పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా

ap peoples happy with navaratnalu scheme - Sakshi

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రంలో నిర్విఘ్నంగా అమలు చేస్తున్న నవరత్న పథకాల ద్వారా కోట్లాది మంది జీవితాల్లో వెలుగు నిండింది. ఈ పథకాల వల్లే తాము ఆనందంగా జీవిస్తున్నామని ఊరూరా ప్రజలు సంతోషంగా చెబుతున్నారు. వారంతా ఏ విధంగా అభివృద్ధిపథం వైపు పయనిస్తున్నారో వారి మాటల్లోనే  ‘సాక్షి’ మీ ముందుకు తెస్తోంది.  

పిల్లలపై ఆధార పడకుండా బతుకుతున్నా
మాది చేనేత కుటుంబం. మా ఆయన అశ్వర్థ నారాయణ ఏడేళ్ల క్రితం గుండెపోటుతో మరణించారు. మాకు ముగ్గురు కుమారులు. వారందరికీ పెళ్లిళ్లు అయ్యాయి. వైఎస్సార్‌ జిల్లా జమ్మలమడుగులో మగ్గం నేతతోపాటు నేను కూలి పనులకు వెళ్లేదాన్ని. ఇప్పుడు నా వయసు 58 సంవత్సరాలు. ఒంట్లో సత్తువ తగ్గి బయట పనులకు వెళ్లలేకపోతున్నా. గతంలో కేవలం రూ.వెయ్యి మాత్రమే పెన్షన్‌ వచ్చేది. 2019లో జగన్‌ సీఎం అయ్యాక పెన్షన్‌ పెరిగింది. ఇపుడు రూ.3 వేలు వస్తోంది. చేనేత వృత్తిలో ఉండటంతో వలంటీరే ఇంటికొచ్చి మరీ వైఎస్సార్‌ నేతన్న నేస్తంలో నా పేరు నమోదు చేశారు. ఈ పథకం కింద ఏటా రూ.24 వేలు చొప్పున ఇప్పటి వరకు ఐదుసార్లు కలిపి మొత్తం రూ.1.20 లక్షలు నా బ్యాంకు ఖాతాలో జమ చేశారు. వైఎస్సార్‌ చేయూత పథకం కూడా వర్తించింది. రూ.18,750 చొప్పున మూడుసార్లు డబ్బులు అందుకున్నా. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు నాకు కొండంత భరోసానిచ్చాయి. నాలాంటి ఒంటరి మహిళలు ఎలాంటి ఆర్థిక ఇబ్బందుల్లేకుండా, సంతోషంగా బతికే ధైర్యాన్నిస్తున్నాయి. 
    – శిరివెల్ల లక్ష్మీదేవి, జమ్మలమడుగు (నాయబ్‌ అబ్దుల్‌ బషీర్, విలేకరి, జమ్మలమడుగు) 

30 ఏళ్ల కల నెరవేరింది
కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే బతుకు తెరువు కోసం శ్రీకాకుళం జిల్లా బూర్జ గ్రామం నుంచి నరసన్నపేట మండలం ఉర్లాంకు 30 ఏళ్ల క్రితం వలస వచ్చాం. కొన్నాళ్లకు మా ఆయన కన్నుమూశారు. ఒక్కగానొక్క కొడుకుని చదివిస్తూ, షాపుల్లో పని చేస్తూ.. అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించాను. గతంలో ఉన్న ప్రభుత్వాలకు పక్కా ఇంటి కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేశాను. స్థలం ఉంటే ఇల్లు ఇస్తామన్నారు. స్థలం కొనే స్తోమత లేక అద్దెలు చెల్లిస్తూ జీవనం కొనసాగించాం. జగన్‌ బాబు ముఖ్యమంత్రి అయ్యాక మా కోరిక తీరింది. ఇంటి స్థలంతో పాటు ఇల్లు కట్టుకొనేందుకు ఆర్థిక సాయం చేశారు. డబ్బు సరిపోకపోతే డ్వాక్రా రుణం ఇప్పించారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు సొంత ఇంట్లో హాయిగా జీవనం సాగిస్తున్నాం. ఇదివరకు సొంత ఇల్లు లేదని ప్రైవేటు దుకాణంలో పని చేస్తున్న మా అబ్బాయి వైకుంఠరావుకు పెళ్లి సంబంధాలు కుదరలేదు. ఇప్పుడు సంబంధాలు వస్తున్నాయి. ఈ వేసవికి పెళ్లి చేయాలనుకుంటున్నా. ఇదంతా ముఖ్యమంత్రి చలువే. ఆయన సీఎం కాకపోతే మా కల నెరవేరేదికాదు. అలాగే ఈ ప్రభుత్వం నుంచి నాకు ఎంతో మంచి జరుగుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీనే వితంతు పింఛన్‌ వస్తోంది. డ్వాక్రా రుణం మాఫీ చేస్తామని పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు వైఎస్సార్‌ ఆసరా కింద నాలుగు విడతల్లో రూ.60 వేలు వచ్చింది. వైఎస్సార్‌ చేయూత పథకం ద్వారా ప్రతి ఏటా రూ.18,750 చొప్పున వచ్చింది. సీఎం జగన్‌ రుణం తీర్చుకోలేం.
– పైడిశెట్టి సత్యవతి, ఉర్లాం (మామిడి రవి, విలేకరి, నరసన్నపేట)

పింఛన్‌ మా ఇంటికే వస్తోంది
మాది నిరుపేద కుటుంబం. మేము పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఉంటున్నాం. మా నాన్న చిన్నతనంలోనే చనిపోయాడు. పుట్టుకతోనే నా రెండు కాళ్లు చచ్చుబడటంతో దివ్యాంగుడినయ్యాను. సెంటు భూమి కూడా లేని నన్ను మా అమ్మ కూలి పనులు చేసి బతికించింది. దివ్యాంగుడిని కావడంతో నన్ను ఎవరూ పనులకు పిలిచేవారు కాదు. అమ్మ కష్టాన్ని చూడలేకపోయాను. పెళ్లి మండపాల డేకరేషన్‌ పనులు నేర్చుకొని అప్పుడప్పుడు ఆ పనులకు వెళ్తున్నాను. ఎనిమిదేళ్ల క్రితం సలోమి అనే దివ్యాంగురాలితో నాకు వివాహమైంది. మాకు రాకేష్, సతీష్‌ అనే ఇద్దరు పిల్లలున్నారు. నా భార్య కూడా దివ్యాంగురాలు కావడంతో ఆమె కూడా పనులకు వెళ్లే వీలు లేకుండా పోయింది. ఇద్దరికీ వచ్చే పింఛనే జీవనాధారంగా మారింది. గతంలో పింఛను తీసుకోవాలంటే పంచాయతీ కార్యాలయం వద్ద రోజుల తరబడి నిరీక్షించేవాళ్లం. ట్రై సైకిల్‌ పై రోజూ అక్కడకు వెళ్లి రోజుల తరబడి తిరిగితే గాని పింఛను డబ్బులు వచ్చేవి కావు. కానీ నేడు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత నాకు, నా భార్యకు మొత్తం రూ.6 వేలు మా వలంటీర్‌ ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దకు తెచ్చి అందిస్తున్నారు. మా అమ్మకు వితంతు పింఛను కింద రూ.3 వేలు వస్తున్నాయి. వైఎస్సార్‌ చేయూత కింద ఏటా రూ.18,750 వంతున వస్తోంది. మా బాబు ఈ ఏడాదే ఒకటో తరగతిలో చేరాడు. విద్యాకానుక కింద బూట్లు, బ్యాగ్, పుస్తకాలు అన్నీ ఉచితంగా ఇచ్చారు. మాకు వస్తున్న పింఛను డబ్బులతోనే మేము బతుకుతున్నాం. మా కుటుంబానికి ప్రభుత్వ పథకాలే అండగా నిలుస్తున్నాయి. ఈ ప్రభుత్వం చేస్తున్న సాయం ఎప్పటికీ మరచిపోలేం.
    – మేడి నాగరాజు, దాచేపల్లి(వినుకొండ అజయ్‌కుమార్, విలేకరి, దాచేపల్లి)

whatsapp channel

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top