
రెడ్‌బుక్ కుట్రల కోసం చంద్రబాబు ప్రభుత్వం, సిట్ అధికారులు ఏకంగా న్యాయ వ్యవస్థకే అగౌరవం కలిగిస్తుండడం విస్మయపరుస్తోంది. న్యాయస్థానం కంటే ముందుగా అక్రమ కేసులో చార్జ్‌షీట్ వివరాలను ఈనాడు–ఈటీవీ, ఆంధ్రజ్యోతి–ఏబీఎన్, టీవీ5, మహాన్యూస్ చానళ్లకు సిట్ అధికారులు తెలియజేయడమే దీనికి నిదర్శనం. అక్రమ కేసులో ప్రాథమిక చార్జ్‌షీట్‌ను సిట్ అధికారులు న్యాయస్థానంలో శనివారం రాత్రి సమర్పించారు.
శనివారం(జులై 20) ఉదయం మార్కెట్‌లోకి వచ్చిన ఈనాడు పత్రికలో ఆ చార్జ్‌షీట్ వివరాలు ప్రచురితం కావడం గమనార్హం. రాజ్యాంగ నిబంధనల ప్రకారం కోర్టులో సమర్పించే వరకు చార్జ్‌షీట్‌లో ఉన్న వివరాలు ఎవరికీ తెలియకూడదు. ఆ చార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్టు న్యాయస్థానం ప్రకటించాలి. అనంతరం కోర్టు ద్వారానే చార్జ్‌షీట్ కాపీని ఈ కేసుతో సంబంధం ఉన్నవారు తీసుకోవాలి.
ఈ నిబంధనలను చంద్రబాబు ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. కోర్టు కంటే ముందుగానే ఈనాడు, ఇతర ఎల్లో మీడియాకు చార్జ్‌షీట్ వివరాలను వెల్లడించింది. ఎంత పక్కాగా అంటే చార్జ్‌షీట్ ఎన్నిపేజీలు ఉన్నాయి...? అందులోని వివరాలన్నీ యథాతథంగా ఎల్లో మీడియా ముందే ప్రచురించింది. టీడీపీ అనుకూల ఎల్లో మీడియా టీవీ చానళ్లు చార్జ్‌షీట్‌లోని వివరాలను శనివారం ఉదయం నుంచే ప్రసారం చేశాయి. అంటే.. చంద్రబాబు ప్రభుత్వం న్యాయవ్యవస్థ కంటే ఎల్లో మీడియాకే పెద్దపీట వేస్తోందనన్నది మరోసారి స్పష్టమైంది.