
కర్నూలు(అర్బన్): పల్లె ప్రజలు ప్రగతికి జై కొడుతున్నారు. అభివృద్ధిని కాంక్షిస్తూ ఏకతాటిపై నిలుస్తున్నారు. ఫలితంగా జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎక్కువగా ఏకగ్రీవం వైపే మొగ్గు చూపుతున్నాయి. మొదటివిడత నామినేషన్ల ఉప సంహరణ గడువు గురువారం ముగిసింది. 193 గ్రామపంచాయతీలకు గాను 52 సర్పంచ్, 727 వార్డు స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి పలు చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఒక్కో గ్రామంలో రూ.90 లక్షలకు పైగా వ్యయంతో జరుగుతున్న అభివృద్ధి స్పష్టంగా కని్పస్తోంది. తాజాగా ఏకగ్రీవమయ్యే గ్రామ పంచాయతీలకు జనాభా ప్రాతిపదికన ఇచ్చే ప్రోత్సాహక మొత్తాన్ని కూడా పెంచింది. దీనివల్ల గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవచ్చన్న ఉద్దేశంతో ప్రజలు కలసికట్టుగా ఏకగ్రీవాలకు ‘ సై ’ అంటున్నారు.
ఫ్యాక్షన్‌కు గుడ్‌బై
అక్షరాస్యత శాతం పెరగడం, రాజకీయంగా చైతన్యం రావడం వల్ల పలు గ్రామాల్లో యువత ఫ్యాక్షన్‌కు గుడ్‌బై చెబుతూ.. గ్రామాభివృద్ధికి నడుం బిగిస్తోంది. గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలంటేనే డబ్బు, మద్యం ఏరులై పారేవి. పైపెచ్చు గ్రామాధిపత్యం కోసం ఒకరిపై ఒకరు కక్షలు పెంచుకొని పచ్చని పల్లెలు కాస్తా రావణ కాష్టంలా మారేవి. అయితే.. ఇటీవలి కాలంలో అభివృద్ధి కళ్లముందే కనిపిస్తుండడంతో గ్రామీణుల దృక్పథంలోనూ మార్పువచ్చింది. కక్షలకు పోకుండా గ్రామాభివృద్ధే లక్ష్యంగా ఐకమత్యంతో ముందుకు సాగుతున్నారు. ఈ నేపథ్యంలోనే మెజారిటీ గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అవుతుండడంతో ఎన్నికల అధికారులు కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు.
‘ఏక’మయ్యారు..
మొదటి విడతలో నంద్యాల, కర్నూలు రెవెన్యూ డివిజన్ల పరిధిలోని 12 మండలాలకు చెందిన 193 గ్రామ పంచాయతీలు, 1,922 వార్డులకు సంబంధించి నామినేషన్లను స్వీకరించారు. నామినేషన్ల ఉప సంహరణకు చివరి రోజైన 4వ తేదీ (గురువారం) సాయంత్రానికి 52 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇదే స్ఫూర్తితో మిగిలిన మూడు విడతల గ్రామ పంచాయతీ ఎన్నికల్లోనూ ఇంతకంటే ఎక్కువగా ఏకగ్రీవమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.