ ఫేస్డ్‌ కోర్సులు, షెడ్యూల్డ్‌ కోర్సులు కూడా ఈ ఎల్‌ఎంఎస్‌ ద్వారా విద్యార్థులకు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సులలో విద్యార్థులు సాధించిన క్రెడిట్ల బదలాయింపునకు కూడా అవకాశం కల్పిస్తారు. 

సుదూర అభ్యసన సెంటర్ల ఏర్పాటు ఇలా 
లెర్నింగ్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ ద్వారా అభ్యసన ప్రక్రియలకు ఆటంకం లేకుండా చేసే విధానాన్ని క్షేత్రస్థాయి వరకు అందుబాటులోకి తెచ్చేందుకు సుదూర అభ్యసన (రిమోట్‌ లెర్నింగ్‌) సెంటర్ల ఏర్పాటుకు ఉన్నత విద్యామండలి సంకల్పిస్తోంది. అన్ని మండలాల్లో వీటిని ఏర్పాటు చేయడం ద్వారా ఉన్నత విద్యను ఎప్పుడైనా, ఎక్కడినుంచైనా కొనసాగించేందుకు విద్యార్థులకు అవకాశం కలుగుతుంది. అనియత విధానంలో సాగే పద్ధతి వల్ల ఉన్నత విద్యాకోర్సుల జీవితకాల అభ్యసనానికి ఇది ఉపకరిస్తుంది. డిజిటల్‌ లెర్నింగ్, లెర్నింగ్‌ మేనేజ్‌మెంటు సిస్టమ్‌ విద్యార్థులకు ఓపెన్‌ విధానంలో అందుబాటులో ఉంటాయి. ఈ కొత్త ప్రక్రియల ద్వారా తరగతి గది అభ్యసనం, ఈ–లెర్నింగ్‌ రెండింటి అనుసంధానంతో బ్లెండెడ్‌ మోడ్‌ విధానంలో ఉన్నత విద్యాకోర్సులు ప్రతి ఒక్కరికీ అందుబాటులోకి రానున్నాయి.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top