పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌కు మహర్దశ

AP Govt Run Full Fledged Commercial Services From Puttaparthi Airport - Sakshi

విమానాశ్రయ నిర్వహణ చేపట్టే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం

6 నెలల్లో కార్యకలాపాలు ప్రారంభించాలని ప్రణాళిక

నేడు సత్యసాయి ట్రస్టు సభ్యులతో మంత్రి మేకపాటి సమావేశం

సాక్షి, అమరావతి: అనంతపురం జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్‌పోర్ట్‌ నుంచి పూర్తిస్థాయి వాణిజ్య సర్వీసులను నడిపే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే కర్నూలు జిల్లా ఓర్వకల్లు విమానాశ్రయాన్ని అందుబాటులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఇప్పుడు పుట్టపర్తి విమానాశ్రయం ద్వారా అనంతపురం జిల్లాకు విమాన సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించింది. కొంతకాలంగా నిరుపయోగంగా ఉన్న విమానాశ్రయాన్ని ప్రభుత్వం తీసుకొని నిర్వహించడానికి గల మార్గాలపై సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు రాష్ట్ర ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు భరత్‌ రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు.

పారిశ్రామికంగా చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్న అనంతపురం జిల్లాకు ఈ విమానాశ్రయం మరింత కలిసి వస్తున్న నేపథ్యంలో దీన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి ఏపీ ఏవియేషన్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (ఏపీఏడీసీఎల్‌) ప్రణాళిక సిద్ధం చేసింది. ఇందులో భాగంగా రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ఈ నెల 5న సత్యసాయి ట్రస్ట్‌ సభ్యులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రానున్న 6 నెలల్లో పుట్టపర్తి విమానాశ్రయాన్ని వాణిజ్యపరంగా అందుబాటులోకి తీసుకురావాలని ఏపీఏడీసీఎల్‌ లక్ష్యంగా పెట్టుకుంది. రన్‌వే విస్తరణకు, ప్రహరీగోడ నిర్మాణానికి, 100 మంది ప్రయాణికులు కూర్చునే విధంగా టెర్మినల్‌ భవనాన్ని విస్తరిస్తే సరిపోతుందని, ఇందుకోసం కొంత స్థలం సేకరించాల్సి ఉంటుందని ఏపీఏడీసీఎల్‌ అధికారులు తెలిపారు.

డ్రోన్‌ హబ్‌గా పుట్టపర్తి
డ్రోన్‌ హబ్‌గా అభివృద్ధి చేయడానికి పుట్టపర్తి అనుకూలంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. బెంగళూరు, హైదరాబాద్‌ వంటి పట్టణాలకు దగ్గరగా ఉండటంతో పుట్టపర్తిని వేగంగా డ్రోన్‌ హబ్‌గా తీర్చిదిద్దవచ్చని భరత్‌ రెడ్డి చెప్పారు. ఇప్పటికే అనంతపురం జిల్లాలో కంటికి కనిపించనంత దూరం వెళ్లే డ్రోన్‌ పరీక్షలను నిర్వహించడానికి కేంద్రం ఆమోదం తెలిపిన సంగతి తెలిసిందే. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top