‘ఉపాధి’లో వ్యవసాయానికే పెద్దపీట 

AP Govt spends on agriculture and allied sectors 70percent in Employment Guarantee Works - Sakshi

70 శాతం నిధులు వ్యవసాయ, అనుబంధ రంగాల పనులకే ఖర్చు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

2018–19లో ఈ కేటగిరీ పనులకు చేసిన ఖర్చు 47.81 శాతమే

ఒకపక్క.. ‘వరి పంట కోతకు ఎకరాకు రూ.3 వేలు ఖర్చయ్యింది. ఒక్కొక్కరికి కనీసం రూ.500 కూలీ ఇస్తేగానీ గ్రామాల్లో పనికి వచ్చే పరిస్థితి లేదు. ఉపాధి హామీ పథకం పనుల వల్లే గ్రామాల్లో వ్యవసాయ కూలీ రేట్లు పెరిగాయి..’ అని రైతుల ఆరోపణలు. మరోవైపు.. ఉపాధి హామీ పథకం వచ్చిన తర్వాత గ్రామాల్లో అట్టడుగు స్థాయిలో ఉండే నిరుపేద కుటుంబాల్లో పిల్లలను చదివించుకునే శక్తి పెరగడంతో పాటు ఇంటిలో ఫ్యాను, టీవీ వంటి వస్తువులను కూడా సమకూర్చుకోగలుగుతున్నారని ఒక సర్వేలో తేలింది. ఈ పరిస్థితుల్లో మధ్యే మార్గంగా.. వ్యవసాయంతో ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానించాలని రైతు సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తుండగా.. అలా చేస్తే ఉపాధి హామీ పథకం ఉద్దేశాలే పక్కదారి పడతాయన్న భావనతో కేంద్రం ఉంది. వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఈ పరిస్థితులన్నిటినీ పరిగణనలోకి తీసుకుని, మన రాష్ట్రంలో రైతుల ఆకాంక్షలకు అనుగుణంగా, ఉపాధి హామీ చట్టానికి లోబడి అనుమతి ఉన్న పనుల మేరకే.. వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన పనుల కల్పనకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టింది.

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం కింద పెడుతున్న ఖర్చులో 70 శాతం నిధులను.. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయం, వాటి అనుబంధ రంగాలకు సంబంధించిన పనులకే వ్యయం చేస్తోంది. ఈ విధంగా ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్‌ ఒకటవ తేదీ నుంచి డిసెంబర్‌ 10 వరకు రాష్ట్రంలో ఈ పథకం ద్వారా రూ.7,111 కోట్లు ఖర్చు చేస్తే, అందులో రూ.4,944 కోట్ల మేర వ్యవసాయం, అనుబంధ రంగాలపనులకే ఖర్చు పెట్టింది. ఉపాధి హామీ పథకం అమల్లోకి వచ్చాక వ్యవసాయ పనులకు ఇంత శాతం ఖర్చు పెట్టడం ఇదే మొదటిసారి. కాగా గత తెలుగుదేశం ప్రభుత్వం ఈ పనులకు గాను 2017–18లో 52 శాతం, 2018–19లో 47 శాతం మాత్రం ఖర్చు చేయడం గమనార్హం.

165 రకాల పనులకు ప్రాధాన్యం 
పార్లమెంట్‌లో ఆమోదం పొందిన ఉపాధి హామీ పథకం చట్టం ప్రకారం.. మొత్తం 260 రకాల పనులు ఈ పథకం ద్వారా చేపట్టవచ్చు. అందులో 165 పనులను వ్యవసాయ, వాటి అనుబంధ రంగాలకు సంబంధించినవిగా వర్గీకరించారు. దీనితో నిధుల ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం ఈ 165 రకాల పనులకే అధిక ప్రాధాన్యత నిస్తోంది. ఈ ఏడాది వ్యవసాయ కేటగిరీలో రూ.6,709 కోట్ల విలువ చేసే 6,82,022 పనులను చేపట్టాలని ప్రతిపాదించగా.. ఈ నెల 10వ తేదీ వరకు 4,23,781 పనులకు గాను రూ.రూ.4,944 కోట్లు ఖర్చు చేశారు.

పంటకు ముందు.. పంట తర్వాత పనులన్నీ.. 
కొన్ని రకాల పండ్ల తోటల పెంపకానికి మినహా పంటకు సంబంధించిన పనులు ఉపాధి హామీ పథకం కింద చేయడానికి నిబంధనలు అంగీకరించవు. అయితే, అన్ని రకాల పంటలకు సంబంధించి ఆ పంట వేయడానికి ముందు, పంట కోత అనంతరం రైతుకు అవసరమైన దాదాపు అన్ని రకాల పనులను చేపట్టవచ్చు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుకు మేలు చేసేలా..  పంట వేయడానికి ముందు వ్యవసాయ భూమిని చదును చేసుకోవడానికి,  పొలానికి నీరు వచ్చే చిన్న చిన్న సాగునీటి కాల్వల్లో పూడిక తీయడం వంటి పనులు ఉపాధి హామీ పథకం కింద చేపడుతోంది. పండిన పంట దాచుకోవడానికి గిడ్డంగుల నిర్మాణానికీ వీలు కల్పించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయా పనులకు ప్రాధాన్యత ఇస్తోంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top