చీఫ్‌ జస్టిస్‌ స్థానాన్ని కించపరిచారు! 

AP High Court Hearing On GO No1 Chief Justice Key Comments - Sakshi

వెకేషన్‌ బెంచ్‌ తీరును తప్పుబట్టిన సీజే ధర్మాసనం

డీఫాక్టో ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరించారు..

ప్రతి వెకేషన్‌ జడ్జి ఇలాగే వ్యవహరిస్తే వ్యవస్థ ఏమవుతుంది?

ఇది తేలిగ్గా తీసుకునే విషయం ఎంత మాత్రం కాదు

వెకేషన్‌ కోర్టులో ఏం జరిగిందో ప్రతిదీ తెలుసు

మాకు తెలియదనుకుంటే అది పెద్ద పొరపాటు

మూలాల్లోకి వెళ్లి ఈ వ్యవహారాన్ని తేలుస్తాం

సాక్షి, అమరావతి: సెలవుల్లో ఎలాంటి అత్యవసర కేసులను విచారించాలో ప్రధాన న్యాయమూర్తి (సీజే) పరిపా­ల­నాపరంగా నిర్దిష్ట ఆదేశాలు జారీ చేసినప్పటికీ అందుకు విరుద్ధంగా జస్టిస్‌ బట్టు దేవానంద్‌ నేతృత్వంలోని వెకేషన్‌ బెంచ్‌ వ్యవహరించడాన్ని సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ నేతృత్వంలోని హైకోర్టు ధర్మాసనం తీవ్రంగా తప్పు­బట్టింది. సంక్రాంతి సెలవుల సందర్భంగా వెకేషన్‌ బెంచ్‌ వ్యవహ­రించిన తీరు చాలా దురదృష్టకరమంది.

ఆ బెంచ్‌ డీఫాక్టో ప్రధాన న్యాయ­మూర్తిలా వ్యవహరించిందని ఆక్షేపించింది. సీజే నిర్దేశించిన ఆదేశాలకు విరు­ద్ధంగా సెలవుల్లో ఓ ప్రజా ప్రయో­జన వ్యాజ్యాన్ని విచారించడం ద్వారా సీజే స్థానాన్ని వెకేషన్‌ బెంచ్‌ కించపరిచిందని ఘాటుగా వ్యాఖ్యానించింది. ప్రతి వెకేషన్‌ జడ్జి ఇలాగే వ్యవహరిస్తే వ్యవస్థ ఏమవుతుందంటూ ఆందోళన వ్యక్తం చేసింది. ఇలాంటి వాటిని అనుమతిస్తే రేపు ప్రతి వెకేషన్‌ జడ్జి ప్రధాన న్యాయమూర్తిలా వ్యవహరిస్తారని వ్యాఖ్యానించింది. ఇది తేలిగ్గా తీసుకునే విషయం ఎంత మాత్రం కాదని, మూలాల్లోకి వెళ్లి ఈ వ్యవహారాన్ని తేలుస్తామని సీజే ధర్మాసనం తేల్చి చెప్పింది.

వెకేషన్‌ కోర్టులో ఏం జరిగిందో తనకు ప్రతిదీ తెలుసని సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా పేర్కొన్నారు. హైకోర్టు రిజిస్ట్రీ తనకు ఎప్పటికప్పుడు ప్రతి విషయాన్ని నివేదించిందన్నారు. తనకు ఏమీ తెలియదనుకుంటే అది పెద్ద పొరపాటే అవుతుందని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే సొంతమైన అధికారాల విషయంలో తాను నిక్కచ్చిగా వ్యవహరించి తీరుతానన్నారు. ఇదే సమయంలో జీవో 1పై వెకేషన్‌ బెంచ్‌ ముందు పిల్‌ దాఖలు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ తీరును సైతం సీజే ధర్మాసనం తప్పుబట్టింది. ఏమంత అత్యవసరం ఉందని  హడావుడిగా పిల్‌ దాఖలు చేశారని రామకృష్ణను నిలదీసింది. మీరేమైనా ధర్నా చేశారా? రాస్తారోకో చేశారా? సమావేశాలు పెట్టారా? ఏం చేస్తే మీకు ఇబ్బంది కలిగింది? అని ధర్మాసనం ప్రశ్నించింది.

తక్షణ ఇబ్బంది లేనప్పుడు ఏం మునిగిపోయిందని సెలవుల్లో అత్యవసర పిటిషన్‌ దాఖలు చేశారని ప్రశ్నించింది. మధ్యంతర ఉత్తర్వులు పొందిన తరువాత ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? అంటే అదీ లేదని, ఇలాంటి పిటిషన్‌ వేసి తీవ్ర గందరగోళ పరిస్థితి సృష్టించారని రామకృష్ణతో పాటు ఆయన తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీ కుమార్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. కోర్టు నుంచి ఉత్తర్వులు పొందేందుకు ఇలాంటి పరిస్థితిని సృష్టించారని, దీనికి సమాధానం చెప్పి తీరాలంది. మీ చర్యలు ప్రధాన న్యాయమూర్తికి బాధ కలిగించాయంది. ఇలాంటి చర్యలు వ్యవస్థకు ఎంత మాత్రం మంచివి కాదంది. జీవో 1పై రామకృష్ణ దాఖలు చేసిన పిల్‌లో ఇరుపక్షాల వాదనలు ముగియడంతో పాటు ఇదే అంశంపై బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్‌ పార్టీల నేతలు వేర్వేరుగా దాఖలు చేసిన వ్యాజ్యాలపై మంగళవారం విచారణ జరుపుతామని ధర్మాసనం ప్రకటించింది.

సెలవుల్లో వ్యూహాత్మకంగా పిల్‌..
రోడ్లు, రోడ్‌ మార్జిన్‌లలో బహిరంగ సభల ఏర్పాటును నియంత్రిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 2న జారీ చేసిన జీవో 1ని సవాల్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ సంక్రాంతి సెలవుల్లో అత్యవర కేసులను మాత్రమే విచారించే హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ ముందు వ్యూహాత్మకంగా పిల్‌ æ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తులు జస్టిస్‌ దేవానంద్, జస్టిస్‌ కృపాసాగర్‌ ధర్మాసనం జీవో 1 అమలును నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

వీటిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. రామకృష్ణ వ్యాజ్యంపై విచారణ జరపాలని సీజే ధర్మాసనానికి స్పష్టం చేసిన సంగతి విదితమే.   సీజే జస్టిస్‌ ప్రశాంత్‌ కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజుల ధర్మాసనం సోమవారం ఈ వ్యాజ్యంపై విచారణ జరిపింది. 

ఆ విచక్షణాధికారం వెకేషన్‌ కోర్టుకుంది...
పిటిషనర్‌ రామకృష్ణ తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది రాజు రామచంద్రన్‌ వాదనలు విని­పిస్తూ వెకేషన్‌ కోర్టులో ఎలాంటి కేసులను విచారించాలన్న అంశంపై హైకోర్టు రిజిస్ట్రీ నోటిఫికేషన్‌ను చదివి వినిపించారు ఈ నోటిఫికేషన్‌ ప్రకారం పరిపాలన, విధానపరమైన నిర్ణయాలపై వెకేషన్‌ కోర్టు విచారణ జరపరాదన్నారు. అయితే ప్రభుత్వ చర్యలు పౌరుల ప్రాథమిక హక్కులను హరించే విధంగా ఉన్నాయని కోర్టు భావించినప్పుడు విచారణ జరిపే విచక్షణాధికారం వెకేషన్‌ కోర్టుకు ఉందన్నారు. ప్రస్తుత వ్యాజ్యాన్ని కూడా వెకేషన్‌ కోర్టు అదే తరహాలో భావించి విచారణ జరిపిందని చెప్పారు.

ఫలానా తరహా వ్యాజ్యాలను మాత్రమే విచారించాలని నోటిఫికేషన్‌లో ఉందని, అదే సమయంలో ఫలానా తరహా వ్యాజ్యాలను విచారించకూడదని ఎక్కడా లేదన్నారు. ఈ సమయంలో సీజే స్పందిస్తూ.. సెలవుల్లో ప్రతి కేసునూ ముఖ్యమైనదిగానే భావించి వెకేషన్‌ కోర్టులు విచారణ జరుపుతూపోతే ఇక వ్యవస్థ ఏం కావాలని ప్రశ్నించారు. ఈ వ్యవహారం మీరు చెబుతున్నంత సింపుల్‌ విషయం కాదని స్పష్టం చేశారు. ప్రధాన న్యాయమూర్తికి మాత్రమే సొంతమైన హక్కులు ఏమిటో తనకు బాగా తెలుసని, వాటి విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించి తీరుతానని, ఇందులో ఎలాంటి సందేహానికి తావు లేదని తేల్చి చెప్పారు.

ప్రజలను కలుసుకునే హక్కు పార్టీలకు ఉంది..
అనంతరం రాజు రామచంద్రన్‌ వాదనలను కొనసాగిస్తూ జీవో 1లోని అంశాలను చదివి వినిపించారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై బహిరంగ సభలను నిషేధించారని పేర్కొన్నారు. సాధారణంగా పాదయాత్రలన్నీ జాతీయ రహదారుల వెంబడే సాగుతాయన్నారు. మునిసిపల్, పంచాయతీ రోడ్లు ఇరుకుగా ఉంటాయని, అక్కడ బహిరంగ సభలకు అనుమతినిస్తే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని చెబుతున్నారన్నారు. అరుదైన, అసాధారణ పరిస్థితుల్లో మాత్రం అనుమతిస్తామని చెబుతున్నారని, అయితే ఆ పరిస్థితులు ఏమిటో నిర్దిష్టంగా చెప్పడం లేదన్నారు.

అధికార పార్టీ సభలు నిర్వహించుకునేందుకు ఈ అరుదైన, అసా­ధారణ పరిస్థితులను కారణంగా చూపి పోలీసులు అనుమతులిస్తారని, ప్రతిపక్షాల  విషయంలో భిన్న వైఖరిని అవలంబిస్తారన్నారు. ప్రజలను కలుసు­కునే హక్కు రాజకీయ పార్టీలకు ఉందని, దీన్ని జీవో 1 హరిస్తోందన్నారు. రాజకీయ యాత్రలు భావ ప్రకటన స్వేచ్ఛలో భాగమన్నారు. సభలు, యా­త్రలు ఎక్కడ ఎలా నిర్వహించాలన్నది ఆయా పార్టీలు నిర్ణయిస్తాయని, షరతులతో అనుమ­తులి­వ్వడం ఇప్పటివరకు జరుగుతూ వచ్చిందన్నారు.

మా అభ్యంతరాలను సైతం వెకేషన్‌ బెంచ్‌ వినలేదు..
రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్‌.శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ వెకేషన్‌ కోర్టులో ఏం జరిగిందో ధర్మాసనానికి వివరించారు. పిల్‌ను విచారించే విషయంలో తన అభ్యంతరాన్ని వినేందుకు సైతం వెకేషన్‌ బెంచ్‌ నిరాకరించిందన్నారు. సాధారణంగా హౌస్‌మోషన్, లంచ్‌మోషన్‌ రూపంలో పిటిషన్లు దాఖలు చేసేటప్పుడు కారణాలను స్పష్టంగా వివరిస్తారని, ప్రస్తుత వ్యాజ్యంలో మాత్రం అలాంటిదేం లేదన్నారు.

ఈ వ్యాజ్యాన్ని విచారించే రోస్టర్‌ లేదని చెప్పినా  వెకేషన్‌ బెంచ్‌ వినిపించుకోలేదన్నారు. సీజే నిర్ణయించిన రోస్టర్‌కు భిన్నంగా వెకేషన్‌ బెంచ్‌ మరో రోస్టర్‌ను నిర్ణయించిందన్నారు. వెకేషన్‌ కోర్టులో సాధారణంగా అత్యవసర కేసులను సీజే అనుమతి తీసుకున్నాకే విచారిస్తారని, ఇది సంప్రదాయంగా వస్తోందన్నారు. పిటిషనర్‌ బెంచ్‌ హంటింగ్‌కు పాల్పడ్డారన్నారు.

రోడ్‌షోలపై ఎలాంటి నిషేధం లేదు..
రోడ్‌ షోలు, ఊరేగింపులను జీవో 1 నిషేధించ­డం లేదని ఏజీ పేర్కొన్నారు. కేవలం రోడ్లపై జరి­గే సభలకు మాత్రమే ఆ జీవో వర్తిస్తుందని తెలిపారు.  చంద్రబాబు కందు­కూరు రోడ్‌పై  సభ కారణంగా ప­లు­వురు మరణించగా మరి­కొం­దరు గాయపడ్డార­న్నారు. ఇలాంటి ఘటన­లను నివారించేందుకు చట్ట నిబంధనలను అనుసరించి పోలీసులకు తగిన మార్గనిర్దేశం చేస్తూ జీవో 1 జారీ అయిందన్నారు. నిర్దిష్ట ప్రదే­శం లేదా ప్రాంతంలో సభ నిర్వహించుకునేందుకు అనువైన మైదానంతో పాటు ప్రత్యా­మ్నాయ మార్గాలేవీ ఆచరణ సా­ధ్యం కాని పరిస్థి­తులుంటే అలాంటి సమయంలో అసాధారణ పరిస్థితుల కింద అనుతులు ఇస్తామన్నారు.

ఊ­హల ఆధారంగా రామకృష్ణ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారన్నారు. కందుకూరుతో పాటు గుంటూరులో సైతం తొక్కిస­లాట జరిగిందని, ఈ రెండు ఘటనలపై విచారణ కమిషన్‌ను నియమించినట్లు శ్రీరామ్‌ ధర్మాసనం దృష్టికి తెచ్చారు. రోడ్‌ షోలు, ఊరే­గింపులపై ఎలాంటి నిషేధం లేదని పునరుద్ఘా­టించారు. ఈ సమ­యంలో సీజే జోక్యం చేసు­కుం­టూ.. రోడ్‌షోలు, ఊరేగింపులపై నిషేధం లేదన్న వాదనను రికార్డ్‌ చేయమంటారా? అని ప్రశ్నించగా నిస్సందేహంగా రికార్డ్‌ చేయవచ్చని ఏజీ నివేదించారు.

ఈ విషయాన్ని తమ కౌంటర్‌లో సైతం స్పష్టం చేశామన్నారు. ఏజీ వాద­నలు ముగియడంతో రాజు రామచంద్రన్‌ జోక్యం చేసుకుంటూ జీవో 1 విషయంలో మధ్యంతర ఉత్తర్వుల కోసం అభ్యర్థించారు.  ఈ వ్య­వ­హారంలో వాద­నలు ఇంకా పూర్తి కాలేదని, మ­ధ్యం­తర ఉత్త­ర్వులు సాధ్యం కాదని ధర్మాసనం తేల్చి చెప్పింది. జీవో 1పై బీజేపీ నేత కన్నా లక్ష్మీ­నారాయణ, టీడీపీ నేత కొల్లు రవీంద్ర, పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజుల వ్యా­జ్యాలపై మంగళవారం విచా­రణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది.  

చదవండి: స్వచ్ఛ జల్‌ సే సురక్ష.. దేశంలోనే రెండో స్థానంలో నిలిచిన ఏపీ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top