ఎస్‌ఈసీ ఉత్తర్వులు సరి కాదు

AP High Court allowed Peddireddy Ramachandra Reddy to speak with media and press - Sakshi

మీడియా, ప్రెస్‌తో మాట్లాడేందుకు మంత్రి పెద్దిరెడ్డికి హైకోర్టు అనుమతి

అయితే ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడొద్దని ఆదేశం

సాక్షి, అమరావతి: పంచాయతీ ఎన్నికలయ్యేంత వరకు మీడియా, ప్రెస్‌తో మాట్లాడకూడదని పంచాయతీరాజ్‌ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని ఆదేశిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సమర్థిస్తూ సింగిల్‌జడ్జి ఇచ్చిన ఆదేశాలను హైకోర్టు ధర్మాసనం రద్దు చేసింది. మీడియా, ప్రెస్‌తో మాట్లాడేందుకు మంత్రికి అనుమతినిచ్చింది. అయితే ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడరాదని ఆయన్ను ఆదేశించింది. అలాగే ఎన్నికల కమిషనర్‌ గురించి వ్యక్తిగతంగా మాట్లాడబోనంటూ పెద్దిరెడ్డి ఇచ్చిన హామీని గుర్తుంచుకోవాలని సూచించింది. ప్రాథమిక ఆధారాలను బట్టి చూస్తే మీడియా, ప్రెస్‌తో మాట్లాడకుండా ఉత్తర్వులివ్వడం సరైన చర్య కాదంది. అయితే ఎన్నికల పవిత్రతను, నిష్పాక్షికతను కాపాడాల్సిన అవసరం ఉందంది. ఎన్నికల కమిషనర్‌ చర్యలపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునని స్పష్టం చేసింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ అరూప్‌కుమార్‌ గోస్వామి, న్యాయమూర్తి జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్‌లతో కూడిన బుధవారం ఉత్తర్వులిచ్చింది. పంచాయతీ ఎన్నికలు ముగిసేంత వరకు పెద్దిరెడ్డిని ఇంటికే పరిమితం చేస్తూ నిర్బంధ ఉత్తర్వులు జారీ చేయడంతోపాటు ఆయన్ను మీడియా, ప్రెస్‌తో మాట్లాడకుండా నియంత్రిస్తూ ఎన్నికల కమిషనర్‌ ఇటీవల ఆదేశాలివ్వడం తెలిసిందే. ఈ ఉత్తర్వులను పెద్దిరెడ్డి హైకోర్టులో సవాలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సింగిల్‌జడ్జి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులు మంత్రిని ఇంటికే పరిమితం చేస్తూ ఇచ్చిన నిర్బంధ ఉత్తర్వులను రద్దు చేశారు. అయితే మీడియా, ప్రెస్‌తో మాట్లాడవద్దన్న ఎన్నికల కమిషనర్‌ ఉత్తర్వులను సమర్థించారు. దీనిపై పెద్దిరెడ్డి ధర్మాసనం ముందు అప్పీలు చేశారు.

వాదనలు విన్న సీజే ధర్మాసనం బుధవారం ఉదయం ఉత్తర్వులు వెలువరించింది. పెద్దిరెడ్డి తన అప్పీలులో ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదిగా చేర్చారని, ఆయన వాదనలు వినకుండా ఈ వ్యాజ్యాన్ని పరిష్కరించడం సబబు కాదంది. దీంతో నిమ్మగడ్డను ప్రతివాదిగా తొలగిస్తూ మెమో దాఖలు చేస్తామని పెద్దిరెడ్డి తరఫు న్యాయవాది సీవీ మోహన్‌రెడ్డి తెలిపారు. ఈ నేపథ్యంలో ధర్మాసనం నిమ్మగడ్డ పేరును ప్రతివాదుల జాబితా నుంచి తొలగించింది. అనంతరం పెద్దిరెడ్డి అప్పీలును పరిష్కరిస్తూ ఉత్తర్వులిచ్చింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top